కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంకు
సాక్షి, ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా మరో ప్రభుత్వ రంగ బ్యాకు తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా చార్జీల వడ్డన మొదలు పెట్టేసింది. ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్న ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఇక మీదట బాదుడు షురూ చేయనుంది. పీఎన్బీ ఏటీఏల విత్‌డ్రాలపై నియంత్రణ విధించింది. ఏటీఎం ద్వారా నెలకు 5 లావాదేవీలు మించితే చార్జీని వసూలు చేయనున్నట్టు ఒక ప్రకటలో తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈసవరించిన నిబంధనలు అమలు కానున్నాయి.
సేవింగ్ / కరెంట్/ ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాదారులందరూ నెలకు అయిదు సార్లు పరిమితికి మించితే ఒక్కో లావాదేవీకి రూ.10 వసూలు చేయనున్నట్టు పేర్కొంది. పీఎన్బీ ఏటీఎం లావాదేవీలకుడా ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే, బ్యాలెన్స్ ఎంక్వయిరీ, ఫండ్ బదిలీ లేదా గ్రీన్ పిన్ అభ్యర్థన లాంటి ఇతర నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జ్ ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది. తద్వారా ఉచిత లావాదేలకు చరమగీతం పాడి ఖాతాదారులపై భారం పెంచింది.