మూడు నెలల పసివాడికి ‘గర్భం’
పాట్నా : కిడ్నీలో కణితితో బాధపడుతున్న మూడు నెలల పసివాడికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు కారణం బిడ్డ పొట్టలో ఉన్నది కణితి కాదు ‘పిండం’ . అవును. కడుపు నొప్పితో విపరీతంగా బాధపడుతున్న మూడు నెలల బిడ్డను రంజూబాల, సత్యేంద్ర యాదవ్ దంపతులు ఉత్తరప్రదేశ్లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
సత్యేంద్ర దంపతుల స్వస్ధలం బిహార్ రాష్ట్రం భభువా జిల్లాలోని ఓ కుగ్రామం. బిడ్డకు అనారోగ్యం ఉంటుండటంతో పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ఓ ఆసుపత్రి వైద్యులు కిడ్నీలో కణితి ఉందని చెప్పడంతో బెనారస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కిడ్నీలో కణితి ఉందని భావించిన వైద్యులు ఆపరేషన్ చేయాల్సివస్తుందని తల్లిదండ్రులకు చెప్పారు. అందుకు సత్యేంద్ర దంపతులు సరే అనడంతో ఏర్పాట్లు పూర్తి చేసి ఆపరేషన్ ప్రారంభించారు.
కానీ, బిడ్డ పొట్టను ఓపెన్ చేయగానే అందులో కదులుతున్న పిండం కనిపించడంతో షాక్కు గురయ్యారు. బిడ్డ కడుపులో ఉన్న పిండానికి కళ్లు, చర్మం కూడా ఏర్పడినట్లు తెలిపారు. అంతేకాకుండా పిండం బిడ్డ శరీరభాగాలను ఆహారంగా స్వీకరిస్తూ లోలోపల తినేస్తున్నట్లు గుర్తించారు. దీంతో లోపల ఉన్న పిండాన్ని తీసేశారు.
తల్లి గర్భంలో కవలలు విడిపోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని బిడ్డకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలాంటి ఆపరేషన్లు 200 మాత్రమే జరిగాయని వెల్లడించారు. బిడ్డ కడుపులో పిండాన్ని గుర్తించి షాక్కు గురైనట్లు చెప్పారు. విజయవంతంగా ఆపరేషన్ను నిర్వహించి పిండాన్ని తొలగించామని తెలిపారు. బిడ్డ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పారు. ఓ వారంలో డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు.