Fishing women
-
ఆమెకు సముద్రమే అన్నం ముద్ద
భారతదేశంలో చేపలు పట్టే లైసెన్సు ఉన్న ఏకైక మహిళ రేఖ కోవిడ్ విసిరిన మృత్యుకెరటాలకు ఏమాత్రం చలించలేదు. లాక్డౌన్ వల్ల, తుఫాన్ల వల్ల, గుండె ఆపరేషన్ కోసం ఎదురు చూస్తూ వేటకు రాలేని నిస్సహాయ భర్త వల్ల ఆమె ఓడిపోదలుచుకోలేదు. ఇంత పెద్ద సముద్రం అమ్మలా ఉంది నాకేం భయం అనుకుంది. రోజూ తీరంలో దొరికే సముద్రపు చిప్పలను ఏరి బతుకు వెళ్లమారుస్తుంది. నలుగురు ఆడపిల్లలు ఉన్నారామెకు. భర్తతో కలిపి ఐదుగురు పిల్లలు అనుకుంటూ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటోందామె. కేరళ త్రిచూర్ జిల్లాలోని ఎత్తాయి సముద్రతీరం లో రోజూ తెల్లవారు జామున ఆమె కనిపిస్తుంది. ఒక నీలిరంగు ప్లాస్టిక్ బాస్కెట్‌ను పట్టుకుని కెరటాల వెంట సాగుతూ దేనినో అన్వేషిస్తూ ఉంటుంది. దేనిని? సముద్రపు చిప్పల్ని (సాధారణ ఆల్చిప్పలు/అయిస్టర్ షెల్స్). ఆమె వాటిని ఏరుకుంటూ ఆ బుట్ట నిండేవరకూ అక్కడే తిరుగుతుంది. బుట్ట నిండితే 60 రూపాయలు వస్తాయి. ‘ఒక్కోసారి సగం బాస్కెట్ కూడా దొరకవు. అమ్మ ముఖం చాటేస్తుంది’ అని నవ్వుతుంది. ఆమె పేరు రేఖ. ఆమె అమ్మ అంటున్నది సముద్రాన్ని. నిజానికి ఆమె సముద్రంలో చేపలు పట్టాలి. కాని సముద్రపు చిప్పల్ని ఏరాల్సి వస్తోంది. ‘సముద్రంలో కెరటాలకు నేను ఎప్పుడూ భయపడలేదు. కాని జీవితంలో కెరటాలకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది’ అంటుంది నలభై ఏళ్ల రేఖ. సముద్రంలో రేఖ తొలి డీప్ ఫిషింగ్ లైసెన్స్ హోల్డర్ డీప్ ఫిషింగ్ లైసెన్స్‌ను పొందడం చాలా కష్టం. దానికి యోగ్యత సాధించాలంటే అనుభవం, అర్హత ఉండాలి. దానిని పొందడం మగవారికే సొంతం. కాని దేశంలో మొదటిసారి ఆ లైసెన్స్‌ను పొందిన ఏకైక మహిళ రేఖ. ‘సముద్రంలో నేను 50 కిలోమీటర్లు వెళ్లి చేపలు పట్టేదాన్ని’ అంటుంది రేఖ. ఇంటర్ వరకూ చదువుకున్న రేఖ 2016లో త్రిచూర్ నుంచి దేశంలో తొలి మహిళగా డీప్ ఫిషింగ్ లైసెన్స్ పొందినప్పుడు మీడియాలో చాలా కవరేజీ వచ్చింది. ఒక స్త్రీ చేపల వేటకు వెళ్లడం విశేషం అని అందరూ మెచ్చుకున్నారు. ‘పడవలో నా భర్త చేపల వేటకు వెళ్లే ప్రతిసారీ సహాయకులు వస్తారా రారా అని టెన్షన్ పడేవాడు. సముద్రంలో చేపల వేటలో... చేపలు పట్టడానికి పడవలో కనీసం ముగ్గురు ఉండాలి. నిజానికి వాళ్లకు కూలి ఇచ్చే స్థితి కూడా కాదు మాది. ఈ టెన్షన్ అంతా ఎందుకు.. నేను వస్తాను కదా అని తోడు బయలుదేరేదాన్ని. అలా భార్యను తీసుకుని వేటకు వెళ్లడానికి మగవాళ్లు ఇష్టపడరు. కాని నా భర్త సమ్మతించాడు. తోడు తీసుకుని వెళ్లి వేట చేయడం నేర్పాడు. నేను బాగా నేర్చుకున్నాను. నాకు సముద్రంలో ప్రతి అల ఆనుపానులు తెలుసు.’ అంటుంది రేఖ. కేరళలో చాలామంది స్త్రీలు బ్యాక్‌వాటర్స్‌లో చేపలు పడతారు. కాని సముద్రం మీదకు వెళ్లరు. ఇంకా చెప్పాలంటే సముద్రం మీదకు వెళ్లేందుకు వారిని ఎవరూ ప్రోత్సహించరు. రేఖ ఆ ధైర్యం చేయడం వారికి పెద్ద స్ఫూర్తిగా మారింది. ‘మా దగ్గర సాంకేతిక పరికరాలు, ఆధునిక జాకెట్లు ఏమీ ఉండవు. మాకు తెలిసిందల్లా సముద్ర దేవత కడలమ్మే. ఆమె మమ్మల్ని చూసుకుంటుంది’ అంటుంది రేఖ. కుటుంబ సభ్యులతో... ‘సముద్రంలో వేటకు వెళ్లాలంటే వలను నిర్వహించడం తెలియాలి. చాలాసార్లు చేపలు పడకపోగా వలల్ని సముద్రపు పందులు (స్కాటోప్లేన్స్) కొరికేస్తాయి. నిరాశ పడక ఆ వలను రిపేరు చేసుకొని మళ్లీ వెళ్లాలి. సముద్రంలో వేట చావు–బతుకు, ఆశ నిరాశల మధ్య సాగుతుంది’ అంటుంది రేఖ. సెకండ్ వేవ్ సవాలు రేఖ జీవితం సజావుగా సాగుతుండేది. భర్త కార్తికేయన్‌తో వేటకు వెళ్లేది. ‘రాత్రంతా వేట చేసి తిరిగి వచ్చి పడ్డ చేపలను హార్బర్‌కు తీసుకెళ్లి అమ్మితే రోజుకు ఎంత లేదన్నా రెండు మూడు వేలు వచ్చేవి’ అంటుంది రేఖ. అయితే ఇలా రోజూ చేపలు పడలేదు. అయినా సగటున ముప్పయి వేల ఆదాయం అయితే వచ్చేది. రేఖకు నలుగురు ఆడపిల్లలు. సముద్ర తీరంలోనే ఆమెకో కచ్చా ఇల్లు ఉంది. పిల్లలను చదివించుకుంటూ జీవితం లాక్కువస్తుంటే హటాత్తుగా భర్త గుండెజబ్బు బయటపడింది. దానికి సర్జరీ అవసరం అని డాక్టర్లు అన్నారు. ఈలోపు సెకండ్ వేవ్ వచ్చి ఆ సర్జరీ కాస్త పోస్ట్‌పోన్ అయ్యింది. భర్త వేటకు వచ్చేలా లేడు. లాక్డౌన్ వల్ల సరుకు లావాదేవీలు స్తంభించి వేట సాగడం లేదు. తుఫాన్లు, భారీ వానలు కూడా పనికి అంతరాయం. ఏం చేయాలి? ఇల్లైతే గడవాలి. ‘సముద్రాన్నే నమ్ముకున్నాను. ధైర్యంగా ఉన్నాను’ అంటుంది రేఖ. తీరంలో దొరికే సాధారణ అయిస్టర్ షెల్స్‌ను కాల్షియం ముడిసరుకుగా కొంటారు. ఆ సముద్రపు చిప్పల్ని ఏరి అమ్మే పనిలోకి దిగింది రేఖ. ఒకోసారి రెండు మూడు డబ్బాలు దొరుకుతాయి. ఒక్కోసారి దొరకవు. కాని ధైర్యంగా జీవితం గడుపుతోందామె. కొత్త సముద్రం ‘సముద్రం కూడా రంగు మార్చుకుంటుంది. పాత చేపలు వెళ్లి కొత్త చేపలు వస్తాయి. ఈ కష్టాలు కూడా పోతాయి. మళ్లీ మాకు మంచి జీవితం వస్తుంది’ అంటుంది రేఖ. ఆమె దగ్గర ఇప్పుడున్నదల్లా ఒక పాత పడవ. ఆ పడవతో సముద్రంలో వెళ్లాలంటే భర్త కోలుకోవాలి. ‘కొట్టాయం ఆస్పత్రిలో డాక్టర్లు డేట్ ఇచ్చారు. పోస్ట్‌పోన్ అయ్యింది కరోనా వల్ల’ అందామె. చాలామంది కష్టాలు వస్తే ‘ఏ సముద్రంలో దూకి చావను’ అంటుంటారు. రేఖ సముద్రం దగ్గరే ఉంది. సముద్రంతోనే ఉంది. కాని ఆమె సముద్రంలో దూకి చావదల్చుకోవడం లేదు. సముద్రాన్నే ఆధారం చేసుకుని అనుక్షణం బతకాలనిపిస్తోంది. ‘కెరటం ఆదర్శం నాకు. పడినందుకు కాదు. పడినా లేచినందుకు’ అన్న కవి వాక్కు రేఖ జీవితాన్ని ఒక సజీవ వ్యాఖ్యానంలా ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
లెక్కలే తప్ప.. గోడు పట్టదా
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర తుఫాన్ నష్టం పరిశీలన బృందం తమ గోడు వినలేదంటూ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకార మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గోడు చెప్పుకునేందుకు వచ్చిన వీరిని బృందం సభ్యులు పట్టించుకోలేదు. రోప్ పార్టీ సిబ్బంది వీరిని వెనక్కి నెట్టేసింది. మీఇంటికొస్తారు..అప్పుడు చెప్పుకోండనటంతో వారు మండిపడ్డారు. గంటకొక జీవో ఇస్తూ దెబ్బతిన్న బోట్లు,వలలకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మత్స్యకార సంఘాల ప్రతినిధులు విమర్శించారు. పెదగదిలి సింహగిరికాలనీలో కూడా బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు చెబుతున్న లెక్కలు వినేందుకు ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఎలాంటి పరిహారం ఇవ్వలేదని వారంతా మీడియావద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తొలిరోజు పర్యటనంతా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూనే అధికారుల నుంచి లెక్కలు తెలుసుకునేందుకు బృందం ప్రాధాన్యమిచ్చింది. బృందం అడిగిన వివరాలు చెప్పలేక జిల్లా యంత్రాంగం అడగుడుగునా ఇబ్బందిపడింది. కేంద్ర బృందం బుధవారం విశాఖనగరంతో పాటు అనంతగిరి, అరకులోయ మండలాల్లో పర్యటించింది. కేంద్రహోంమంత్రిత్వ శాఖ సంయక్తకార్యదర్శి కేకే పాఠక్ నేతృత్వంలోని బృందం సభ్యులు ఎస్ఎం కొల్హాట్కర్,ఆర్పీ సింగ్, బ్రిజేష్ శ్రీవాత్సవలు తొలుత కోతకు గురైన గోకుల్ బీచ్‌ను పరిశీలించారు. అక్కడ ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. బృందం సభ్యులకు బీచ్‌రోడ్డుకు జరిగిన నష్టాన్నికలెక్టర్యువరాజ్, మున్సిపల్ కమిషనర్ జానకిలు వివరించారు. తర్వాత ఫిషింగ్ హార్బరులో దెబ్బతిన్న మెకనైజ్డ్ బోట్లు, హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విశాఖ-అనంతగిరి ఘాట్‌రోడ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా తుఫాన్ వల్ల ఎన్ని కిలో మీటర్ల రహదారులు దెబ్బతిన్నాయో అడిగి తెలుసుకున్నారు.అక్కడ నుంచి అరకులోయ మండలం సుంకరమెట్ట బంగ్లావలస వెళ్లారు. గ్రామ సమీపంలో నేలకొరిగిన సిల్వర్ ఓక్, కాఫీ, మిరియాల చెట్లను పరిశీలించింది. పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్, పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏజేన్సీలో జరిగిన నష్టా న్ని వివరించారు. నష్టపోయిన హెక్టారు కాఫీ తోటకు రూ.25 వేలు వంతున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని, కనీసం రూ.50 వేలు అందజేయాలని కేంద్ర బృందాన్ని ఐటీడీఏ పీఓ కోరారు. ఎకరాకు కాఫీ, మిరియాలు కలిపి సుమారు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వచ్చేదని, తమకు పరిహారం పెంచాలని సుంకరమెట్టకు చెందిన పాంగి రాంబాబు, కె. విజయ్నంద్ దాస్, కుమార్ కోరారు. పోర్టుకు రూ.232కోట్ల నష్టం పోర్టుట్రస్ట్‌కు చేరుకుని దెబ్బతిన్న జెట్టీలను పరిశీలించారు. తుఫాన్ ఐ పోర్టు, పిషింగ్ హార్బర్ల మీదుగానే నగరంలోకి ప్రవేశించిందని అందువలనే ఈ రెండింటికితీవ్ర నష్టం వాటిల్లిందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు సభ్యులకు వివరించారు. నౌకలు ఆగే బెర్త్ పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పోర్టుకు రూ.232కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దెబ్బతిన్న జెట్టీలను, సాల్ట్ క్రీక్ ప్రాంతాన్ని బృందం బోట్లపై వెళ్లి పరిశీలించింది. పరిహారం కోసం వినతుల వెల్లువ ఫిషింగ్ హార్బర్లో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిసి అప్పారావు,కార్యదర్శి వి.యల్లారావుల ఆధ్వర్యంలో ప్రతినిధులు కేంద్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు. ఫిషర్మెన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెడ్డు శంకరరావు ఆధ్వర్యంలో తమకు జరిగిన నష్టంపై ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ తమ గోడును వివరించారు. తమ బోట్లు, వలలకు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లితే కేవలం రూ.67కోట్లుమాత్రమే నష్టం వాటిల్లిందని లెక్కతేల్చారని, లక్షలు విలువ చేసేవలలు, తాళ్లు, పైబర్బోట్లు, మోటారు ఇంజన్లు కొట్టుకు పోగా చేపలమార్కెట్లుకు ధ్వంసమయ్యాయని,కానీఎక్కడా ఏఒక్కటి నష్టపరిహారం అంచనా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపర్యటనలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ వి.శేషగిరిబాబు, ఏజేసీ డి.వెంకటరెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు, ఆర్డీవో జేవి మురళి పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి ముగ్గురు మహిళల మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తనపర్తిలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో మహిళ గల్లంతు అయ్యింది. గల్లంతు అయిన మహిళ కోసం జాలర్లు గాలిస్తున్నారు. ఈ ఘటనతో మహిళల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గంగమ్మకు నీరాజనం
=మళ్లీ రాకు సు(నా)మీ =మత్స్యకార మహిళల వేడుకోలు గంగమ్మా.. సల్లగా సూడమ్మా.. మా పసుపు, కుంకాలు కాపాడమ్మా.. అంటూ మత్స్యకార మహిళలు గురువారం సాగర తీరంలో పూజలు చేశారు. తొమ్మిదేళ్ల క్రితం సునామీ విలయం సృష్టించిన రోజున గంగమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తోంది. కలశాలతో పసుపు నీటిని, పాలను తీసుకువెళ్లి సముద్రంలో కలిపి, హారతులు పట్టారు. ఎలాంటి ఉపద్రవం రాకుండా కాపాడమని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వేలాదిమంది మత్స్యకారుల భక్తికి గంగమ్మ పరవళ్లు తొక్కింది. భక్తులు అందించిన తీర్ధప్రసాదాలను అలల రూపంలో స్వీకరించింది. కలశాల్లోని పసుపు నీటిని తనలో కలుపుకుంది. గురువారం ఉదయం మత్స్యకారుల పూజలతో పెదజాలారిపేట తీరం పుణ్యక్షేత్రాన్నే తలపించింది. గంగమ్మ తల్లి ఉగ్రరూపం దాల్చకుండా మత్స్యకారులను చల్లగా చూడాలని మహిళలు ఈ పూజలు నిర్వహించారు. 2004 డిసెంబర్ 26న సునామీ ముంచుకొచ్చాక ప్రతి ఏటా ఇదే తేదీన సముద్ర తీరంలో గంగమ్మ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా పెదజాలారిపేటలో వేలాదిమంది మత్స్యకారులు పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారికి పాలధారతో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఊరేగింపుగా డప్పులతో ఆట పాటలతో తీరానికి చేరుకున్నారు. కలశాలతో సముద్రం ఒడ్డున పూజలు చేశారు. ఇసుకతో గంగమ్మ ప్రతిమ తయారు చేసి పసుపు, కుంకుమ పూసి, పాలతో అభిషేకించారు. అమ్మవారికి పూసిన పసుపును మహిళలు తమ మంగళసూత్రాలకు రాసుకుని భర్త చల్లగా ఉండాలని వేడుకున్నారు. మహిళలందరూ ఒకేసారి సముద్రంలో పసుపు నీరు, పాలు వదిలి భక్తితో దండాలు పెట్టారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ గంగమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సునామీ వంటి ఉపద్రవాలు మళ్లీ రాకుండా గంగమ్మ చల్లగా చూడాలన్నారు. అనంతరం గ్రామా సేవా సంఘం పెద్దలు పరసన్న, సత్తయ్య, గురయ్యతాతలు మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు మళ్లీ ఒడ్డుకు ఎప్పుడు చేరుకుంటారో తెలీదని, ఎలాంటి ప్రమాదం జరగకుండా గంగమ్మను శాంతింపచేయడానికి ప్రతి సంవత్సరం పూజలు చేస్తున్నామన్నారు. ఈ పండుగలో వైఎస్సార్సీపీ నాయకులు కారి శ్రీలక్ష్మి, తెడ్డు గుర్నాథం, శ్రీనివాసరెడ్డి, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.