వరదొస్తే ఇలా చేయండి
సాక్షి, పోలవరం : కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో పరిస్థితులన్నీ తమ నియంత్రణలో ఉన్నాయని ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఆర్కే జైన్ తెలిపారు. ఆయన నేతృత్వంలోని బృందం శుక్రవారం ప్రాజెక్టును పరిశీలించింది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడుతూ.. వరద ఉధృతిని ఎలా ఎదుర్కోవాలనే దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వచ్చినట్టు చెప్పారు. నిన్న జరిగిన సమావేశంలో ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేశామనీ, కాఫర్ డ్యామ్ భద్రత విషయమై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. గోదావరిలో నిర్మించిన కాపర్ డ్యాంలో కుడి వైపున కొన్ని పనులు జరుగుతున్నందున, వరద నీరు వస్తే నీటిని ఎడమవైపు నుంచి విడుదల చేయడం జరుగుతుందన్నారు. నదిలో ప్రస్తుతం 19 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని, దీనివల్ల ఎగువ ప్రాంతంలో ఉన్న నిర్వాసిత గ్రామాలకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. వరద ఉధృతి పెరిగి గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వస్తే తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులకు ఇప్పటికే ఆదేశాలివ్వడంతో పాటు, కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.