nine hours of electricity
-
మెట్ట రైతుకు మంచి రోజులు
కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్ : ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో ఏమాత్రం లోటు రాకూడదు. రైతన్నలకు ఇచ్చే కరెంట్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్వీసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు’ అని అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రత్యేకంగా పూర్తిగా బోరు నీటిపైనే ఆధారపడి సాగు చేసే మెట్ట ప్రాంత రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల్లో రైతుల వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా 2 విడతల్లో ఇచ్చేవారు. అది కూడా వేళకాని వేళల్లో వచ్చేది. గతంలో కరెంట్ కోసం రైతన్నలు రాత్రిపూట పొలాల్లో జాగారం చేయాల్సిన దుస్థితి. ఫీడర్లు సరిపడా లేకపోవడం వల్ల వ్యవసాయ మోటార్లు తరచూ కాలిపోయేవి. ఏపీలో ఉన్న 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అందుబాటులో ఉండేవి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై నాలుగైదు సర్విసులు ఉండటం వల్ల ఏ సమస్య వచ్చినా అన్నిటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. మరమ్మతులకు నెలల తరబడి సమయం పట్టడంతో కళ్లెదుటే పంటలు ఎండిపోయేవి. పెట్టుబడులు కూడా వెనక్కి రాక అన్నదాతలు అఘాయిత్యాలకు పాల్పడ్డ దుస్థితి గతంలో నెలకొంది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 6,605 ఫీడర్లు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. విద్యుత్ ప్రమాదాలు, సరఫరా నష్టాలకు ప్రధానంగా ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కారణం. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతోపాటు ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు, పవర్ కెపాసిటర్ల ఏర్పాటు, పాత లైన్ల మరమ్మతులతో సమస్యలు తొలగిపోయాయి. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి వ్యవసాయ సర్వీసుకీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కరెంట్ అందిస్తున్నారు. ప్రభుత్వానిదే భారమంతా.. తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిధిలో వ్యవసాయ ఫీడర్లు ఏటా 15,700 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. ఇది ఏపీలో ఏటా వినియోగించే 64 నుంచి 66 వేల మిలియన్ యూనిట్ల వినియోగంలో నాలుగింట ఒక వంతు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల జీవిత కాలం 25 ఏళ్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్థారించింది. కాల పరిమితి తీరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. లేదంటే యూనిట్‌కు రూ.8 చొప్పున నష్టాలు పెరుగుతాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి నాలుగైదు సర్విసులకు విద్యుత్ సరఫరా చేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు త్వరగా పాడవుతున్నాయి. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి మరమ్మతులకు రూ.102 కోట్లు ఖర్చవుతోంది. దీన్ని అధిగమించేందుకు హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్), రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ద్వారా ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, ఫీడర్లను వేరు చేయడం లాంటి చర్యలు చేపట్టారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను సమకూరుస్తున్నారు. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్లర్లు, లైన్ల సామర్థ్యం పెంచుతున్నారు. ఈ ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్విసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతులకు ఏ కష్టం రాకుండా.. వ్యవసాయ రంగం అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారు. ఏపీలో మొత్తం 2,12,517 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. వేలాది కి.మీ. పొడవున కొత్త లైన్లు నిర్మించాం. – కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తడిచిన పొలమే తడిచి.. మా ప్రాంతంలో అంతా కరెంట్‌పై ఆధారపడే వ్యవసాయం జరుగుతుంది. గతంలో హెచ్‌టీ, ఎల్టీ లైన్లు ఒకే స్థంభం మీద ఉండటంతో చిన్న గాలికే కలిసిపోయి ట్రాన్స్ఫార్మర్, మోటార్ కాలిపోయేవి. రోజుకి 7 గంటలు అది కూడా 2,3 మూడు సార్లు కరెంట్ ఇవ్వడంతో తడిచిన పొలాలే తడిచి అవస్థలు ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వం పగటిపూట 9 గంటలు కరెంటిస్తుంది. – రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం -
