హన్మకొండలో పూల దుకాణాలు దగ్ధం
సాక్షి, హన్మకొండ: హన్మకొండ చౌరస్తాలోని పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తు తెలియని దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి పనిగట్టుకుని దుకాణాలకు నిప్పంటిన దృశ్యాలు సీసీ పుటేజీలో నిక్షిప్తమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3.33 గంటల సమయంలో జరిగిన సంఘటనతో ఏడు పూల దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. బాధితులు, రిటైల్ పూల వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమూద్ అలీ, ఇబ్రహీం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రోజూ మాదిరిగా రాత్రి 11గంటల సమయంలో దుకాణాలను మూసివేసి ఇంటికి వెళ్లారు. తెల్లవారితే బతుకమ్మ, మరుసటి రోజు దసరా పండుగ ఉండడంతో ఏడుగురు వ్యాపారులు కలిసి ఒక రోజు ముందే బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన పూలను దిగుమతి చేసుకున్నారు. పూల దండలు అల్లి మిగిలిన పూలను దుకాణాల్లో ఉంచి తాళం వేసుకుని ఇంటికి వెళ్లారు.
గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు టైర్లు, బాటిల్లో పెట్రోల్‌తో దుకాణాల వద్దకు చేరినట్లు సీసీ పుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు లేరని గ్రహించిన దుండగులు మొదట టైర్లపై పెట్రోల్ పోసి నిప్పంటించి పూల దుకాణాలకు అంటించారు. దుకాణాలు అంటుకున్నట్లు నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరుగులు తీసినట్లుగా సీసీ పుటేజీల్లో కనిపిస్తుంది. మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఏడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణాలకు ఆనుకుని రెండు ఏటీఎం సెంటర్లు, రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. మంటలను సకాలంలో ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికుల చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ పక్షాన అండగా ఉంటానని భరోసా కల్పించారు. చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ వెంట కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు పులి రజనీకాంత్, అంబటి రాజు, తుల రమేష్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
కేసు నమోదు
వరంగల్ క్రైం: హన్మకొండ చౌరస్తాలోని పూల దుకాణాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 5 దుకాణాలు పూర్తిగా, 2 దుకాణాలు పాక్షికంగా కాలిపోయినట్లు హన్మకొండ ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. తెలంగాణ పూల మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, దుకాణం యజమాని ఎండీ మహాబుబ్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.