=మళ్లీ రాకు సు(నా)మీ
=మత్స్యకార మహిళల వేడుకోలు
గంగమ్మా.. సల్లగా సూడమ్మా.. మా పసుపు, కుంకాలు కాపాడమ్మా.. అంటూ మత్స్యకార మహిళలు గురువారం సాగర తీరంలో పూజలు చేశారు. తొమ్మిదేళ్ల క్రితం సునామీ విలయం సృష్టించిన రోజున గంగమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తోంది. కలశాలతో పసుపు నీటిని, పాలను తీసుకువెళ్లి సముద్రంలో కలిపి, హారతులు పట్టారు. ఎలాంటి ఉపద్రవం రాకుండా కాపాడమని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వేలాదిమంది మత్స్యకారుల భక్తికి గంగమ్మ పరవళ్లు తొక్కింది. భక్తులు అందించిన తీర్ధప్రసాదాలను అలల రూపంలో స్వీకరించింది. కలశాల్లోని పసుపు నీటిని తనలో కలుపుకుంది. గురువారం ఉదయం మత్స్యకారుల పూజలతో పెదజాలారిపేట తీరం పుణ్యక్షేత్రాన్నే తలపించింది. గంగమ్మ తల్లి ఉగ్రరూపం దాల్చకుండా మత్స్యకారులను చల్లగా చూడాలని మహిళలు ఈ పూజలు నిర్వహించారు. 2004 డిసెంబర్ 26న సునామీ ముంచుకొచ్చాక ప్రతి ఏటా ఇదే తేదీన సముద్ర తీరంలో గంగమ్మ పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది కూడా పెదజాలారిపేటలో వేలాదిమంది మత్స్యకారులు పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారికి పాలధారతో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఊరేగింపుగా డప్పులతో ఆట పాటలతో తీరానికి చేరుకున్నారు. కలశాలతో సముద్రం ఒడ్డున పూజలు చేశారు. ఇసుకతో గంగమ్మ ప్రతిమ తయారు చేసి పసుపు, కుంకుమ పూసి, పాలతో అభిషేకించారు. అమ్మవారికి పూసిన పసుపును మహిళలు తమ మంగళసూత్రాలకు రాసుకుని భర్త చల్లగా ఉండాలని వేడుకున్నారు.
మహిళలందరూ ఒకేసారి సముద్రంలో పసుపు నీరు, పాలు వదిలి భక్తితో దండాలు పెట్టారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైఎస్సార్‌సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ గంగమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సునామీ వంటి ఉపద్రవాలు మళ్లీ రాకుండా గంగమ్మ చల్లగా చూడాలన్నారు.
అనంతరం గ్రామా సేవా సంఘం పెద్దలు పరసన్న, సత్తయ్య, గురయ్యతాతలు మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు మళ్లీ ఒడ్డుకు ఎప్పుడు చేరుకుంటారో తెలీదని, ఎలాంటి ప్రమాదం జరగకుండా గంగమ్మను శాంతింపచేయడానికి ప్రతి సంవత్సరం పూజలు చేస్తున్నామన్నారు. ఈ పండుగలో వైఎస్సార్‌సీపీ నాయకులు కారి శ్రీలక్ష్మి, తెడ్డు గుర్నాథం, శ్రీనివాసరెడ్డి, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గంగమ్మకు నీరాజనం
Published Fri, Dec 27 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement