form ponds
-
వ్యవసాయ బోర్లకు పగటిపూటే విద్యుత్
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు రైతన్నల కోరిక నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం ఫీడర్లలో గురువారంనుంచి వ్యవసాయ బోర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా మొదలైంది. ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని క్షేత్రస్థాయి అధికారులు విద్యుత్ సరఫరాను దగ్గరుండి పరిశీలించారు. ఫీడర్లలో పరిస్థితి, సాంకేతిక సమస్యలను, ట్రాన్స్ఫార్మర్లపై పడే లోడ్‌ను రికార్డు చేశారు. ఎప్పటికప్పుడు వివరాలను విజయవాడలోని విద్యుత్ ఉన్నతాధికారులకు అందజేశారు. అన్ని జిల్లాల్లో విజయవంతం... అన్ని జిల్లాల్లోనూ విజయవంతంగా 9 గంటల విద్యుత్ అందించినట్టు డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. చెప్పుకోదగ్గ రీతిలో పెద్దగా సాంకేతిక సమస్యలేమీ రాలేదని, సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరించారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 విద్యుత్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహావసరాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. వీటిల్లో 3,854 ఫీడర్లలో నిరాటంకంగా పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమని అధికారులు భావించారు. ఈ ఫీడర్ల పరిధిలో వారం రోజులుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే, మిగిలిన 2809 (40 శాతం) ఫీడర్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగా 9 గంటల నిరంతర సరఫరా సాధ్యం కాదని ముందే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫీడర్ల బలోపేతానికి సర్కార్ రూ.1,700 కోట్లను మంజూరు చేస్తున్నట్టు వెల్లడింది. వీటిల్లో కూడా మార్చి చివరి వారానికి పూర్తిస్థాయిలో పగటి 9 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించారు. భూగర్భ జలాలు అడుగంటిన చోట రెండు విడతలు! తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా వల్ల కొన్ని ప్రాంతాల్లో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో ఏకబిగిన తొమ్మిది గంటలు బోరు నడిచే పరిస్థితి లేదని, ఈ కారణంగా రెండు విడతలుగా విద్యుత్ ఇవ్వాలన్న రైతుల విజ్ఞప్తిని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అవసరమైతే పగటి పూటే రెండు విడతలుగా అందించేందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని ఎస్పీడీసీఎల్ ఇన్ఛార్జ్ సీఎండీ వివరించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది గమనించిన తర్వాత ఏ ప్రాంతంలో విద్యుత్ విడతలవారీగా ఎలా ఇవ్వాలనే విషయాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అవసరాలకు కేవలం 7 గంటలే విద్యుత్ సరఫరా జరిగింది. అదీ కూడా చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి సరఫరావల్ల అనేకమంది రైతులు విద్యుదాఘాతంతో చనిపోయారు. అనేక ఇబ్బందులూ పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో రైతులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జగన్ అప్పట్లోనే పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో మొత్తం 6,663 విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వీటిద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీటిలో 3,854 ఫీడర్లకు పగటి పూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. మిగిలిన 2,809 ఫీడర్లను 9 గంటల విద్యుత్ ఇచ్చే సామర్థ్యానికి పెంచేందుకు విద్యుత్ శాఖ తేదీలను ప్రకటించింది. డిస్కమ్‌ల వారీగా.. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 2,214 ఫీడర్ల సామర్థ్యం పెంచాల్సి ఉంది. జూలై 15నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియను మార్చి 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఏలూరు, రాజమండ్రి జిల్లాల్లో 595 ఫీడర్లున్నాయి. వీటిని జూన్ 30నుంచి మొదలు పెట్టి, డిసెంబర్ 31. 2019 నాటికి సామర్థ్యం పెంచి, 9 గంటల విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
‘ఉపాధి’ వెతలు
- గిట్టుబాటు కాని ‘ఉపాధి’ కూలి - పెండింగ్‌లో రూ.10 కోట్ల వేతనాలు - ఇతర ప్రాంతాలకు కూలీల వలస - పూర్తికాని ఫారంపాండ్స్ లక్ష్యం జాబ్ కార్డులు ఉన్నవారు: సుమారు 8 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్తున్న వారు: 1,05,000 మంది కర్నూలు(అర్బన్): ఉపాధి హామీ పథకం..లక్ష్యం నెరవేరడం లేదు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం..కూలి తక్కువగా ఉండడంతో ఉపాధి పనులపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కూలి ఎక్కువగా ఇస్తుండడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. జిల్లాలోని 36 కరువు మండలాలు ఉండగా.. ఇక్కడ కూలీలకు 150 రోజులు ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. అయితే ఈ మండలాల్లో చేసిన పనులకు వేతనాలు చెల్లించడం లేదు. ఎండలు అప్పుడే మండి పోతున్నాయి .. గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. మండుతున్న ఎండల్లో కూలీలు పనులు చేయలేక పోతున్నారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాల్లో షెడ్లు, మంచినీటి సరఫరా కూడా అంతంత మాత్రంగా ఉంటోంది. పైగా అధికారులు ఫారంపాండ్స్పైనే ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి వర్షాలు పడకపోవడంతో భూమి గట్టిపడి తవ్వడం చాలా కష్టంగా మారింది. దీంతో కూలీలు కొంత సులభంగా ఉండే వంకలు, వాగులు, చెరువుల్లో పూడికతీత పనులకు వెళ్లేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫారంపాండ్స్ తవ్వేందుకు వీరు ముందుకు రావడం లేదు. జిల్లా సరిహద్దుల్లోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఇంకా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల ప్రజలు అక్కడికి వెళ్లి పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య లక్షకు మించడం లేదు. పెండింగ్‌లో రూ.10 కోట్ల ఉపాధి బకాయిలు ... ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదు. ఈ బకాయిలు దాదాపు రూ.10 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ అవుతున్న కారణంగా కూడా పలు సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనేక మంది కూలీలకు బ్యాంకు ఖాతాలు లేక పోవడం, ఒకవేళ ఖాతాలు ఉన్నా, వారి ఆధార్‌కార్డును అనుసంధానం చేయకపోవడం, ఎన్సీపీఐ డాటాలో సింక్ కాకపోవడం వల్ల దాదాపు రూ.3 కోట్లు వివిధ బ్యాంకుల్లోని సస్పెన్షన్ ఖాతాల్లోనే మూలుగుతున్నట్లు తెలుస్తోంది. వారమంతా పనిచేసినా, వేతనాలు అందకపోవడం వల్ల రోజువారీ కూలి ఇచ్చే పనులకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు గ్రామాలకు చెందిన వారు ఉదయమే ట్రాక్టర్ల ద్వారా మన కూలీలను తీసుకువెళ్తున్నారు. 11 రోజుల్లో 9,992 ఫారంపాండ్స్ పూర్తి సాధ్యమేనా ... జిల్లాకు మొత్తం 80,329 ఫారంపాండ్స్ మంజూరు కాగా, 36,169 పనులు ప్రారంభించారు. ఇందులో 26,177 ఫారంపాండ్స్ పూర్తి అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 9,992 పనులను పూర్తి చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరుకు వీటిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇంకా 11 రోజుల గడువులో వీటిని ఎలా పూర్తి చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కూలి గిట్టుబాటు కాకపోవడం వల్ల కూడా ఈ పనుల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని 150 నుంచి 200 గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. ఆయా ప్రాంతాల్లోని సీనియర్ మేటీలే మూడు, నాలుగు గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ కారణంగా పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. పైపెచ్చు సీనియర్ మేటీలను కూడా ఆయా గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉంది. ఇందులో కూడా రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గుతోంది. రోజుకు రూ.200 ఇస్తున్నారు: మద్దయ్య, జి. శింగవరం ఏటవతల కొరివిపాడు, క్యాంపు తదితర గ్రామాల్లో మిరప తెంపేందుకు పోతే రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఉదయం 7 గంటలకు ట్రాక్టర్ మీద తీసుకుపోయి సాయంత్రం 3 గంటలకు తిరిగి ఊర్లో వదలి వెళ్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున నీడ పాటున చేసే పనులకు పోతున్నాం. కుటుంబంలో ఐదుగురు పనికి పోతే రోజుకు రూ.1000 వస్తోంది. నదీ తీర