మీకు చేతగాదా చెప్పండి.. మేమే తొలగిస్తాం
‘ఫ్లెక్సీల తొలగింపు’ నివేదికలపై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు, రోడ్లపై ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించే వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమర్పించిన నివేదికలపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో ప్రభుత్వాలు విఫలమవుతున్నట్టు ఈ నివేదికలను చూస్తే అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఫ్లెక్సీలు, తదితరాలను తొలగించడం చేతకాకపోతే ఆ విషయాన్ని తమకు చెప్పాలని, వాటిని ఎలా తొలగింపజేయాలో తమకు తెలుసునని పేర్కొంది.
తామిచ్చిన ఆదేశాల ప్రకారం.. ఫ్లెక్సీలు, తదితరాలను తొలగించేందుకు ఇరు ప్రభుత్వాలకు మరో 15 రోజుల గడువునిచ్చింది. ఇదే చివరి అవకాశమని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట విరుద్ధంగా రోడ్లపై విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్.మురళీకృష్ణ 2008లో హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు.