folk art
-
అమెరికాలో... భారతీయ జానపద కథలకు జీవం
అమెరికాలోని కథా డ్యాన్స్ థియేటర్లో ప్రాచీన భారతీయ జానపద కథలను కథక్ డ్యాన్స్‌లో లయలుగా చేర్చి నృత్యకారులు అబ్బురపరుస్తున్నారు. కథక్ నృత్యం జానపద కథల జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కథా డ్యాన్స్ థియేటర్లో ‘పంచతంత్ర, ది డ్యాన్సింగ్ టేల్స్ ఆఫ్ విజ్డమ్‘ను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా విదేశాలలో భారత శాస్త్రీయ నృత్య రూపమైన కథక్ ద్వారా ప్రాచీన భారతీయ జానపద కథలకు జీవం పోస్తుంది.‘ఈ థియేటర్ ప్రారంభంలో నా మనుగడే ప్రశ్నార్థకంగా ఉండేది. భారతదేశం నుండి వచ్చిన నేను నా సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం లేదు ఎప్పుడూ బాధగా అనిపించేది. మన పొరుగువారిని కలుసుకోవాలంటే కళలను మించిన మార్గం లేదు. దీంతో 1987లో మా ఇంటి నేలమాళిగలో కథా థియేటర్ కంపెనీని ప్రారంభించాను’ అంటూ కథా డ్యాన్స్ థియేటర్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ రీటా ముస్తాఫీ తొలి రోజుల ప్రయత్నాలను వివరిస్తారు. ముస్తాఫీ, కథక్ క్లిష్టమైన ఫుట్‌వర్క్, హై–స్పీడ్ స్పిన్‌లు, రిథమిక్ ప్యాటర్న్లు, సాంస్కృతిక విభజనలను తగ్గించడానికి, కథలను చెప్పడానికి ఉపయోగిస్తూ వచ్చారు. జంతు కథల ఆధారంగా! ఇప్పుడు వారాంతాల్లో కథక్ నృత్య ప్రదర్శన ద్వారా నైతిక పాఠాలను బోధిస్తున్నారు. అందుకు, సంస్కృతంలో 2,000 ఏళ్ల క్రితం రాసిన జంతు కథల ఆధారంగా నృత్యాన్ని రూపొందించారు. ‘సింహం, నక్క, చిరుత, కాకి‘ కథలో మొదటిది... ఒక సింహం ఒంటెను వేటాడాలనే ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ దాని ప్రాణాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో నిజమైన నాయకత్వంలో దయ ఉంటుందని తెలుసుకుంటుంది. రెండవ కథ... ‘ది ఎలిఫెంట్ అండ్ ది మౌజ్‘లో, ఏనుగులు ఎలుకల సమూహాన్ని తొక్కడం మానుకుంటాయి. ఎలుకలు తరువాత ఏనుగులను వేటగాళ్ల ఉచ్చు నుండి రక్షిస్తాయి. శక్తి పరిమాణంతో సంబంధం లేకుండా పరస్పర గౌరవం విలువను ప్రదర్శిస్తాయి. చివరి కథ... ‘ది ఫిష్ అండ్ ది ఫ్రాగ్‘లో, అతి విశ్వాసం ఉన్న చేపలను సమీపంలోని కుటుంబం గురించి కప్ప హెచ్చరిస్తే, అవి విస్మరిస్తాయి. ఫలితంగా వాటిని ఆ కుటుంబం పట్టుకోవడంలో జాగ్రత్త, అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ‘‘ఇవి నేను ఎదిగే సమయంలో విన్న కథలు. నా పిల్లలూ ఆ కథలను వింటూ పెరిగారు, ఇప్పుడు నా మనవరాళ్లు కూడా వాటిని చదువుతున్నారు. ఈ కథలు అర్థవంతమైనవి ఎందుకంటే అవి దయగా, తెలివిగా, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పుతాయి’ అని ముస్తాఫీ వివరిస్తారు. ఒక చోట చేర్చే నృత్యంసెయింట్ లూయిస్ పార్క్‌లోని థియేటర్ డ్యాన్స్ స్కూల్ నుండి కథా డ్యాన్స్ థియేటర్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన 42 మంది డ్యాన్సర్లు, అప్రెంటిస్‌లు, 8 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 20 మంది పిల్లలను ఈ నృత్యం ఒకచోట చేర్చుతుంది. న్యూ ఢిల్లీకి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ మైత్రేయి పహారీ, 50కి పైగా దుస్తులు, 30 మాస్క్‌లను రూపొందించారు, కల్పిత కథల జంతు పాత్రలను డ్యాన్సర్లు ధరిస్తారు. ఈ ప్రదర్శనలో సంజుక్త మిత్రా పెయింటింగ్‌లు, మిన్నియాపాలిస్కు చెందిన నిర్మాత జె.డి. స్టీల్, భారతీయ స్వరకర్త జయంత బెనర్జీ స్వరపరిచిన ఒరిజినల్ స్కోర్, కల్పిత కథల ద్వారా ప్రేక్షకులకు మార్గనిర్దేశం చేసే ఆంగ్ల వాయిస్ ఓవర్, కథనం కూడా ఉంటాయి. -
