సాక్షి, అమరావతి: ఎట్టకేలకు రైతన్నల కోరిక నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం ఫీడర్లలో గురువారంనుంచి వ్యవసాయ బోర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా మొదలైంది. ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని క్షేత్రస్థాయి అధికారులు విద్యుత్ సరఫరాను దగ్గరుండి పరిశీలించారు. ఫీడర్లలో పరిస్థితి, సాంకేతిక సమస్యలను, ట్రాన్స్‌ఫార్మర్లపై పడే లోడ్‌ను రికార్డు చేశారు. ఎప్పటికప్పుడు వివరాలను విజయవాడలోని విద్యుత్ ఉన్నతాధికారులకు అందజేశారు.
అన్ని జిల్లాల్లో విజయవంతం...
అన్ని జిల్లాల్లోనూ విజయవంతంగా 9 గంటల విద్యుత్ అందించినట్టు డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. చెప్పుకోదగ్గ రీతిలో పెద్దగా సాంకేతిక సమస్యలేమీ రాలేదని, సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరించారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 విద్యుత్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహావసరాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. వీటిల్లో 3,854 ఫీడర్లలో నిరాటంకంగా పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమని అధికారులు భావించారు.
ఈ ఫీడర్ల పరిధిలో వారం రోజులుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే, మిగిలిన 2809 (40 శాతం) ఫీడర్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగా 9 గంటల నిరంతర సరఫరా సాధ్యం కాదని ముందే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫీడర్ల బలోపేతానికి సర్కార్ రూ.1,700 కోట్లను మంజూరు చేస్తున్నట్టు వెల్లడింది. వీటిల్లో కూడా మార్చి చివరి వారానికి పూర్తిస్థాయిలో పగటి 9 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించారు.
భూగర్భ జలాలు అడుగంటిన చోట రెండు విడతలు!
తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా వల్ల కొన్ని ప్రాంతాల్లో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో ఏకబిగిన తొమ్మిది గంటలు బోరు నడిచే పరిస్థితి లేదని, ఈ కారణంగా రెండు విడతలుగా విద్యుత్ ఇవ్వాలన్న రైతుల విజ్ఞప్తిని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అవసరమైతే పగటి పూటే రెండు విడతలుగా అందించేందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని ఎస్పీడీసీఎల్ ఇన్‌ఛార్జ్ సీఎండీ వివరించారు.
ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది గమనించిన తర్వాత ఏ ప్రాంతంలో విద్యుత్ విడతలవారీగా ఎలా ఇవ్వాలనే విషయాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అవసరాలకు కేవలం 7 గంటలే విద్యుత్ సరఫరా జరిగింది. అదీ కూడా చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి సరఫరావల్ల అనేకమంది రైతులు విద్యుదాఘాతంతో చనిపోయారు. అనేక ఇబ్బందులూ పడ్డారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో రైతులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జగన్ అప్పట్లోనే పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో మొత్తం 6,663 విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వీటిద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీటిలో 3,854 ఫీడర్లకు పగటి పూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. మిగిలిన 2,809 ఫీడర్లను 9 గంటల విద్యుత్ ఇచ్చే సామర్థ్యానికి పెంచేందుకు విద్యుత్ శాఖ తేదీలను ప్రకటించింది.
డిస్కమ్‌ల వారీగా..
దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 2,214 ఫీడర్ల సామర్థ్యం పెంచాల్సి ఉంది. జూలై 15నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియను మార్చి 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఏలూరు, రాజమండ్రి జిల్లాల్లో 595 ఫీడర్లున్నాయి. వీటిని జూన్ 30నుంచి మొదలు పెట్టి, డిసెంబర్ 31. 2019 నాటికి సామర్థ్యం పెంచి, 9 గంటల విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment