ఆకాశంలో ఏమిటీ విచిత్రం?
ఆకాశంలో ఏమిటీ విచిత్రం?
Published Sat, Apr 5 2014 9:01 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
న్యూయార్క్: శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే ఉంటున్నాయి. ఆకాశంలో అరుదుగా కొన్ని దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అయితే ఇవి ఏంటి అన్నది అంతుపట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి రాత్రివేళ గుండ్రని లోతు పళ్లెం ఆకారంలో, మరోసారి ఓ కాంతి సమూహంతో కూడిన దృశ్యం రంగులు, వేగం మారుతూ కనిపిస్తుంది. ఇంకోసారి ఎవరో నడచి వస్తున్నట్టుగా భ్రమ పడతాం.
ఇలాంటి దృశ్యాలు చూసినపుడు ఒక్కోసారి వింతగాను, మరోసారి భయంగాను అనిపిస్తుంది. ఇలాంటి ఆకారాలను గుర్తించలేని ఎగిరే వస్తువులు (యూఎఫ్ఓ) గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈ చిత్రంలోని దృశ్యాన్ని గమనించండి. ఓ జింకపై ఏదో ఆకారం దిగుతున్నట్టుగా కనిపిస్తోంది కదూ! అమెరికాలోని మిసిసిపి కి చెందిన ఒక దంపతులు అడవిలో జింకలను రాత్రి వేళ చిత్రీకరించే ప్రయత్నంలో వారి కెమెరాలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే ఆ ఆకారం ఏంటన్నది మిస్టరీగానే మిగిలింది.
ఇదే కాదు ఇలాంటి సంఘటనలు, ఫొటోలు అంతుపట్టని విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి మచ్చకు కొన్ని. అమెరికాలోని నార్త్ కరోలినాలో రంగురంగుల కాంతులు ఆవిష్కృతమయ్యాయి. టెక్సాస్లో రెడ్ లైట్లను ఎవరో క్రమపద్ధతిలో మారుస్తుంటారని అధికారులు విశ్వసిస్తారు. ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఏవో వింత దీపాలు ప్రత్యక్షమయ్యాయి. నదులు, సరస్సులపై ఎవో అద్భుత కాంతులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.
రష్యాలో ఈ మద్య కొందరు ఆందోళనకారులు ప్రదర్శనను నిర్వహించారు. ఆ ప్రదర్శన చిత్రాల్లో ఏవో వింత వింత వస్తువులు కనిపించాయి. ఆందోళనకారుల పైన ఎవరో నిలుచున్నట్టు, వారే ఉద్యమకారులను నడపిపిస్తున్నట్టు అనిపించింది. అమెరికాలోని విండీ సిటీ లో ఒక పెద్ద సరస్సుపైన ఏవో వింత కాంతులు కెమెరాలో కనిపించాయి.
ఇవన్నీ ఏవో గ్రహంతర వాసులా లేక ఇతర గ్రహాల నుంచి మనకు తెలియని ఏవో సందేశాలు మోసుకొస్తున్న దూతలా లేక కళ్ల ముందు కలిగిన భ్రమా అన్నది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పలేకపోతున్నారు. ఈ యుఫోల (యుఎఫ్ ఓలు) పై అమెరికా విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తోంది. అంతే కాదు దీని చుట్టూ అనేక సినిమాలు కూడా తయారయ్యాయి. హాలీవుడ్ సినిమాలైన ఈటీ, క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్, ది ఇండిపెండెన్స్ డే ల కథా వస్తువు గ్రహాంతర వాసులే. మన దేశంలోనూ క్రిష్, కోయి మిల్ గయా వంటి హిందీ సినిమాలు ఈ అంశంపైనే తయారయ్యాయి. మొత్తం మీద అమెరికాలో ఇప్పుడు ఈ వింత ఆకారాలపైన విస్తృత చర్చ జరుగుతోంది.
Advertisement