లెక్కలే తప్ప.. గోడు పట్టదా
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర తుఫాన్ నష్టం పరిశీలన బృందం తమ గోడు వినలేదంటూ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకార మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గోడు చెప్పుకునేందుకు వచ్చిన వీరిని బృందం సభ్యులు పట్టించుకోలేదు. రోప్ పార్టీ సిబ్బంది వీరిని వెనక్కి నెట్టేసింది. మీఇంటికొస్తారు..అప్పుడు చెప్పుకోండనటంతో వారు మండిపడ్డారు. గంటకొక జీవో ఇస్తూ దెబ్బతిన్న బోట్లు,వలలకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మత్స్యకార సంఘాల ప్రతినిధులు విమర్శించారు. పెదగదిలి సింహగిరికాలనీలో కూడా బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులు చెబుతున్న లెక్కలు వినేందుకు ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఎలాంటి పరిహారం ఇవ్వలేదని వారంతా మీడియావద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తొలిరోజు పర్యటనంతా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూనే అధికారుల నుంచి లెక్కలు తెలుసుకునేందుకు బృందం ప్రాధాన్యమిచ్చింది. బృందం అడిగిన వివరాలు చెప్పలేక జిల్లా యంత్రాంగం అడగుడుగునా ఇబ్బందిపడింది. కేంద్ర బృందం బుధవారం విశాఖనగరంతో పాటు అనంతగిరి, అరకులోయ మండలాల్లో పర్యటించింది. కేంద్రహోంమంత్రిత్వ శాఖ సంయక్తకార్యదర్శి కేకే పాఠక్ నేతృత్వంలోని బృందం సభ్యులు ఎస్‌ఎం కొల్హాట్కర్,ఆర్పీ సింగ్, బ్రిజేష్ శ్రీవాత్సవలు తొలుత కోతకు గురైన గోకుల్ బీచ్‌ను పరిశీలించారు.
అక్కడ ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. బృందం సభ్యులకు బీచ్‌రోడ్డుకు జరిగిన నష్టాన్నికలెక్టర్‌యువరాజ్, మున్సిపల్ కమిషనర్ జానకిలు వివరించారు. తర్వాత ఫిషింగ్ హార్బరులో దెబ్బతిన్న మెకనైజ్డ్ బోట్లు, హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విశాఖ-అనంతగిరి ఘాట్‌రోడ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా తుఫాన్ వల్ల ఎన్ని కిలో మీటర్ల రహదారులు దెబ్బతిన్నాయో అడిగి తెలుసుకున్నారు.అక్కడ నుంచి అరకులోయ మండలం సుంకరమెట్ట బంగ్లావలస వెళ్లారు.
గ్రామ సమీపంలో నేలకొరిగిన సిల్వర్ ఓక్, కాఫీ, మిరియాల చెట్లను పరిశీలించింది. పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్, పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏజేన్సీలో జరిగిన నష్టా న్ని వివరించారు. నష్టపోయిన హెక్టారు కాఫీ తోటకు రూ.25 వేలు వంతున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని, కనీసం రూ.50 వేలు అందజేయాలని కేంద్ర బృందాన్ని ఐటీడీఏ పీఓ కోరారు. ఎకరాకు కాఫీ, మిరియాలు కలిపి సుమారు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వచ్చేదని, తమకు పరిహారం పెంచాలని సుంకరమెట్టకు చెందిన పాంగి రాంబాబు, కె. విజయ్‌నంద్ దాస్, కుమార్ కోరారు.
పోర్టుకు రూ.232కోట్ల నష్టం
పోర్టుట్రస్ట్‌కు చేరుకుని దెబ్బతిన్న జెట్టీలను పరిశీలించారు. తుఫాన్ ఐ పోర్టు, పిషింగ్ హార్బర్ల మీదుగానే నగరంలోకి ప్రవేశించిందని అందువలనే ఈ రెండింటికితీవ్ర నష్టం వాటిల్లిందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు సభ్యులకు వివరించారు. నౌకలు ఆగే బెర్త్ పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పోర్టుకు రూ.232కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దెబ్బతిన్న జెట్టీలను, సాల్ట్ క్రీక్ ప్రాంతాన్ని బృందం బోట్లపై వెళ్లి పరిశీలించింది.
పరిహారం కోసం వినతుల వెల్లువ
ఫిషింగ్ హార్బర్‌లో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిసి అప్పారావు,కార్యదర్శి వి.యల్లారావుల ఆధ్వర్యంలో ప్రతినిధులు కేంద్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు. ఫిషర్‌మెన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెడ్డు శంకరరావు ఆధ్వర్యంలో తమకు జరిగిన నష్టంపై ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ తమ గోడును వివరించారు. తమ బోట్లు, వలలకు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లితే కేవలం రూ.67కోట్లుమాత్రమే నష్టం వాటిల్లిందని లెక్కతేల్చారని, లక్షలు విలువ చేసేవలలు, తాళ్లు, పైబర్‌బోట్లు, మోటారు ఇంజన్లు కొట్టుకు పోగా చేపలమార్కెట్లుకు ధ్వంసమయ్యాయని,కానీఎక్కడా ఏఒక్కటి నష్టపరిహారం అంచనా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపర్యటనలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ వి.శేషగిరిబాబు, ఏజేసీ డి.వెంకటరెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు, ఆర్డీవో జేవి మురళి పాల్గొన్నారు.