సరికొత్త కోర్సు.. మెరైన్ బయాలజీ | new course Marine Biology | Sakshi
Sakshi News home page

సరికొత్త కోర్సు.. మెరైన్ బయాలజీ

Published Thu, Jan 22 2015 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

సరికొత్త కోర్సు.. మెరైన్ బయాలజీ

సరికొత్త కోర్సు.. మెరైన్ బయాలజీ

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెరిగింది.. ఫలితంగా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్నాయి.. భూ పర్యావరణ సమతౌల్యతను పరిరక్షించే క్రమంలో..  భూమిపై 70 శాతం వరకు ఆవరించి ఉన్న నీటి వనరులపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.. ఈ క్రమంలోనే మెరైన్ బయాలజీ కోర్సు ప్రాముఖ్యతను సంతరించుకుంది.. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు.. పెరుగుతున్న శాస్త్రీయ దృక్ఫథం, పరిశోధనల ఫలితంగా మానవ అవసరాల మేరకు సైన్స్ రంగంలో ఎప్పటికప్పుడూ నూతన కోర్సులకు రూపకల్పన జరుగుతూనే ఉంటోంది.. ఈ కోవలోకే వస్తుంది మెరైన్ బయాలజీ.
 
 శాస్త్రీయ అధ్యయనం కోసం
 విశాలమైన సముద్రాలు ఎన్నో వనరులకు కేంద్రాలు. అంతేకాకుండా ఎన్నో జీవులు, వృక్షాలు, సూక్ష్మజీవులకు ఆవాసంగా కూడా ఉపయోగపడుతున్నాయి. మారుతున్న పరిస్థితులు, తరుచుగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల నేపథ్యంలో సంబంధిత అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు మెరైన్ బయాలజీ తోడ్పడుతుంది. సముద్రంలోని జీవులు, వృక్షాలు ఏవిధంగా మనుగడ సాగిస్తున్నాయి, వాటి ప్రవర్తన వంటి అంశాలను అవగాహన చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ తోడ్పడుతుంది. అంతేకాకుండా వీటిపై పర్యావరణ ప్రభావం, సునామీ, సైక్లోన్ వంటి ప్రకృతి విపత్తులను సమగ్రంగా అధ్యయం చేయడానికి కూడా మెరైన్ బయాలజీ ఉపయోగపడుతుంది.
 
 కోర్సులివే
 మెరైన్ బయాలజీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్‌డీ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎకాలజీ మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. బ్యాచిలర్ స్థాయిలో ఈ కోర్సును కొన్ని కాలేజీలు మాత్రమే అందిస్తున్నాయి. పీజీ కోర్సును మాత్రం ఎక్కువ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.  గ్రఫీ, ఫిషరీస్, ఫిజికల్ ఓిషియనోగ్రఫీ, ఓషియన్ ఫార్మింగ్, వాటర్ క్వాలిటీ పారామీటర్, ఎనర్జీ రీసోర్సెస్-కన్వర్షన్, కెమికల్  ఓషియనోగ్రఫీ తదితర సబ్జెక్ట్‌లను బోధిస్తారు.
 
 పరిశోధనలకు కేరాఫ్
 ఈ విభాగంలో నిపుణులను మెరైన్ బయాలాజిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. వీరు తమ విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుంది. సముద్రంలో ఉండే మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులు సంబంధిత అంశాలపై పరిశోధనలు చేస్తుంటారు. వీరు సంబంధిత సమాచారాన్ని సేకరించి దాన్ని విశ్లేషించి మొక్కల జీవన విధానం, సముద్ర జీవుల ప్రవర్తన, వాటిపై పర్యావరణ ప్రభావం వంటి అంశాలపై అధ్యయనం సాగిస్తారు. సంబంధిత అంశాలపై వ్యాపార, పర్యావరణ, సంబంధిత ప్రభుత్వ సంస్థలకు సలహాలు కూడా అందజేస్తుంటారు.
 
 అవకాశాలు
 మెరైన్ బయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఆయిల్ కంపెనీలు, ఎన్విరాన్‌మెంటల్ లేబొరేటరీస్, మెరైన్ లేబొరేటరీస్, వాటర్ ఇండస్ట్రీ, ఓషియనోగ్రఫిక్ లేబొరేటరీ, జూ, కోస్టల్ అథారిటీస్, టూరిజం సంబంధిత సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా పరిశోధన రంగమే ఉపాధికి కేంద్రంగా నిలుస్తోంది. ఏకో టూరిజానికి పెరుగుతున్న ఆదరణ ఫలితంగా ఇందులో కూడా చక్కని అవకాశాలను అందుకోవచ్చు. నేచురలిస్ట్, మెరైన్ మ్యూజియం అడ్మినిస్ట్రేటర్, లేబొరేటరీ టెక్నీషియన్, అక్వేరియం అడ్మినిస్ట్రేటర్, ఫిషరీస్ ఎక్స్‌పర్ట్స్ వంటి హోదాల్లో వీరు స్థిరపడొచ్చు. సంబంధిత సంస్థలకు ఫ్రీలాన్స్‌గా కన్సల్టెంట్‌గా కూడా సేవలు అందించవచ్చు.
 
 వేతనాలు
 వేతనాల విషయానికొస్తే.. అర్హత, అనుభవం, పని చేస్తున్న సంస్థ వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. పేరున్న లేబొరేటరీ లేదా ప్రభుత్వ రంగంలో పని చేస్తే మంచి వేతనాలు ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 10 నుంచి 15 వేలకు లభిస్తుంది. పీహెచ్‌డీ  ఉంటే నెలకు రూ. 25 వేల నుంచి 30 వేల వరకు అందుకోవచ్చు. విదేశాల్లో వేతనాలు అధికంగానే ఉంటాయి. అక్కడ ఎంట్రీ స్థాయిలో సంవత్సరానికి 44 వేల డాలర్లు లభిస్తాయి.
 
 అవగాహన పెరగాలి
 మన విద్యార్థుల్లో మెరైన్ బయాలజీ కోర్సు పట్ల అవగాహన పెరగాలి. సముద్రంలోని వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవుల జీవిత విధానాలు, కాలనుగుణంగా వచ్చే మార్పులు సంబంధిత అన్ని అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే మెరైన్ బయాలజీ. సునామీ, సైక్లోన్ వంటి ప్రకృతి విపత్తులను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి కూడా మెరైన్ బయాలజీ తోడ్పడుతుంది. దీనికి సంబంధించి అండర్‌గ్రాడ్యుయేషన్, పీజీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ కంటే పీజీలో ఎక్కువ కాలేజీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. మెరైన్ బయాలజీ కోర్సులో చేరాలనుకుంటే మాత్రం ఇంటర్మీడియెట్‌లో బైపీసీ చదివి ఉండాలి.
 
  సిలబస్ విషయానికొస్తే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎకాలజీ మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. పీజీలో  ఓిషియనోగ్రఫీ, ఫిషరీస్, ఫిజికల్  ఓిిషియనోగ్రఫీ, వాటర్ క్వాలిటీ పారామీటర్, కెమికల్ ఓషియనో గ్రఫీ తదితర సబ్జెక్ట్‌లను బోధిస్తారు. సిలబస్ అనేది రీజియన్ నుంచి రీజియన్‌కు మారుతుంటుంది. ఆసక్తి ఉంటే తర్వాత పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ కోర్సు చేసిన వారికి పరిశోధన సంస్థలు, కోర్సును అందించే విద్యా సంస్థల్లో ఎక్కువ అవకాశాలు ఉంటా యి. విదేశాల్లో కూడా చక్కని అవకాశాలను అందుకోవచ్చు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలు వీరికి గమ్యాలుగా నిలుస్తున్నాయి.
 -డీఈ బాబు, ప్రొఫెసర్ (జువాలజీ),
 ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.
 
 పీజీ స్థాయిలో మెరైన్ బయాలజీ కోర్సును అందిస్తున్న యూనివర్సిటీలు
     ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
     వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in/
     విక్రమ సింహపూరి యూనివర్సిటీ-నెల్లూరు
     వెబ్‌సైట్: www.simhapuriuniv.ac.in/
     గోవా యూనివర్సిటీ
     వెబ్‌సైట్: www.unigoa.ac.in
     పాండిచ్చేరి యూనివర్సిటీ
     వెబ్‌సైట్: www.pondiuni.edu.in/
     కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
     వెబ్‌సైట్: http://iraa.cusat.ac.in/
     కర్నాటక యూనివర్సిటీ-ధార్వడ్
     వెబ్‌సైట్: www.kud.ac.in/
     బె హరమ్‌పూర్ యూనివర్సిటీ
     వెబ్‌సైట్: www.buodisha.edu.in/
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement