దోపిడీ యత్నం కేసులో ఐదుగురికి జైలు
ఉంగుటూరు :
చేబ్రోలులో దోపిడీకి యత్నించిన కేసులో ఐదుగురు నిందితులకు ఐదేళ్ల జైలు, ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం అడిషనల్ సబ్‌జడ్జి పి.డేవిడ్ బుధవారం తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గతేడాది మార్చి 1న చేబ్రోలు రామాలయం సమీపంలోని యెలిశెట్టి పాపారావు బాబ్జి ఇంట్లో మారణాయుధాలతో దోపిడీకి యత్నించిన సంఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన లక్కమెల పాండయ్య, దారా సంజీవ కుమార్, మణికంఠ మనోహరరెడ్డి, ఉడిసె యశ్వంత్‌రెడ్డి, అమ్మిరెడ్డి శివ నాగేశ్వరరావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరికి జైలు, జరిమానా శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో వానరాపి సతీష్(హైదరాబాద్), కడమంచి శ్రీను (గన్నవరం) కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు. అడిషనల్ పీపీ శిరినీడి విజయకృష్ణ కేసు వాదించగా గణపవరం సీఐ ఎన్.దుర్గాప్రసాద్ ప్రాసిక్యూషన్‌కు సహకరించారని చేబ్రోలు ఎస్సై పైడిబాబు తెలిపారు.