ముద్దొచ్చే అబ్బాయిలు
స్టేజీ మీద ఈ అబ్బాయిలను చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గమీద ముద్దుల వర్షం కురిపిస్తారని ‘లావణి’ నాట్య బృందాలలో ఒక బృందానికి సారథి అయిన హంకారే చిరునవ్వుతో చెబుతున్నారు. స్త్రీ వేషం ధరించి, థీమ్‌ని మార్చి యువకులు చేస్తున్న ప్రాచీన ‘లావణి’ నాట్య రూపకాలకు మహారాష్ట్రలో ఇప్పుడు అమితమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. పాటలు పాడుతూ, నాట్యం చేసే జానపద కళకు ‘లావణి’ అని పేరు. ఇటీవల కొంతకాలంగా మహారాష్ట్ర యువకులు స్త్రీ వేషధారణతో ఈ కళను పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ‘లావణి’ తో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. ‘నాట్యం చేస్తున్న ఆ మూడు గంటలూ మమ్మల్ని మేం మరచిపోతాం’ అంటాడు ఆనంద్ సతామ్ అనే లావణి నాట్యకారుడు. మహారాష్ట్ర పట్టణప్రాంతాల్లో అమ్మాయి రూపంలో నాట్యం చేస్తున్న వందలాదిమందిలో ఆనంద్ సతామ్ ఒకరు. జనవరి 25న ముంబైలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ లో సావిత్రి మేధాతుల్ రచించిన సంగీత రూపకం ‘సంగీత బరి’లో ఆనంద్ సతామ్ తో పాటు కామ్తే అనే యువకుడు ‘లావణి’ ని ప్రదర్శించాడు. ఈ నాట్యం చేసేవారి కదలికలు.. వేదిక మీదే కాదు, వేదిక బయట కూడా స్త్రీలాగే మారుతుంటాయి. దాంతో మగపిల్లలు ఆడపిల్లలుగా మారిపోతారేమోననే భయంతో కుటుంబ సభ్యులు వారిని ఈ పాత్రలు వెయ్యొద్దని నిరోధించేవారు. కాని సతామ్, కామ్తే ఇద్దరూ లావణి నాట్యాన్ని ప్రదర్శించడానికే ఉత్సాహం చూపించారు. ‘‘ఒకప్పుడు నన్ను ఈ నాట్యం చేయొద్దని చెప్పినవారే, ఇప్పుడు నా నాట్యం చూసి గర్వపడుతున్నారు, నా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు’ అంటాడు కామ్తే. ఉన్నవి రెండు విధానాలు పట్ణణ ప్రేక్షకులు లావణి కళారూపాన్ని మోహవాంఛకు రిఫ్లెక్షన్గా భావిస్తుంటారు. వాస్తవానికి ఈ నాట్యంలో ఆధ్యాత్మికత, వేదాంతం, నిరక్షరాస్యత, రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఉంటుంది. ప్రధానంగా అయితే ‘లావణి’ని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ‘దోల్కీ ఫాడ్ తమాషా’, ‘సంగీత్ బరి’. దోల్కీ ఫాడ్ తమాషాలో లావణి ప్రదర్శన నాలుగు నుంచి ఎనిమిది గంటలపాటు నడుస్తుంది. ఇందులో కళాకారులు గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూంటారు. గ్రామాలలో వారంవారం పెట్టే గ్రామసంతలో, పశువుల సంతలలో ఎక్కువమంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శిస్తారు. సంగీత్ బరిలో.. గుంపులుగా, సంచరిస్తూ, కొద్దిమంది ప్రేక్షకుల ముందు కూడా నటిస్తారు. వీరికి ఏడాదికి సరిపడా కాంట్రాక్టు ఉంటుంది. సాధారణంగా ఆడవారు మాత్రమే సంగీత్ బరిలో నటిస్తు్తంటారు. ముఖ్యంగా భాటు కోల్హాటి లేదా కళావంతుల కుటుంబాలకు చెందినవారు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. వారి ఆచారం ప్రకారం ఈ కుటుంబాలలోని మహిళలు వివాహానికి అనర్హులు. వీరు కేవలం వేశ్యావృత్తిలో మాత్రమే జీవించాలి. కొత్తగా మూడో విధానం కామ్తే, సతామ్ల ప్రదర్శనలు మూడోరకానికి చెందినవి. వీటిని బ్యానర్ ప్రదర్శనలు అంటారని చెబుతారు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన పి.హెచ్డీ స్కాలర్ సేజల్ యాదవ్. ఈయన లావణి ప్రదర్శకుల మీద విస్తృతంగా పరిశోధన చేశారు. 