sunami
-
సునామీ అంటే...
సముద్రంలో ఒక విస్ఫోటం జరిగితే ఏమవుతుంది? అంతెత్తు నుంచి ఒక పర్వత శిఖరం సముద్రంలోకి ఒరిగిపోతే ఏం జరుగుతుంది? సముద్ర తీర ప్రాంతంలో ఉండే అగ్ని పర్వతాలు హఠాత్తుగా బద్దలైతే ఫలితమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. అదే సునామీ. సముద్రపు అలలు నోరు తెరుచుకున్న రాకాసిలా విరుచుకుపడి ఊళ్లకు ఊళ్లను ముంచేయడాన్ని సునామీ అంటారు. 2004లో తొలిసారిగా భారత్ సునామీని కళ్ల చూసింది. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కూడా ప్రభావం పడింది. ఇండోనేసియా సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం తీవ్రతకి సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు ఎగిసిపడి క్షణాల్లో మనుషుల్ని మింగేశాయి. సునామీల చుట్టూ నెలకొని ఉన్న వాస్తవాలేంటో ఓ సారి చూద్దాం. ►సునామీ నాలుగు రకాలుగా ముంచుకొస్తుంది. సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు, కొండచరియలు సముద్రంలో విరిగిపడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, ఉల్కాపాతం సంభవించినప్పుడు (ఇది అత్యంత అరుదు) సునామీలు ఏర్పడతాయి. ►సునామీ అన్న పదం జపనీస్ భాషకు చెందింది. హార్బర్ కెరటం అని దీని అర్థం. ►సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. ►పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. ►సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్‌తో ఇది సమానం. ►ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోరి్నయాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. ►2004లో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ చరిత్రలోనే అత్యంత భయంకరమైంది. ఇండోనేసియా కేంద్రంగా సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం. ఈ భూకంపంతో సముద్రంలో నింగికెగిసిన మృత్యు కెరటాలు తీర ప్రాంతంలో ఉన్న 11 దేశాలను ముంచేశాయి. 2 లక్షల 83 వేల మందిని రాకాసి అలలు పొట్టన పెట్టుకున్నాయి. -
సునామీ ఎందుకు వచ్చింది?
ఇండోనేసియాలో తీవ్ర విధ్వంసం సృష్టించిన సునామీ రాకకు గల కారణాలపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం దక్షిణ పార్శ్వంలోని ఒక భాగం సముద్రంలో కుప్పకూలిపోవడంతో సునామీ వచ్చిందని తేల్చారు. ‘ఒక కొండచరియ విరిగిపడినట్టుగా అకస్మాత్తుగా అగ్ని పర్వతంలోని ఒక భాగం పడిపోవడంతో నీరు స్థానభ్రంశం చెంది తరంగాలు నిట్టనిలువుగా పైకి విరజిమ్మాయి.దీంతో ఒకేసారి రాకాసి అలలు తీర ప్రాంతంపై విరుచుకుపడ్డాయి‘ అని భూకంప అధ్యయన శాస్త్రవేత్త శ్యామ్ టేలర్ అభిప్రాయపడ్డారు. అయితే, కచ్చితంగా ఇలాగే జరిగి ఉంటుందని చెప్పడానికి ఆధారాలు ఉండవన్నారు. జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం గత కొన్ని నెలలుగా లావాను విరజిమ్ముతోంది. సునామీ రావడానికి సరిగ్గా 24 నిమిషాలు ముందు అగ్నిపర్వతంలోని ఒక భాగం కుప్పకూలిపోయిందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. అగ్నిపర్వతంలోని ఒక భాగం కుప్పకూలడం వల్ల దాని పైకప్పు తెరుచుకుని విస్ఫోటం ఏర్పడుతుంది. ఆ శిథిలాలు ఒకేసారి సముద్రంలో పడిపోవడం వల్ల నీరు కొన్ని వందల మీటర్లు పైకి ఎగజిమ్ముతుందని టేలర్ వివరించారు. అగ్ని పర్వతం సింహభాగం కుప్పకూలడం వల్లనే రాకాసి అలలు దూసుకువచ్చాయన్నారు. భూకంపం కూడా వచ్చిందా ? సునామీకి ముందు ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతానికి 25 కిలోమీటర్ల పరిధిలో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. ‘భూకంపం ప్రభావం అగ్నిపర్వతంపై పడింది. దాంతో పర్వతం ఒరిగిపడింది. సముద్ర మట్టానికి 300 మీటర్లకు పైగా ఎత్తులో క్రకటోవా అగ్నిపర్వతం ఉండడంతో భారీగా ఉన్న దాని శకలాలు అంతెత్తు నుంచి నీళ్లలో పడడంతో సునామీ ముంచెత్తింది’ అని తెలిపింది. ముందు సంకేతాలు ఎందుకు లేవంటే ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం నిరంతరం చప్పుళ్లు చేస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలో శబ్ధ కాలుష్యం నెలకొంది. దీంతో అది కూలిపోయినా ఆ శబ్దాన్ని ఎవరూ అంతగా గుర్తించలేదు. అంతేకాకుండా భూకంపం వల్ల కాకుండా, అగ్నిపర్వతం కూలడంతో సునామీ రావడం వల్ల భూకంప నమోదు కేంద్రాల్లో సిగ్నల్స్‌కి కూడా అది అందలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి కంపించడం, సముద్రం ఉప్పొంగడం వంటి సూచనలేవీ లేకుండా అకస్మాత్తుగా 10 అడుగుల ఎత్తుకి అలలు ఎగసిపడటంతో భారీ నష్టం సంభవించిందని తెలిపారు. అగ్ని పర్వతం విరిగిపడిన సుమారు 24 నిమిషాల తర్వాత నిశ్శబ్ద సునామీ సంభవించడంతో యంత్రాంగం అప్రమత్తం అయి ప్రజలకు హెచ్చరికలు చేసేందుకు ఎలాంటి వ్యవధి లేకుండాపోయిందన్నారు. అగ్నిపర్వతం కారణంగా సునామీలు ఏర్పడటం అరుదైన విషయమని అందువల్ల ముందుగా తెలుసుకోవడం కష్టమయిందని నిపుణులు అంటున్నారు. అయితే, క్రకటోవా ఇంకా ఎగసిపడుతూనే ఉందని, మరో నెల లేదంటే ఏడాదిలో ఇది విరిగిపడి మరో భీకర ప్రళయం సంభవించవచ్చని మరో శాస్త్రవేత్త మెక్కినన్ హెచ్చరించారు. పాప్ గ్రూప్‌లో ఒక్కరే సజీవం సునామీ రాక్షస అలల్లో చిక్కిన ‘సెవెంటీన్’ పాప్ గ్రూప్ సభ్యుల్లో ఒక్కరు తప్ప దాదాపు అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ గ్రూప్ మేనేజర్ ఒకి విజయ, హెర్మాన్ సికుంబాంగ్, రుక్మానా రుస్తం, విష్ణు ఆండీ ధర్మవాన్లకు బంధువులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. పాప్ బృందంలోని రీఫియన్ ఫజర్శ్యా మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ‘సెవెంటీన్’ పాప్ గ్రూప్ జావాలోని టాన్జుంగ్ బీచ్ రిసార్టులో ప్రదర్శన సమయంలో సునామీ విరుచుకుపడింది. సునామీ మృతులు 373 జకార్తా: ఇండోనేసియా సునామీలో సజీవంగా ఉన్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. శనివారం రాత్రి సంభవించిన ఈ విలయంలో మృతుల సంఖ్య 373కు చేరుకుందని జాతీయ ప్రకృతి విపత్తుల స్పందన సంస్థ అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రొహో సోమవారం తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మరో 128 మంది జాడ తెలియాల్సి ఉండగా, గాయపడిన 1,459 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. శనివారం రాత్రి సముద్ర గర్భంలోని ఒక అగ్ని పర్వతం బద్ధలై.. పశ్చిమ జావా, దక్షిణ సుమత్రా దీవులపై ఆకస్మికంగా విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మరింత తీవ్రతతో అలలు తీరంపైకి విరుచుకుపడే అవకాశముందని నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. 281 మందికి అంత్యక్రియలు.. సునామీలో ప్రాణాలు కోల్పోయిన 281 మందికి ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించినట్లు సుటొపో పుర్వో నుగ్రొహో తెలిపారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కరిటా బీచ్ ప్రాంతంలో ధ్వంసమైన వందలాది భవనాల శకలాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన, సజీవంగా ఉన్న వారి కోసం వందలాది మంది సైనిక సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు తీరం వెంబడి గాలిస్తున్నారు. ఆక్స్‌ఫామ్ తదితర అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలను చేపట్టాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించాయి. ఈ సహాయక చర్యలు మరో వారం పాటు కొనసాగే అవకాశాలున్నాయి. బాధిత ప్రాంతాలను సోమవారం అధ్యక్షుడు విడోడో సందర్శించారు. -
ఇండోనేసియాలో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేసియాను భూకంపం వణికించింది. సులావేసి దీవిలో శుక్రవారం సంభవించిన ప్రకంపనలకు పలు ఇళ్లు కూలిపోగా, ఒకరు చనిపోయినట్లు తెలిసింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంప కేంద్రం సులావేసి పట్టణానికి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీచేసిన అధికారులు కొంతసేపటికి విరమించుకున్నారు. పాలూ అనే పట్టణంలో నీటి ఉధృతికి పలు భవనాలు కుప్పకూలాయి. సముద్ర అలలు సుమారు 1.5 మీటర్ల ఎత్తుకు ఎగిశాయని విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు. సునామీ అలలకు భయపడి స్థానికులు ఎత్తయిన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. భూకంప కేంద్రానికి చాలా దూరంలో ఉన్న ప్రజలు ప్రకంపనలు తమ నివాసాల్లోనూ వచ్చినట్లు తెలిపారు. భూకంపం ధాటికి పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనాల శిథిలాలు, రాళ్లు రహదారులపైకి కొట్టుకొచ్చాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వాహనాల్లో ఎగువ ప్రాంతాల వైపు బయల్దేరడంతో పాలూ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భూకంప ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి సహాయక బృందాలు చేరుకుంటున్నారు. ప్రకంపనల ధాటికి ఎంతమంది చనిపోయారు? ఎందరు గాయాలపాలయ్యారు? అన్న సమాచారం తెలియరాలేదు. -
జపాన్ను వణికించిన భూకంపం
టోక్యో: జపాన్‌లోని హొక్కైడో ద్వీపాన్ని భూకంపం వణికించింది. స్థానికకాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3 గంటలకు రిక్టర్‌స్కేలుపై 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఈశాన్య జపాన్‌లో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. అలాగే అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీచేయలేదు.జేబీ టైఫూన్ జపాన్ను అతలాకుతలం చేసిన కొన్నిగంటల్లోనే భారీ భూకంపం వణికించడం గమనార్హం. గంటకు 216 కి.మీ.ల వేగంతో దూసుకొస్తున్న ‘జెబీ’ తుపాను గాలుల ధాటికి కొట్టుకొచ్చి కుప్పగా పడిన కార్లు. బుధవారం పశ్చిమ జపాన్‌లోని కోబె నగరంలో తీసిందీ ఫొటో. -
సరికొత్త కోర్సు.. మెరైన్ బయాలజీ
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెరిగింది.. ఫలితంగా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్నాయి.. భూ పర్యావరణ సమతౌల్యతను పరిరక్షించే క్రమంలో.. భూమిపై 70 శాతం వరకు ఆవరించి ఉన్న నీటి వనరులపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.. ఈ క్రమంలోనే మెరైన్ బయాలజీ కోర్సు ప్రాముఖ్యతను సంతరించుకుంది.. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు.. పెరుగుతున్న శాస్త్రీయ దృక్ఫథం, పరిశోధనల ఫలితంగా మానవ అవసరాల మేరకు సైన్స్ రంగంలో ఎప్పటికప్పుడూ నూతన కోర్సులకు రూపకల్పన జరుగుతూనే ఉంటోంది.. ఈ కోవలోకే వస్తుంది మెరైన్ బయాలజీ. శాస్త్రీయ అధ్యయనం కోసం విశాలమైన సముద్రాలు ఎన్నో వనరులకు కేంద్రాలు. అంతేకాకుండా ఎన్నో జీవులు, వృక్షాలు, సూక్ష్మజీవులకు ఆవాసంగా కూడా ఉపయోగపడుతున్నాయి. మారుతున్న పరిస్థితులు, తరుచుగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల నేపథ్యంలో సంబంధిత అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు మెరైన్ బయాలజీ తోడ్పడుతుంది. సముద్రంలోని జీవులు, వృక్షాలు ఏవిధంగా మనుగడ సాగిస్తున్నాయి, వాటి ప్రవర్తన వంటి అంశాలను అవగాహన చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ తోడ్పడుతుంది. అంతేకాకుండా వీటిపై పర్యావరణ ప్రభావం, సునామీ, సైక్లోన్ వంటి ప్రకృతి విపత్తులను సమగ్రంగా అధ్యయం చేయడానికి కూడా మెరైన్ బయాలజీ ఉపయోగపడుతుంది. కోర్సులివే మెరైన్ బయాలజీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్డీ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎకాలజీ మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. బ్యాచిలర్ స్థాయిలో ఈ కోర్సును కొన్ని కాలేజీలు మాత్రమే అందిస్తున్నాయి. పీజీ కోర్సును మాత్రం ఎక్కువ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. గ్రఫీ, ఫిషరీస్, ఫిజికల్ ఓిషియనోగ్రఫీ, ఓషియన్ ఫార్మింగ్, వాటర్ క్వాలిటీ పారామీటర్, ఎనర్జీ రీసోర్సెస్-కన్వర్షన్, కెమికల్ ఓషియనోగ్రఫీ తదితర సబ్జెక్ట్‌లను బోధిస్తారు. పరిశోధనలకు కేరాఫ్ ఈ విభాగంలో నిపుణులను మెరైన్ బయాలాజిస్ట్లుగా వ్యవహరిస్తారు. వీరు తమ విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుంది. సముద్రంలో ఉండే మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులు సంబంధిత అంశాలపై పరిశోధనలు చేస్తుంటారు. వీరు సంబంధిత సమాచారాన్ని సేకరించి దాన్ని విశ్లేషించి మొక్కల జీవన విధానం, సముద్ర జీవుల ప్రవర్తన, వాటిపై పర్యావరణ ప్రభావం వంటి అంశాలపై అధ్యయనం సాగిస్తారు. సంబంధిత అంశాలపై వ్యాపార, పర్యావరణ, సంబంధిత ప్రభుత్వ సంస్థలకు సలహాలు కూడా అందజేస్తుంటారు. అవకాశాలు మెరైన్ బయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఆయిల్ కంపెనీలు, ఎన్విరాన్మెంటల్ లేబొరేటరీస్, మెరైన్ లేబొరేటరీస్, వాటర్ ఇండస్ట్రీ, ఓషియనోగ్రఫిక్ లేబొరేటరీ, జూ, కోస్టల్ అథారిటీస్, టూరిజం సంబంధిత సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా పరిశోధన రంగమే ఉపాధికి కేంద్రంగా నిలుస్తోంది. ఏకో టూరిజానికి పెరుగుతున్న ఆదరణ ఫలితంగా ఇందులో కూడా చక్కని అవకాశాలను అందుకోవచ్చు. నేచురలిస్ట్, మెరైన్ మ్యూజియం అడ్మినిస్ట్రేటర్, లేబొరేటరీ టెక్నీషియన్, అక్వేరియం అడ్మినిస్ట్రేటర్, ఫిషరీస్ ఎక్స్పర్ట్స్ వంటి హోదాల్లో వీరు స్థిరపడొచ్చు. సంబంధిత సంస్థలకు ఫ్రీలాన్స్‌గా కన్సల్టెంట్‌గా కూడా సేవలు అందించవచ్చు. వేతనాలు వేతనాల విషయానికొస్తే.. అర్హత, అనుభవం, పని చేస్తున్న సంస్థ వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. పేరున్న లేబొరేటరీ లేదా ప్రభుత్వ రంగంలో పని చేస్తే మంచి వేతనాలు ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 10 నుంచి 15 వేలకు లభిస్తుంది. పీహెచ్డీ ఉంటే నెలకు రూ. 25 వేల నుంచి 30 వేల వరకు అందుకోవచ్చు. విదేశాల్లో వేతనాలు అధికంగానే ఉంటాయి. అక్కడ ఎంట్రీ స్థాయిలో సంవత్సరానికి 44 వేల డాలర్లు లభిస్తాయి. అవగాహన పెరగాలి మన విద్యార్థుల్లో మెరైన్ బయాలజీ కోర్సు పట్ల అవగాహన పెరగాలి. సముద్రంలోని వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవుల జీవిత విధానాలు, కాలనుగుణంగా వచ్చే మార్పులు సంబంధిత అన్ని అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే మెరైన్ బయాలజీ. సునామీ, సైక్లోన్ వంటి ప్రకృతి విపత్తులను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి కూడా మెరైన్ బయాలజీ తోడ్పడుతుంది. దీనికి సంబంధించి అండర్‌గ్రాడ్యుయేషన్, పీజీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ కంటే పీజీలో ఎక్కువ కాలేజీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. మెరైన్ బయాలజీ కోర్సులో చేరాలనుకుంటే మాత్రం ఇంటర్మీడియెట్‌లో బైపీసీ చదివి ఉండాలి. సిలబస్ విషయానికొస్తే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎకాలజీ మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. పీజీలో ఓిషియనోగ్రఫీ, ఫిషరీస్, ఫిజికల్ ఓిిషియనోగ్రఫీ, వాటర్ క్వాలిటీ పారామీటర్, కెమికల్ ఓషియనో గ్రఫీ తదితర సబ్జెక్ట్‌లను బోధిస్తారు. సిలబస్ అనేది రీజియన్ నుంచి రీజియన్‌కు మారుతుంటుంది. ఆసక్తి ఉంటే తర్వాత పీహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ కోర్సు చేసిన వారికి పరిశోధన సంస్థలు, కోర్సును అందించే విద్యా సంస్థల్లో ఎక్కువ అవకాశాలు ఉంటా యి. విదేశాల్లో కూడా చక్కని అవకాశాలను అందుకోవచ్చు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలు వీరికి గమ్యాలుగా నిలుస్తున్నాయి. -డీఈ బాబు, ప్రొఫెసర్ (జువాలజీ), ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం. పీజీ స్థాయిలో మెరైన్ బయాలజీ కోర్సును అందిస్తున్న యూనివర్సిటీలు ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం వెబ్సైట్: www.andhrauniversity.edu.in/ విక్రమ సింహపూరి యూనివర్సిటీ-నెల్లూరు వెబ్సైట్: www.simhapuriuniv.ac.in/ గోవా యూనివర్సిటీ వెబ్సైట్: www.unigoa.ac.in పాండిచ్చేరి యూనివర్సిటీ వెబ్సైట్: www.pondiuni.edu.in/ కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్: http://iraa.cusat.ac.in/ కర్నాటక యూనివర్సిటీ-ధార్వడ్ వెబ్సైట్: www.kud.ac.in/ బె హరమ్పూర్ యూనివర్సిటీ వెబ్సైట్: www.buodisha.edu.in/ -
గంగమ్మకు నీరాజనం
=మళ్లీ రాకు సు(నా)మీ =మత్స్యకార మహిళల వేడుకోలు గంగమ్మా.. సల్లగా సూడమ్మా.. మా పసుపు, కుంకాలు కాపాడమ్మా.. అంటూ మత్స్యకార మహిళలు గురువారం సాగర తీరంలో పూజలు చేశారు. తొమ్మిదేళ్ల క్రితం సునామీ విలయం సృష్టించిన రోజున గంగమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తోంది. కలశాలతో పసుపు నీటిని, పాలను తీసుకువెళ్లి సముద్రంలో కలిపి, హారతులు పట్టారు. ఎలాంటి ఉపద్రవం రాకుండా కాపాడమని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వేలాదిమంది మత్స్యకారుల భక్తికి గంగమ్మ పరవళ్లు తొక్కింది. భక్తులు అందించిన తీర్ధప్రసాదాలను అలల రూపంలో స్వీకరించింది. కలశాల్లోని పసుపు నీటిని తనలో కలుపుకుంది. గురువారం ఉదయం మత్స్యకారుల పూజలతో పెదజాలారిపేట తీరం పుణ్యక్షేత్రాన్నే తలపించింది. గంగమ్మ తల్లి ఉగ్రరూపం దాల్చకుండా మత్స్యకారులను చల్లగా చూడాలని మహిళలు ఈ పూజలు నిర్వహించారు. 2004 డిసెంబర్ 26న సునామీ ముంచుకొచ్చాక ప్రతి ఏటా ఇదే తేదీన సముద్ర తీరంలో గంగమ్మ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా పెదజాలారిపేటలో వేలాదిమంది మత్స్యకారులు పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారికి పాలధారతో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఊరేగింపుగా డప్పులతో ఆట పాటలతో తీరానికి చేరుకున్నారు. కలశాలతో సముద్రం ఒడ్డున పూజలు చేశారు. ఇసుకతో గంగమ్మ ప్రతిమ తయారు చేసి పసుపు, కుంకుమ పూసి, పాలతో అభిషేకించారు. అమ్మవారికి పూసిన పసుపును మహిళలు తమ మంగళసూత్రాలకు రాసుకుని భర్త చల్లగా ఉండాలని వేడుకున్నారు. మహిళలందరూ ఒకేసారి సముద్రంలో పసుపు నీరు, పాలు వదిలి భక్తితో దండాలు పెట్టారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ గంగమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సునామీ వంటి ఉపద్రవాలు మళ్లీ రాకుండా గంగమ్మ చల్లగా చూడాలన్నారు. అనంతరం గ్రామా సేవా సంఘం పెద్దలు పరసన్న, సత్తయ్య, గురయ్యతాతలు మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు మళ్లీ ఒడ్డుకు ఎప్పుడు చేరుకుంటారో తెలీదని, ఎలాంటి ప్రమాదం జరగకుండా గంగమ్మను శాంతింపచేయడానికి ప్రతి సంవత్సరం పూజలు చేస్తున్నామన్నారు. ఈ పండుగలో వైఎస్సార్సీపీ నాయకులు కారి శ్రీలక్ష్మి, తెడ్డు గుర్నాథం, శ్రీనివాసరెడ్డి, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.