విద్యుత్ సబ్స్టేషన్లకు స్థల పరిశీలన
కోటగుమ్మం (రాజమండ్రి) : రాజమండ్రిలో 33/11కేవీ ఐదు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాల రాజు తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో మరో 3 రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. హుకుంపేట, అరవింద్ నగర్, రామకృష్ణ నగర్లో రైతుబజార్ల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామన్నారు. పిఠాపురం, మండపేటలలో కూడా రైతు బజార్లు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి వచ్చిందన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు.
అనుమతి ఇచ్చిన వెంటనే రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామన్నారు. అమ్మ హస్తం పథకంలో సరుకులను సక్రమంగా పంపిణీ చేయకపోతే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 27 ఇసుక రీచ్‌లను గుర్తించినట్టు జేసీ తెలిపారు. వాటికి అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. ఇసుక రీచ్‌ల అనుమతికి 2, 3 రోజులలో మార్గదర్శకాలు వస్తాయని జేసీ తెలిపారు.
99.98 శాతం ఆధార్ సీడింగ్
జిల్లాలో ఆధార్ సీడింగ్ 99.98 శాతం పూర్తి అయి ప్రథమ స్థానంలో ఉందని జేసీ ముత్యాలరాజు తెలిపారు. ఆయన వెంట రాజమండ్రి సబ్ కలెక్టర్ వి. విజయ రామరాజు ఉన్నారు.
విద్యుత్ అధికారులతో సమావేశం
జెయింట్ కలెక్టర్ ముత్యాల రాజు శుక్రవారం ట్రాన్స్ కో- అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజమండ్రి నగరంలో విద్యుత్ వినియోగం, పుష్కరాలకు అదనంగా ఏర్పాటు చేయవలసిన సబ్ స్టేషన్లు, స్ధల సేకరణ ఏదశలో ఉంది సబ్ స్టేషన్లు ఏర్పాటు వలన పుష్కరాలకు విద్యుత్ సరఫరా సామర్థ్యం తదితర అంశాలపై చర్చించారు. ట్రాన్స్ కో ఎస్ఈ ఎన్. గంగాధర్, సిటీ ప్లానర్ రామ్ కుమార్, అర్బన్ తహశీల్దార్ పీవీవీ గోపాల కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.