స్టేజీ మీద ఈ అబ్బాయిలను చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గమీద ముద్దుల వర్షం కురిపిస్తారని ‘లావణి’ నాట్య బృందాలలో ఒక బృందానికి సారథి అయిన హంకారే చిరునవ్వుతో చెబుతున్నారు. స్త్రీ వేషం ధరించి, థీమ్‌ని మార్చి యువకులు చేస్తున్న ప్రాచీన ‘లావణి’ నాట్య రూపకాలకు మహారాష్ట్రలో ఇప్పుడు అమితమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది.
పాటలు పాడుతూ, నాట్యం చేసే జానపద కళకు ‘లావణి’ అని పేరు. ఇటీవల కొంతకాలంగా మహారాష్ట్ర యువకులు స్త్రీ వేషధారణతో ఈ కళను పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ‘లావణి’ తో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. ‘నాట్యం చేస్తున్న ఆ మూడు గంటలూ మమ్మల్ని మేం మరచిపోతాం’ అంటాడు ఆనంద్ సతామ్ అనే లావణి నాట్యకారుడు. మహారాష్ట్ర పట్టణప్రాంతాల్లో అమ్మాయి రూపంలో నాట్యం చేస్తున్న వందలాదిమందిలో ఆనంద్ సతామ్ ఒకరు. జనవరి 25న ముంబైలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్’ లో సావిత్రి మేధాతుల్ రచించిన సంగీత రూపకం ‘సంగీత బరి’లో ఆనంద్ సతామ్ తో పాటు కామ్‌తే అనే యువకుడు ‘లావణి’ ని ప్రదర్శించాడు.
ఈ నాట్యం చేసేవారి కదలికలు.. వేదిక మీదే కాదు, వేదిక బయట కూడా స్త్రీలాగే మారుతుంటాయి. దాంతో మగపిల్లలు ఆడపిల్లలుగా మారిపోతారేమోననే భయంతో కుటుంబ సభ్యులు వారిని ఈ పాత్రలు వెయ్యొద్దని నిరోధించేవారు. కాని సతామ్, కామ్‌తే ఇద్దరూ లావణి నాట్యాన్ని ప్రదర్శించడానికే ఉత్సాహం చూపించారు. ‘‘ఒకప్పుడు నన్ను ఈ నాట్యం చేయొద్దని చెప్పినవారే, ఇప్పుడు నా నాట్యం చూసి గర్వపడుతున్నారు, నా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు’ అంటాడు కామ్‌తే.
ఉన్నవి రెండు విధానాలు
పట్ణణ ప్రేక్షకులు లావణి కళారూపాన్ని మోహవాంఛకు రిఫ్లెక్షన్‌గా భావిస్తుంటారు. వాస్తవానికి ఈ నాట్యంలో ఆధ్యాత్మికత, వేదాంతం, నిరక్షరాస్యత, రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఉంటుంది. ప్రధానంగా అయితే ‘లావణి’ని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ‘దోల్కీ ఫాడ్ తమాషా’, ‘సంగీత్ బరి’. దోల్కీ ఫాడ్ తమాషాలో లావణి ప్రదర్శన నాలుగు నుంచి ఎనిమిది గంటలపాటు నడుస్తుంది. ఇందులో కళాకారులు గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూంటారు.
గ్రామాలలో వారంవారం పెట్టే గ్రామసంతలో, పశువుల సంతలలో ఎక్కువమంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శిస్తారు. సంగీత్ బరిలో.. గుంపులుగా, సంచరిస్తూ, కొద్దిమంది ప్రేక్షకుల ముందు కూడా నటిస్తారు. వీరికి ఏడాదికి సరిపడా కాంట్రాక్టు ఉంటుంది. సాధారణంగా ఆడవారు మాత్రమే సంగీత్ బరిలో నటిస్తు్తంటారు. ముఖ్యంగా భాటు కోల్హాటి లేదా కళావంతుల కుటుంబాలకు చెందినవారు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. వారి ఆచారం ప్రకారం ఈ కుటుంబాలలోని మహిళలు వివాహానికి అనర్హులు. వీరు కేవలం వేశ్యావృత్తిలో మాత్రమే జీవించాలి.
కొత్తగా మూడో విధానం
కామ్‌తే, సతామ్‌ల ప్రదర్శనలు మూడోరకానికి చెందినవి. వీటిని బ్యానర్ ప్రదర్శనలు అంటారని చెబుతారు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన పి.హెచ్‌డీ స్కాలర్ సేజల్ యాదవ్. ఈయన లావణి ప్రదర్శకుల మీద విస్తృతంగా పరిశోధన చేశారు. 2016లో ‘లావణి లైవ్’ పేరున ఒక ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు. లావణి ప్రదర్శనలాంటివే సమకాలీనంగా ఎన్నో ఉన్నాయి. ప్రతివారికి వారి సొంత ఆలోచన ఉంటుంది. లావణిలోని అసలు విషయాన్ని వీరు పక్కకు తోసేసి, సొంతంగా రూపొందించుకుంటూ, అందరినీ వారి గుంపులో చేర్చుకుంటున్నారు. లావణిని ప్రదర్శించేవారిలో ఒకరైన ‘హంకారే బృందం’ సుమారు మూడుమాసాల పాటు లావణిలా నటించడానికి సాధన చేస్తుంది.
అమ్మాయిలా నడవటం, అమ్మాయిలా మాట్లాడటం వంటివి రంగస్థలం మీద ప్రదర్శించడానికి ముందే నేర్చుకుంటారు. వారిని చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గ మీద ముద్దుల వర్షం కురిపిస్తారని చెబుతారు బృంద సారథి హంకారే. ఇక ‘బిన్ బేకాంచా తమాషా’ అనే మరో విధానం అయితే చాలా కాలం విజయవంతంగా నడిచింది. కాని నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, బుకింగ్స్ తగ్గిపోవడంతో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. ఈ క్రమంలోనే లావణిలో వినూత్న శైలులకు బీజాలు పడ్డాయి. కామ్‌తే, సతామ్ సంగీత్ బరి విధానంలో ఇస్తున్న ప్రదర్శనలైతే పట్టణ ప్రజలలో వివిధ వర్గాల వారి మధ్య ఉన్న దూరాన్ని తుడిచివేస్తున్నాయి.
– జయంతి
తొమ్మిది గజాల చీర
ఢోల్కీ అనే వాద్య పరికరం వాయిస్తూంటే ఈ లావణి నాట్యం చేస్తుంటారు. తొమ్మిది గజాల చీర ధరించి మహిళలు ఈ నాట్యం చేస్తారు. నాట్యానికి పాడే పాటలో వేసే దరువు చాలా వేగంగా ఉంటుంది. లావణ్య అనే పదం నుంచి లావణి పదం వచ్చింది. ఈ పదానికి ‘అందమైన’ అని అర్థం. మరాఠీలోని లావణే అనే పదం నుంచి వచ్చినట్టు చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment