ఫూడీస్ గ్రూప్.. ఇక్కడ అన్నీ షేర్ చేయబడును..
ఇదిగో బుల్లి ఊతప్పల బ్రేక్‌ఫాస్ట్.. ఇటు చూడు కట్లెట్, బ్రెడ్ పీజా, మోమోస్, ఇడ్లీ. మా ఇంట్లో చికెన్ ఫ్రై ... మా ఇంట్లో గోంగూర మటన్ ఈ రోజు శనెగపప్పు కారం, రస్మలాయ్ డెసర్ట్..ఇప్పుడే ట్రై చేశా ఈ కొత్త వంట.. అంటూ మూడు పూటల వంటల సందడి ఆ పేజీ నిండా.. ఆ ఫేస్బుక్ పేజీ తెరిస్తే చాలు... కమ్మని రుచుల ఘుమఘుమలు...
మనసు మురిసే పలకరింపులు..కాసేపు ఫేస్బుక్లో ఆ పేజీని బ్రౌజ్ చేస్తే తినే వారికి ఎక్కడలేని ఉత్తేజం, రుచిగా ఏదైనా వండి అందరికి చూపించాలనే ఉత్సాహం వండే వారికి కలగక మానవు. అలా 31 వేల మందిని యాక్టివ్ మెంబర్స్‌గా, దాదాపు ఫ్యామిలీ మెంబర్స్‌గా మార్చేసిన గ్రూప్ ఫుడీస్ ఇన్ ఆంధ్రా (ఎఫ్ఐఏ) ఫేస్బుక్ పేజ్
హైదరాబాద్: 2015లో ఈ గ్రూప్‌ని స్టార్ట్ చేశాం. మరుగున పడిన ఆంధ్రా వంటలను గుర్తు చేసుకోవడానికి, ఆ వంటలను అందరితో పంచడానికి ఈ గ్రూప్ ఏర్పాటు చేశాను. ఇంట్లో ఎంతో కష్టపడి ఎంతో రుచిగా వండి పెట్టే అమ్మలకు వారి శ్రమను గుర్తించి, వంట కమ్మదనం గురించి రెండు మాటలు చెప్పే వారు కరువే. గృహిణిలకు అలాంటి ఒక మాట ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆ లోటు లేకుండా చేస్తుంది ఫూడిస్ ఇన్ ఆంధ్రా ఫేస్బుక్ పేజ్. ముప్పైవేల మంది సభ్యులున్న ఈ గ్రూప్‌లో 65శాతం స్త్రీలే ఉంటారని చెప్పారు ఎఫ్ఐఏ గ్రూప్ ఫౌండర్ మధుకర్ నెక్కండి. స్కాట్‌ల్యాండ్, యుఎస్ఏలోని పలు రాష్ట్రాల వారు, నైరోబియా, దుబాయ్ దేశాల్లో తెలుగు వాళ్లు ఈ గ్రూప్‌లో ఉన్నారు.
వారు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా గ్రూప్‌లో ఉన్న మిగతా వారిని కలిసివెళ్తుంటారు. ఈ గ్రూప్ వల్ల ఇప్పుడు సండే వచ్చిందంటే ఒకటే సందడి. ఒక పండుగలా అనిపిస్తుందని చెబుతారు ఇందులో సభ్యుడైన గిరిధర్. కేవలం చేసిన వంటను ఫేస్బుక్ పేజ్‌లో షేర్ చేసుకోవటమే కాదు ఇంట్లో ఏ విశేషం జరిగినా గ్రూప్‌లో నిస్సంకోచంగా పంచుకుంటారు. ఏదైన సహాయం అవసరమని తెలిస్తే చాలు గ్రూప్ అడ్మిన్లు వ్యక్తిగతంగా వారికి సాయపడతారని చెబుతున్నారు మరో సభ్యుడు శివచౌదరి.
చారిటీలోను ముందే..
ఆహారం గురించి పంచుకోవడమే కాదు.. ఈ ఫేస్బుక్ గ్రూప్ అనాథ ఆశ్రమాలకు వెళ్లి అక్కడి పిల్లలకు తమ చేతి వంట రుచి చూపిస్తుంటారు. అక్కడ ఏదైనా అవసరం ఉందంటే గ్రూప్ అంతా చేరి వారికి సాయం అందిస్తున్నారు. చలి కాలంలో ఐదు జిల్లాల్లో మూడు వేల దుప్పట్లుపంచిపెట్టారు. గ్రూప్‌ని ఫేస్బుక్ మాత్రమే పరిమితం చెయ్యకుండా అనేక సేవకార్యక్రమాలకు కూడా వేదిక చేశారు.
రిక్వెస్ట్‌ల కంటే రిజెక్ట్లే ఎక్కువ..
31వేల మంది మెంబర్స్‌గా ఉంటే, రిజెక్ట్ చేసిన వారు 70వేలకు పైగా ఉంటారు. రిక్వెస్ట్ చేసిన ప్రతి మెంబర్ ప్రొఫైల్‌ని పూర్తిగా చెక్ చేసిన తర్వాతే రిక్వెస్ట్‌ని అంగీకరిస్తారు. ఫేక్ ప్రొఫైల్‌కు, ఆకతాయిలకు ఇక్కడ చోటు లేదు. గ్రూప్‌లో ఏ చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే పేజ్ అడ్మిన్లను కాంటాక్ట్ చెయ్యవచ్చు. మహిళలు వారికి నచ్చిన విషయాలతో పాటు కుటుంబ విషయాలు, సమస్యలు కూడా షేర్ చేసుకుంటారు. ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవటం, సలహాలు అందించుకోంటారు. ఇలా ఇదో గ్రూప్ అనే కంటే ఒక కుటుంబం అనేంతగా అందరం కనెక్ట్ అయిపోయాం.- సునీత గారపాటి, ఫుడీస్ ఇన్ ఆంధ్రా గ్రూప్ అడ్మిన్