గ్రామాల్లోని కూలీలందరూ మిరప తెంపేందుకే పోతున్నారు. వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి: డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డ్వామా పీడీ కూలీలకు వేతనాలు దాదాపు ఎనిమిది వారాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తే సాయంత్రానికే కూలీలు ఇస్తున్న కారణంగా ఆయా ప్రాంతాలకు పనికి వెళ్తున్నారు. అందులో మిరప తెంపేందుకు కుటుంబంలో ఎంత మంది ఉంటే చిన్న, పెద్ద తేడాలేకుండా అంతమంది పనికి వెళ్లే అవకాశం ఉంది. ఉపాధిలో జాబ్‌కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే అవకాశం. ఆయా ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు మాత్రమే పనులు ఉంటాయి. ఏప్రిల్ నుంచి ఉపాధి కూలీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
అతీగతీలేని ‘పంట సంజీవిని
లక్ష్యానికి దూరంగా ఫారం పాండ్స్ నిర్మించాల్సినవి 15949 ఇప్పటి వరకు తవ్వినవి 24 {పచారానికే పరిమితం నీటిలోటును పూడ్చే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం అట్టహాసంగా పొలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన పంటసంజీవినికి అతీగతీలేకుండా పోయింది. లక్ష్యానికి ఆమడ దూరంలో ఈపథకం మూలుగుతోంది. నెలాఖరుకు లక్ష్యాన్ని పూర్తి చేయాలంటూ ప్రభుత్వం హడావుడి చేస్తే జిల్లాలో మాత్రం కనీసం అడుగు ముందుకు పడని దుస్థితి. విశాఖపట్నం : పంట సంజీవిని పథకం కింద వేసవిలో జిల్లా వ్యాప్తంగా 20వేల పంటగుంతలు (ఫారం పాండ్స్) తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో వీటి నిర్మాణానికి అవసరమైన పరిపాలనామోదం కూడా ఇచ్చింది. నీరు-ప్రగతి పేరుతో జిల్లాల వారీగా సదస్సులు..మండలాలవారీగా సమావేశాలు పెట్టి రైతులను చైతన్య పరిచేందుకు కార్యక్రమాలు సైతం నిర్వహించారు. కానీ ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. కనీవినీ ఎరుగని రీతిలో వేసవిలో కరవు విలయతాండ వం చేయడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ వేసవి ముగిసే లోగా యుద్ధప్రాతిపదిక న ఇంకుడుగుంతలు, పంట గుంతలు తవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చివరకు రూ.117.98 కోట్ల అంచనాతో 15,949 పనులకు పరిపాలనామోదం ఇచ్చారు. గుంత సైజును బట్టి రూ.45వేల నుంచి రూ.1.05లక్షల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు.తమపొలంలో ఈ గుంత తవ్వుకునేందుకు ఏ రైతు ముందుకొస్తారో ఆ రైతుకు ముందుగా జాబ్‌కార్డు జారీ చేస్తారు. ఆ తర్వాత గుంత సైజును బట్టి పరిపాలనామోదం ఇచ్చిన తర్వాత ఉపాధి కూలీలతో కలిసి ఫారంపాండ్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. తవ్వగా వచ్చిన మట్టిని పూర్తిగా పొలం గట్లను ఎత్తు చేసు కునేందుకు ఉపయోగించుకోవచ్చు. జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాన్ని నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ జిల్లాలో ఇంకుడుగుంతలు ప్రచారాానికే పరిమితం కాగా..పంట గుంతల జాడలేకుండా పోయింది. జిల్లాలో మే నెలాఖరు కల్లా పంటగుంతల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రైతుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. వారిని చైతన్య పర్చడంలో అధికారులు కూడా ఘోరంగా విఫలమయ్యారు. జిల్లాలో ప్రస్తుత సీజన్లో 15,949 పంట గుంతలు నిర్మించేందుకు పరిపాలనామోదం ఇవ్వగా.. అతికష్టంమీద 2154 పనులను మాత్రమే చేపట్ట గలిగారు. ఇప్పటివరకు రూ.3.17కోట్లు ఖర్చు చేసి కేవలం 24 పంటగంతల నిర్మాణం మాత్రమే పూర్తి చేయడం ద్వారా లక్ష్యంలో 10.89 శాతాన్ని కూడా అధిగమించలేక పోయారు. ఈసారి వర్షాలు బాగుంటాయని పది రోజుల ముందుగానే తొలకరి పలుకరిస్తుందని వాతావరణశాఖ చెప్పడంతో ఎలాగైనా సరే నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పంటగుంతలు తవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం కనిపించలేదు. తమ పంటపొలాల్లో పంటగుంతలు తవ్వుకోవాలని భావించినా స్థానిక అధికారులు సవాలక్ష కొర్రీలు వేస్తునారని మాకవరపాలెంనకు చెందిన లక్ష్మణరావు అనే రైతు సాక్షి వద్ద వాపోయారు. కూలీలకు వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని చెబుతున్నారు. అందువల్లే రైతులు ఆసక్తి చూపడం లేదంటున్నారు.