flying saucers
-
Unidentified Anomalous Phenomena: కలవో, లేవో...!
ఏలియన్స్. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్స్. గ్రహాంతరవాసులు.. ఇలా వాళ్లకు ఎన్నెన్నో పేర్లు. వాళ్ల చుట్టూ ఎన్నెన్నో కథలు. వాళ్ల ఉనికిపై ఎన్నెన్నో కథనాలు. వాళ్లు భూమిపైకి వచ్చిపోయేందుకు ఉపయోగిస్తారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (ఎగిరే పళ్లాలు) చుట్టూ మరెన్నో పుకార్లు. వాటిని చూశామంటూ గత ఒకట్రెండు శతాబ్దాలలో ఎంతోమంది పత్రికలకు, టీవీలకు ఎక్కారు. కొన్నిసార్లు వినువీధిలో కొన్ని వింత వస్తువులు కెమెరాలకు చిక్కాయి. అవి ఎగిరే పళ్లాలేనని నమ్మిన వాళ్లు, వాటిలో గ్రహాంతరవాసులు వచ్చారని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఎందరో! దాంతో ఈ విషయంపై నాసా ఇటీవల కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. దీన్ని ఇప్పటిదాకా గుర్తించని అసాధారణ దృగ్విషయం (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ)గా పేర్కొంటూ, దీని తాలూకు నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు ఒక స్వతంత్ర కమిటీ వేసింది. అది ఏడాది పాటు అన్ని కోణాల్లో పరిశోధన చేసి 33 పేజీల నివేదిక సమర్పించింది. అయితే ఏలియన్స్ గానీ, అవి ప్రయాణించే ఎగిరే పళ్లాలు గానీ ఉన్నాయని గానీ, లేవని గానీ ఇదమిత్థంగా నివేదిక ఎటూ తేల్చకపోవడం విశేషం! నాసా యూఏపీ ప్యానల్ నివేదిక ముఖ్యాంశాలు ► ఇప్పటిదాకా మా పరిశీలనకు వచ్చిన అసాధారణ దృగ్విషయాల్లో (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ) చాలావాటి అసలు స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించలేకపోయాం. ► ఎగిరే పళ్లాలుగా చెప్పిన వాటికి నిజంగా గ్రహాంతర మూలాలున్నట్టు తేలలేదు. ► వీటిలో చాలావరకు బెలూన్లు, డ్రోన్లు, విమానాలుగా తేలాయి. ► అయితే కొన్ని యూఏపీ కేసులు అప్పటిదాకా మనకు తెలిసిన ఏ దృగ్విషయంతోనూ సరిపోలలేదు. ► ఏలియన్స్, ఎగిరే పళ్లాల విషయంలో ప్రజల్లో నెలకొని ఉన్న అంతులేని ఆసక్తి అర్థం చేసుకోదగిందే. అందుకే ఈ విషయమై ఎలాంటి కొత్త సమాచారం తెలిసినా ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటాం. నాసాకు యూఏపీ ప్యానల్ సిఫార్సులు ► యూఏపీ సంబంధిత డేటా సేకరణ, విశ్లేషణ కోసం ఒక స్టాండర్డ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. ► యూఏపీలపై అవగాహనను విస్తృతం చేసుకోవడానికి కృత్రిమ మేధ తదితర టెక్నాలజీల సాయం తీసుకోవాలి. ► యూఏపీల అధ్యయనంలో పారదర్శకత, ఇతర దేశాలు, అధ్యయన సంస్థలతో పరస్పర సహకారం చాలా అవసరం. ► యూఏపీ పరిశోధనలకు, డేటా సేకరణ, అధ్యయనం, ప్రభుత్వ, విదేశీ, అంతర్జాతీయ సంస్థలతో మరింత సమన్వయం తదితరాల నిమిత్తం ఈ ప్రాజెక్టుకు నిధులను మరింత పెంచాలి. ఎగిరే పళ్లాలను గురించి జనాల్లో నెగటివ్ భావజాలం ఎంతగానో పాతుకుపోయింది. ఏలియన్స్ ఉనికి తాలూకు నిజానిజాలను నిర్ధారించేందుకు అత్యంత కీలకమైన డేటాను సేకరించడంలో ఇదే అతి పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది’ – నాసా యూఏపీ అధ్యయన బృందం ఏలియన్స్ ఉన్నదీ లేనిదీ పక్కాగా తేల్చాలన్నా, దీనిపై లోతుగా పరిశోధన చేయాలన్నా ఇప్పుడున్న వాటికి చాలా భిన్నమైన, సృజనాత్మక శాస్త్రీయ అధ్యయన పద్ధతులు అత్యాధునికమైన శాటిలైట్ టెక్నాలజీ కావాలి. అంతకు మించి, ఈ అంశంపై జనం దృక్కోణంలోనే మౌలికంగా చాలా మార్పు రావాలి’ – నాసా – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా?
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (యూఎఫ్ఓ) నిజమేనా? ఇవి మనిషిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకూ యూఎఫ్ఓలు ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్ ఆకారంలో ఉండే ఇవి ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. అంతకుమించి వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఏమీ తెలియదు. ఈ నేపథ్యంలో యూఎఫ్ఓల గుట్టేమిటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని బృందంలో నియమించింది. అది సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. తొమ్మిది నెలలపాటు అన్నిరకాలుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఈ మేరకు నాసా ట్వీట్ కూడా చేసింది. -
గంటకు 260 కిలోమీటర్ల వేగం.. ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు
ఎగరాలంటే విమానం ఎక్కాలి. కనీసం హెలికాప్టరైనా ఉండాలి. వీటికి చాలా తతంగం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫ్లైయింగ్ కార్లు అక్కడక్కడా వస్తున్నాయి. వాటికి ఇంధనం బాగానే ఖర్చవుతుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్లైయింగ్ సాసర్ ఉంటే, ఎక్కడికైనా తేలికగా పక్షిలా ఎగిరి వెళ్లవచ్చు. కోరుకున్న చోట హాయిగా వాలిపోవచ్చు. దీనికి ఇంధనం సమస్య ఉండదు. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘జెవా’ ఈ ఫ్లైయింగ్ సాసర్ను రూపొందించింది. ఇందులో ఒక మనిషి మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. ఇందులో బ్యాటరీని పూర్తిగా చార్జి చేస్తే, 80 కిలోమీటర్ల దూరం ఏకధాటిగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ఠవేగం గంటకు 260 కిలోమీటర్లు. -
ఆకాశంలో అంతు చిక్కని వస్తువు!
వాషింగ్టన్ : గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్స్ (గ్రహాంతర వాసులు వీటిని నడుపుతారని ఊహాగానం) గురించి ఇప్పటివరకు ఎన్నో కథనాలు వచ్చాయి. ప్రజలకూ వాటి గురించి తెలుసుకోవాలని అమితాసక్తి. తాజాగా దీనికి సంబంధించి మూడు వీడియోలను అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ విడుదల చేసింది. వీటిని "ఆకాశంలో గుర్తించడానికి వీలులేని దృశ్యాలు" అని వ్యాఖ్యానించింది. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికే వీటిని రిలీజ్ చేశామని వెల్లడించింది. అయితే ఈ వీడియోలు అంతరిక్ష పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలిగించవని స్పష్టం చేసింది. ఒక వీడియోలో వస్తువు లాంటిది ఆకాశంలో తిరుగుతోంది. (ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్) దీన్ని విమానం నడుపుతున్న ఇద్దరు నేవీ పైలట్లు 2004లో కెమెరాల్లో బంధించారు. మరో రెండు వీడియోల్లో గాలిలో ఏదో వస్తువులాంటిది కదలడం కనిపిస్తుంది. వీటిని 2015లో చిత్రీకరించారు. అయితే ఈ వీడియోలు 2007, 2017లో సోషల్ మీడియాలో లీకవగా ఇన్నేళ్ల తర్వాత అమెరికా రక్షణ సంస్థ వీటిని ధృవీకరించడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్‌గా నిలిచిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఏలియన్స్ వస్తున్నాయేమో.." అంటూ కొందరు అనుమానం వెలిబుచ్చగా, "అదేమై ఉంటుందో క్లారిటీ ఇస్తే బాగుండేద"ని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?) -
ఆకాశంలో ఏమిటీ విచిత్రం?