2016లో ‘లావణి లైవ్’ పేరున ఒక ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు. లావణి ప్రదర్శనలాంటివే సమకాలీనంగా ఎన్నో ఉన్నాయి. ప్రతివారికి వారి సొంత ఆలోచన ఉంటుంది. లావణిలోని అసలు విషయాన్ని వీరు పక్కకు తోసేసి, సొంతంగా రూపొందించుకుంటూ, అందరినీ వారి గుంపులో చేర్చుకుంటున్నారు. లావణిని ప్రదర్శించేవారిలో ఒకరైన ‘హంకారే బృందం’ సుమారు మూడుమాసాల పాటు లావణిలా నటించడానికి సాధన చేస్తుంది. అమ్మాయిలా నడవటం, అమ్మాయిలా మాట్లాడటం వంటివి రంగస్థలం మీద ప్రదర్శించడానికి ముందే నేర్చుకుంటారు. వారిని చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గ మీద ముద్దుల వర్షం కురిపిస్తారని చెబుతారు బృంద సారథి హంకారే. ఇక ‘బిన్ బేకాంచా తమాషా’ అనే మరో విధానం అయితే చాలా కాలం విజయవంతంగా నడిచింది. కాని నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, బుకింగ్స్ తగ్గిపోవడంతో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. ఈ క్రమంలోనే లావణిలో వినూత్న శైలులకు బీజాలు పడ్డాయి. కామ్తే, సతామ్ సంగీత్ బరి విధానంలో ఇస్తున్న ప్రదర్శనలైతే పట్టణ ప్రజలలో వివిధ వర్గాల వారి మధ్య ఉన్న దూరాన్ని తుడిచివేస్తున్నాయి. – జయంతి తొమ్మిది గజాల చీర ఢోల్కీ అనే వాద్య పరికరం వాయిస్తూంటే ఈ లావణి నాట్యం చేస్తుంటారు. తొమ్మిది గజాల చీర ధరించి మహిళలు ఈ నాట్యం చేస్తారు. నాట్యానికి పాడే పాటలో వేసే దరువు చాలా వేగంగా ఉంటుంది. లావణ్య అనే పదం నుంచి లావణి పదం వచ్చింది. ఈ పదానికి ‘అందమైన’ అని అర్థం. మరాఠీలోని లావణే అనే పదం నుంచి వచ్చినట్టు చెబుతారు. -
గండికోట ఉత్సవాలకు జానపద కళ
కడప కల్చరల్ : నవంబరులో జరగనున్న గండికోట వారసత్వ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్శణగా జానపద బ్రహ్మోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్సవాలలో అటు జానపద కళలు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు జిల్లా కళాకారులను కూడా ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి చెక్కభజన, జడకోలాటం, కోలాటం తదితర జానపద ప్రక్రియలకు ఈ ఉత్సవాలలో భాగస్వామ్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జానపద కళా బృందాలు, తిరుమల–తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టులో నమోదై ఉంటాయి. జిల్లా అధికారులు ఈ ఉత్సవాల కోసం ఆ ప్రాజెక్టు అధికారులను కొన్ని నాణ్యమైన కళాబృందాలను జిల్లాకు పంపాలని కోరారు. టీటీడీ అధికారులు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. ఉత్సవాల రెండు రోజుల్లోనూ టీటీడీ ప్రాజెక్టు పక్షాన కొన్ని కార్యక్రమాలను స్పాన్సర్ చేయనున్నట్లు తెలుస్తోంది. గండికోటలో ఉత్సవాల నిర్వహణకు ఐదెకరాల స్థలాన్ని చదును చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రతిష్ఠాత్మకంగా.. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే అవకాశం ఉంది. నవంబరు 10లోపుగానీ, 23 తర్వాత గానీ ఉత్సవాల నిర్వహణకు తేదీలు ఖరారు కానున్నాయి. ఇందులో అన్ని నాణ్యతగల కార్యక్రమాలను ఎంపిక చేసేందుకు సంబంధిత అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే శాస్త్రీయతను ప్రతిబింబించే నృత్యాలు, ఇతర కార్యక్రమాలతోపాటు ఆధునికత కడా మేళవించిన ‘ఫ్యూజన్’ నృత్యాలను కూడా ప్రదర్శనలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు పలువురు ప్రముఖ మిమిక్రీ కళాకారుల ప్రదర్శనలు, భారతదేశానికి ప్రతిష్ఠాత్మకంగా నిలిచే నృత్య భారతీయం లాంటి అన్ని రాష్ట్రాల నృత్య రీతుల సమ్మేళనాలను ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.