వ్యవసాయ బోర్లకు పగటిపూటే విద్యుత్
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు రైతన్నల కోరిక నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం ఫీడర్లలో గురువారంనుంచి వ్యవసాయ బోర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా మొదలైంది. ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని క్షేత్రస్థాయి అధికారులు విద్యుత్ సరఫరాను దగ్గరుండి పరిశీలించారు. ఫీడర్లలో పరిస్థితి, సాంకేతిక సమస్యలను, ట్రాన్స్ఫార్మర్లపై పడే లోడ్‌ను రికార్డు చేశారు. ఎప్పటికప్పుడు వివరాలను విజయవాడలోని విద్యుత్ ఉన్నతాధికారులకు అందజేశారు. అన్ని జిల్లాల్లో విజయవంతం... అన్ని జిల్లాల్లోనూ విజయవంతంగా 9 గంటల విద్యుత్ అందించినట్టు డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. చెప్పుకోదగ్గ రీతిలో పెద్దగా సాంకేతిక సమస్యలేమీ రాలేదని, సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరించారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 విద్యుత్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహావసరాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. వీటిల్లో 3,854 ఫీడర్లలో నిరాటంకంగా పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమని అధికారులు భావించారు. ఈ ఫీడర్ల పరిధిలో వారం రోజులుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే, మిగిలిన 2809 (40 శాతం) ఫీడర్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగా 9 గంటల నిరంతర సరఫరా సాధ్యం కాదని ముందే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫీడర్ల బలోపేతానికి సర్కార్ రూ.1,700 కోట్లను మంజూరు చేస్తున్నట్టు వెల్లడింది. వీటిల్లో కూడా మార్చి చివరి వారానికి పూర్తిస్థాయిలో పగటి 9 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించారు. భూగర్భ జలాలు అడుగంటిన చోట రెండు విడతలు! తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా వల్ల కొన్ని ప్రాంతాల్లో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో ఏకబిగిన తొమ్మిది గంటలు బోరు నడిచే పరిస్థితి లేదని, ఈ కారణంగా రెండు విడతలుగా విద్యుత్ ఇవ్వాలన్న రైతుల విజ్ఞప్తిని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అవసరమైతే పగటి పూటే రెండు విడతలుగా అందించేందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని ఎస్పీడీసీఎల్ ఇన్ఛార్జ్ సీఎండీ వివరించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది గమనించిన తర్వాత ఏ ప్రాంతంలో విద్యుత్ విడతలవారీగా ఎలా ఇవ్వాలనే విషయాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అవసరాలకు కేవలం 7 గంటలే విద్యుత్ సరఫరా జరిగింది. అదీ కూడా చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి సరఫరావల్ల అనేకమంది రైతులు విద్యుదాఘాతంతో చనిపోయారు. అనేక ఇబ్బందులూ పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో రైతులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జగన్ అప్పట్లోనే పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో మొత్తం 6,663 విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వీటిద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీటిలో 3,854 ఫీడర్లకు పగటి పూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. మిగిలిన 2,809 ఫీడర్లను 9 గంటల విద్యుత్ ఇచ్చే సామర్థ్యానికి పెంచేందుకు విద్యుత్ శాఖ తేదీలను ప్రకటించింది. డిస్కమ్‌ల వారీగా.. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 2,214 ఫీడర్ల సామర్థ్యం పెంచాల్సి ఉంది. జూలై 15నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియను మార్చి 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఏలూరు, రాజమండ్రి జిల్లాల్లో 595 ఫీడర్లున్నాయి. వీటిని జూన్ 30నుంచి మొదలు పెట్టి, డిసెంబర్ 31. 2019 నాటికి సామర్థ్యం పెంచి, 9 గంటల విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
పగలే.. ‘జల’జలా..
సాక్షి, రాజానగరం (తూర్పు గోదావరి): గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే మెట్ట రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ, తొలి సంతకం చేశారు. ఆ తరువాత వ్యవసాయం గురించి, రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన నాథుడే లేడు. రోజుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారనే పేరే కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో కొంతమంది రైతులు మోటార్లు ఆన్ చేసేందుకు పొలాలకు వెళ్లి, పాము కాట్లకు గురై మృత్యువాత పడిన సంఘటనలున్నాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలు ప్రాంతాల్లోని రైతులు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. ఆ సందర్భంగా తాను అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ మోటార్లకు పగటి సమయంలోనే రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి అయిన ఆయన.. ఆ హామీ నిలబెట్టుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనివలన పూర్తి మెట్ట ప్రాంతంగా ఉన్న రాజానగరం నియోజకవర్గంలోని రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోంది. ప్రస్తుతానికి సాంకేతిక ఇబ్బందులు లేనిచోట జగన్ ప్రభుత్వం పగటి పూటే రోజుకు 9 గంటలు విద్యుత్ అందిస్తూండగా, అవకాశం లేనిచోట అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో 8,250 వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 1,51,965 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోరుకొండలో సాంకేతిక అవరోధాలు కోరుకొండ మండలంలో సుమారు 2,300 వ్యవసాయ విద్యుత్ మోటార్లున్నాయి. వీటి ద్వారా 28,750 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఇక్కడ కూడా వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు పండిస్తూంటారు. ఏటిపట్టుకు, మెట్ట ప్రాంతానికి మధ్యన ఉన్న ఈ మండలంలోని రైతులు సాగునీటికి ఎక్కువగా బోర్ల పైనే ఆధారపడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇక్కడ పంటలు పండుతాయి. లేకుంటే బోర్లున్న ప్రాంతాల్లోనే సాగు జరుగుతూంటుంది. మండలంలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ప్రకటించినవిధంగా వ్యవసాయ మోటార్లకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించలేకపోతున్నారు. సాంకేతికపరమైన సమస్యలున్నందున, వాటిని నివారించే వరకూ ఇది సాధ్యం కాదని ఏఈ రవికుమార్ తెలిపారు. అందుకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. సీతానగరం మండలంలో వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, అరటి, కూరగాయలు సాగు చేస్తూంటారు. గోదావరి చెంతనే ఉన్న ఈ మండలానికి భూగర్భ జలాలతో పాటు తొర్రిగెడ్డ, కాటవరం ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు అందుతుంది. మండలంలో మొత్తం 1,236 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఉచిత విద్యుత్ పథకం అమలులోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో బోర్ల సంఖ్య పెరగడంతో ఆ మేరకు సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. జగన్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా పురుషోత్తపట్నం, ముగ్గళ్ల సబ్స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ మోటార్లకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 820 వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే విద్యుత్ సరఫరా అవుతోంది. మిర్తిపాడు సబ్‌స్టేషన్ పరిధిలో సాంకేతిక అవరోధాలు ఉండడంతో ప్రస్తుతం ఈ విధానం అమలుకు నోచుకోవడం లేదు. అడ్డంకులను అధిగమించే ప్రయత్నంలో ఉన్నామని ఏఈ త్రిమూర్తులు తెలిపారు. పాతాళగంగే ప్రధానాధారం పూర్తి మెట్ట ప్రాంతంగా ఉన్న రాజానగరం మండలంలో సాగుకు భూగర్భ జలాలే ఆధారం. ప్రతి సీజన్లోనూ బోర్లున్న రైతులు జిల్లాలో అందరికంటే ముందుగా వరి సాగుకు శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో కోతలు కూడా ముందుగానే చేపడుతూంటారు. మండలంలో సుమారు 4,700 వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా 86,950 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మండలంలోని రాజానగరం, సంపత్‌నగరం గ్రామాల్లో ఉన్న సబ్స్టేషన్ల ద్వారా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. సంపత్‌నగరం ఏఈ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపత్‌నగరం సబ్‌స్టేషన్ పరిధిలోని దివాన్‌చెరువు సబ్‌స్టేషన్ ద్వారా 13 మోటార్లకు ఈ నెల 17 నుంచి పగటి పూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే కొండగుంటూరు సబ్‌స్టేషన్ ద్వారా కొండగుంటూరు, నామవరం, కడియం మండలం జేగురుపాడు ఆవల్లో 94 మోటార్లకు విద్యుత్ అందిస్తున్నామన్నారు. సంపత్‌నగరం సబ్‌స్టేషన్ ద్వారా నామవరం, జి.యర్రంపాలెం, పాతతుంగపాడు, కొండగుంటూరుపాకలులోని 480 మోటార్లకు 9 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వివిధ ఫీడర్ల ద్వారా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాజానగరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఇది అమలు జరగడం లేదని ఏఈ సుబ్రహ్మణ్యం చెప్పారు. తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనందున ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నామన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
రబీ కి తొమ్మిది గంటల విద్యుత్
టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ఆదేశం -కొత్తపల్లి కొత్తపల్లి : రబీలో వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. కరీంనగర్సర్కిల్ పరిధిలోని పాత జిల్లా విద్యుత్ అధికారులతో బుధవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్పంప్సెట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు డిసెంబర్ 31లోగా కనెక్షన్లు అందించాలని ఆదేశిం చారు. తరచూ ట్రాన్సఫార్మర్లు ఎందుకు పాడవుతున్నాయో తె లుసుకోవాలన్నారు. కొత్త సబ్స్టేషన్లను నిర్మించి ఓవర్‌లోడ్‌ను తగ్గించాలన్నారు. ట్రాన్సఫార్మర్లు పాడరుున వెంటనే మార్చేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వినియోగదారుడికి కొత్త మీటర్లు అందుబాటులోకి తేవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్‌ను మూసివేయాలని, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సీఎండీగా తొలిసారిగా కరీం నగర్‌కు వచ్చిన సందర్భంగా ఎస్ఈ కె.మాధవరావుతోపాటు ఐదు జిల్లాల అధికారులు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. -
మాటంటే మాటే..