న్యూయార్క్: శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే ఉంటున్నాయి. ఆకాశంలో అరుదుగా కొన్ని దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అయితే ఇవి ఏంటి అన్నది అంతుపట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి రాత్రివేళ గుండ్రని లోతు పళ్లెం ఆకారంలో, మరోసారి ఓ కాంతి సమూహంతో కూడిన దృశ్యం రంగులు, వేగం మారుతూ కనిపిస్తుంది. ఇంకోసారి ఎవరో నడచి వస్తున్నట్టుగా భ్రమ పడతాం. ఇలాంటి దృశ్యాలు చూసినపుడు ఒక్కోసారి వింతగాను, మరోసారి భయంగాను అనిపిస్తుంది. ఇలాంటి ఆకారాలను గుర్తించలేని ఎగిరే వస్తువులు (యూఎఫ్ఓ) గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈ చిత్రంలోని దృశ్యాన్ని గమనించండి. ఓ జింకపై ఏదో ఆకారం దిగుతున్నట్టుగా కనిపిస్తోంది కదూ! అమెరికాలోని మిసిసిపి కి చెందిన ఒక దంపతులు అడవిలో జింకలను రాత్రి వేళ చిత్రీకరించే ప్రయత్నంలో వారి కెమెరాలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే ఆ ఆకారం ఏంటన్నది మిస్టరీగానే మిగిలింది. ఇదే కాదు ఇలాంటి సంఘటనలు, ఫొటోలు అంతుపట్టని విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి మచ్చకు కొన్ని. అమెరికాలోని నార్త్ కరోలినాలో రంగురంగుల కాంతులు ఆవిష్కృతమయ్యాయి. టెక్సాస్‌లో రెడ్ లైట్లను ఎవరో క్రమపద్ధతిలో మారుస్తుంటారని అధికారులు విశ్వసిస్తారు. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఏవో వింత దీపాలు ప్రత్యక్షమయ్యాయి. నదులు, సరస్సులపై ఎవో అద్భుత కాంతులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. రష్యాలో ఈ మద్య కొందరు ఆందోళనకారులు ప్రదర్శనను నిర్వహించారు. ఆ ప్రదర్శన చిత్రాల్లో ఏవో వింత వింత వస్తువులు కనిపించాయి. ఆందోళనకారుల పైన ఎవరో నిలుచున్నట్టు, వారే ఉద్యమకారులను నడపిపిస్తున్నట్టు అనిపించింది. అమెరికాలోని విండీ సిటీ లో ఒక పెద్ద సరస్సుపైన ఏవో వింత కాంతులు కెమెరాలో కనిపించాయి. ఇవన్నీ ఏవో గ్రహంతర వాసులా లేక ఇతర గ్రహాల నుంచి మనకు తెలియని ఏవో సందేశాలు మోసుకొస్తున్న దూతలా లేక కళ్ల ముందు కలిగిన భ్రమా అన్నది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పలేకపోతున్నారు. ఈ యుఫోల (యుఎఫ్ ఓలు) పై అమెరికా విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తోంది. అంతే కాదు దీని చుట్టూ అనేక సినిమాలు కూడా తయారయ్యాయి. హాలీవుడ్ సినిమాలైన ఈటీ, క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్, ది ఇండిపెండెన్స్ డే ల కథా వస్తువు గ్రహాంతర వాసులే. మన దేశంలోనూ క్రిష్, కోయి మిల్ గయా వంటి హిందీ సినిమాలు ఈ అంశంపైనే తయారయ్యాయి. మొత్తం మీద అమెరికాలో ఇప్పుడు ఈ వింత ఆకారాలపైన విస్తృత చర్చ జరుగుతోంది.