‘స్మితా సబర్వాల్‌కు రూ.15 లక్షల’పై విచారణ వాయిదా
మరో వ్యాజ్యంతో కలిపి 7న విచారిస్తామన్న ధర్మాసనం
ఏజీ అభ్యర్థన మేర రహస్య విచారణ చేపట్టిన హైకోర్టు
హైదరాబాద్: ‘ఔట్లుక్’ మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ. 15 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరో వ్యాజ్యం సోమవారం విచారణకు రానున్నందున ఈ రెండింటినీ కలిపి ఆ రోజున విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన కె.ఈశ్వరరావు గురువారం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై శుక్రవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. స్మితా సబర్వాల్ ఓ హోటల్లో పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమం గురించి మ్యాగజైన్ కథనం, కార్టూన్ ప్రచురించిందని, ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారమన్నారు. వ్యక్తిగత వ్యవహారానికి ఇలా ప్రజాధనాన్ని వెచ్చించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తమ ముందున్న వివరాలను బట్టి ఈ వ్యవహారం ప్రైవేటు వ్యవహారంగా అనిపించడం లేదని వ్యాఖ్యానించింది. స్మితా సబర్వాల్‌ను ప్రైవేటు వ్యక్తిగా ఆ కథనంలో చిత్రీకరించినట్లు అనిపించడం లేదని పేర్కొంది. ఐఏఎస్ అధికారిగానే చిత్రీకరిస్తూ ఆ కథనం ఉంటే, దానిని ప్రైవేటు వ్యవహారంగా పరిగణించలేమని తెలిపింది. అందువల్ల సంబంధిత కథనాన్ని, కార్టూన్‌ను చూడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ ఈ అంశం తీవ్రమైంది కాబట్టి ఇన్ కెమెరా (రహస్య విచారణ) విచారణ జరపాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తమ చాంబర్లో విచారణ చేపట్టింది.