ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలనిపిస్తోంది
ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలనిపిస్తోంది
ఎరిక్ ఏగ్లేషియాస్ : సుబేమేలా రాడియో
నిడివి : 3 ని. 52 సె. ::: హిట్స్ : 1,11,37,259
స్పానిష్ సింగర్ ఎరిక్ ఏగ్లేషియాస్, క్యూబన్ గాయకుడు డెసెమెర్ బ్యూనో, యు.ఎస్. సింగర్స్ జియాన్ అండ్ లెనాక్స్ (య.ఎస్.సింగర్స్).. ముగ్గురూ కలిసి చేసిన వీడియో సాంగ్ ‘సుబేమేలా రాడియో’. రాడియో హిట్ స్పీడ్‌ను చూస్తుంటే యువ సంగీత అభిమానులు నిద్రలు మానుకుని మరీ ఈ వీడియోకు రివైండ్ కొడుతున్నట్లుగా ఉంది. పవన్ కల్యాణ్ ‘ఖుషీ’ సినిమాలోని ‘యే మేరా జహా’ టైప్ తెలుగు పాటలకు చక్కగా పనికొచ్చే ట్యూట్ ఇది. వినసొంపుగా, ఉత్సాహం కలిగించేలా ఉంది. స్పానిష్‌లో ‘సుబేమేలా రాడియో’ అంటే.. ‘రేడియో వాల్యూమ్ పెంచు’ అని అర్థం. ‘నాకు నచ్చిన పాట వస్తోంది. కొంచెం వాల్యూమ్ పెంచు. విని, నువ్వూ అనుభూతి చెందు’ అని ఎగ్లేషియాస్ పాటను ప్రారంభిస్తాడు. అంతలోనే డెసెమెర్ బ్యూనో వచ్చి, ‘నా బాధను తగ్గించడానికి కొద్దిగా మధువును ప్రసాదించు.
ఇవాళ మనం చంద్రుడితోనూ, సూర్యుడితోనూ జాయిన్ అవుదాం’ అంటాడు. పాటను ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్లిద్దరే మార్చి మార్చి అందుకుంటుంటారు. సెకండ్ హాఫ్‌లో జియాన్, లెనాక్స్ స్వరం కలుపుతారు. ‘నీ ప్రేమ కోసం పిచ్చిగా వెదుకుతున్నా. ఒంటరిగా నన్నొదిలెయ్కు, నిన్ను ప్రాధేయపడుతున్నా. ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలనిపిస్తోంది నాకు. క్షణమైనా నిరీక్షించలేకపోతున్నా’ అని విలవిలలాడతారు. బాధను సంతోషంగా వ్యక్తం చేసే విద్యను ‘సుబేమేలా రాడియో’ను చూసి సాధన చేయవచ్చు.
కాంబోడియా కుటుంబాల చేదు జ్ఞాపకాలు
ఫస్ట్ దె కిల్డ్ మై ఫాదర్ : ట్రైలర్ టీజర్
నిడివి : 2 ని. 38 సె. ::: హిట్స్ : 10,75,641
‘నెట్‌ఫ్లిక్స్’లో త్వరలో విడుదల కాబోతున్న సినిమా.. ‘ఫస్ట్ దె కిల్డ్ మై ఫాదర్’. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ఈ బయోగ్రఫికల్ హిస్టారిక్ థ్రిల్లర్ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో విడుదలై సంచలనం సృష్టించిన నాన్–ఫిక్షన్ నవల ‘ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్ : ఎ డాటర్ ఆఫ్ కాంబోడియా రిమెంబర్స్’కు దృశ్యరూపమే ఈ సినిమా. కాంబోడియా రచయిత్రి ‘లో నా’ రాసిన ఆ పుస్తకంలోని చేదు జ్ఞాపకాల సముదాయాల్లోంచి కొన్నింటిని తీసుకుని వాస్తవాల వక్రీకరణ జరగకుండా అతి జాగ్రత్తగా, బాధ్యతగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నా రట జోలీ. కాంబోడియాలో ఖ్మేర్రూజ్ పార్టీ హయాంలోని దురాగతాలు కుటుంబాలను ఎలా ఛిన్నాభిన్నం చేసిందీ ఇందులో చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ బయటి థియేటర్లలో విడుదల కావడం లేదు. నెట్‌ఫ్లిక్స్ (నెట్ మూవీ) చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
వియ్ మిస్‌యూ ఒబామా
క్రౌడ్స్ ఫ్లాక్ టు ఒబామా ఇన్ ఎన్.వై.సి.
నిడివి : 1 ని. 3 సె. :::హిట్స్ : 1,71,146
డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రెసిడెంట్‌గా వచ్చినా, పోయిన పాత ప్రెసిడెంటును మాత్రం అమెరికన్లు మర్చిపోలేకపోతున్నారు! ట్రంప్‌ను ప్రతిదానికీ ఒబామాతో పోల్చి చూస్తున్నారు. ఒక్క విషయంలో మాత్రం ట్రంప్‌కీ, ఒబామాకూ పోల్చలేనంత తేడా ఉంది. ట్రంప్ బిజీ బీజీ అయితే, ఒబామా ఫ్రీబర్డ్. సెక్యూరిటీ ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహంగంలా తిరుగుతున్నారు. ఇటీవల ఒబామా అకస్మాత్తుగా న్యూయార్క్ సిటీలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన్ని గుర్తుపట్టిన అమెరికన్ పౌరులు ఆనందంతో ఆయన్ని చుట్టుముట్టబోయారు కానీ, స్పల్పంగానే అయినా ఆయనకు కాపుగా ఉన్న సిబ్బంది భద్రంగా ఆయన్ని కారెక్కించారు. ఈ అపురూప సన్నివేశాన్ని సి.ఎన్.ఎన్. టీవీ పదేపదే ప్రసారం చేసి వీక్షకుల అభిమానాన్ని పొందింది. ఈ క్లిప్పింగ్‌ను చూసి, తాము కోల్పోయినదేదో తిరిగి దొరికినట్లుగా అమెరికన్ పౌరులలో ఎక్కువమంది ఫీలయ్యారని న్యూస్ రీడర్ వ్యాఖ్యానించారు. మీరూ చూడండి.