గండికోట ఉత్సవాలకు జానపద కళ
కడప కల్చరల్ :
నవంబరులో జరగనున్న గండికోట వారసత్వ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్శణగా జానపద బ్రహ్మోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్సవాలలో అటు జానపద కళలు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు జిల్లా కళాకారులను కూడా ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి చెక్కభజన, జడకోలాటం, కోలాటం తదితర జానపద ప్రక్రియలకు ఈ ఉత్సవాలలో భాగస్వామ్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జానపద కళా బృందాలు, తిరుమల–తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టులో నమోదై ఉంటాయి. జిల్లా అధికారులు ఈ ఉత్సవాల కోసం ఆ ప్రాజెక్టు అధికారులను కొన్ని నాణ్యమైన కళాబృందాలను జిల్లాకు పంపాలని కోరారు. టీటీడీ అధికారులు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. ఉత్సవాల రెండు రోజుల్లోనూ టీటీడీ ప్రాజెక్టు పక్షాన కొన్ని కార్యక్రమాలను స్పాన్సర్ చేయనున్నట్లు తెలుస్తోంది. గండికోటలో ఉత్సవాల నిర్వహణకు ఐదెకరాల స్థలాన్ని చదును చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ప్రతిష్ఠాత్మకంగా..
ఈ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే అవకాశం ఉంది. నవంబరు 10లోపుగానీ, 23 తర్వాత గానీ ఉత్సవాల నిర్వహణకు తేదీలు ఖరారు కానున్నాయి. ఇందులో అన్ని నాణ్యతగల కార్యక్రమాలను ఎంపిక చేసేందుకు సంబంధిత అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే శాస్త్రీయతను ప్రతిబింబించే నృత్యాలు, ఇతర కార్యక్రమాలతోపాటు ఆధునికత కడా మేళవించిన ‘ఫ్యూజన్’ నృత్యాలను కూడా ప్రదర్శనలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు పలువురు ప్రముఖ మిమిక్రీ కళాకారుల ప్రదర్శనలు, భారతదేశానికి ప్రతిష్ఠాత్మకంగా నిలిచే నృత్య భారతీయం లాంటి అన్ని రాష్ట్రాల నృత్య రీతుల సమ్మేళనాలను ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.