♦ తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు శ్రీకారం ♦ సాగుకు 9గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం ♦ పగలు 6, రాత్రి 3 గంటలు రైతులకు ఊరట ♦ వచ్చే ఖరీఫ్ నుంచి 9గంటలు పగటి పూటే ♦ శుక్రవారం నుంచే అమల్లోకి.. గజ్వేల్/జోగిపేట: ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పినట్టుగానే శుక్రవారం నుంచే జిల్లాలో అమలులోకి తెచ్చింది. అయితే పట్టపగలే నిరంతరాయంగా ఇస్తామన్న హామీ మాత్రం నెరవేరలేదు. ఇది వచ్చే ఖరీఫ్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం పగలు ఆరు గంటలు, రాత్రి మూడు గంటల చొప్పున మొత్తం 9 గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2.40 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా వీటి కోసం 6 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను వాడుకుంటున్నారు. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం మరో 9మిలియ న్ యూనిట్ల విద్యుత్ వినియోగంలో ఉంది. ప్ర స్తుతం వ్యవసాయానికి 9గంటల విద్యుత్ సరఫరా పెంచడంతో మరో 3మిలియన్ యూనిట్ల డిమాండ్ పెరిగింది. వ్యవసాయానికి మొత్తం 9 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాబోతుంది. ప్రస్తుతం 6గంటల విద్యుత్ సరఫరా జరుగుతుండగా అసలే కరువులో ఉన్న రైతులకు సరఫరా సరిపోక అల్లాడిపోతున్నారు. తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం కలిగే అవకాశముంది. ఈ విషయమై ట్రాన్సకో ఎస్ఈ సదాశివరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ 9గంటల సరఫరాను ఎలాంటి అంతరాయాలు లేకుండా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం వేళల్లో ఆరుగంటలు, రాత్రి వేళల్లో 3గంటలపాటు సరఫరా చేస్తామన్నారు. దీన్ని ఏ, బీ గ్రూపులుగా విభజించినట్టు తెలిపారు. రైతులు బోరుబావుల వద్ద ఆటోమెటిక్ స్టార్టర్లను వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆటోమెటిక్ స్టార్టర్ల వల్ల విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరా వేళలు.. ♦ రెండు గ్రూపులుగా విభజించి విద్యుత్‌సరఫరా చేస్తున్నారు. ♦ ఏ-గ్రూపులో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, రాత్రి 7నుంచి రాత్రి 10 వరకు. ♦ బి-గ్రూపులో ఉ.11 నుంచి సా.5వరకు, తెల్లవారుజాము 2 నుంచి ఉ.5 వరకు సరఫరా. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను అందిస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఆ మేరకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇలాంటి హామీలను గతంలో ఎవరు కూడా నిలబెట్టుకోలేదు. రైతులమీద ఉన్న ప్రేమతోనే విద్యుత్ సరఫరా విషయంలో సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రెప్పపాటు కరెంటు పోకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తొమ్మిదిగంటల విద్యుత్ సరఫరాతో కొంతవరకు ఊరట లభిస్తుంది. అధికారులు కూడా విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చూపరాదు. - డాక్టర్ పి.బాబూమోహన్, అందోలు ఎమ్మెల్యే