♦ తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు శ్రీకారం
♦ సాగుకు 9గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం
♦ పగలు 6, రాత్రి 3 గంటలు రైతులకు ఊరట
♦ వచ్చే ఖరీఫ్ నుంచి 9గంటలు పగటి పూటే
♦ శుక్రవారం నుంచే అమల్లోకి..
గజ్వేల్/జోగిపేట: ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పినట్టుగానే శుక్రవారం నుంచే జిల్లాలో అమలులోకి తెచ్చింది. అయితే పట్టపగలే నిరంతరాయంగా ఇస్తామన్న హామీ మాత్రం నెరవేరలేదు. ఇది వచ్చే ఖరీఫ్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం పగలు ఆరు గంటలు, రాత్రి మూడు గంటల చొప్పున మొత్తం 9 గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 2.40 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా వీటి కోసం 6 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను వాడుకుంటున్నారు. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం మరో 9మిలియ న్ యూనిట్ల విద్యుత్ వినియోగంలో ఉంది. ప్ర స్తుతం వ్యవసాయానికి 9గంటల విద్యుత్ సరఫరా పెంచడంతో మరో 3మిలియన్ యూనిట్ల డిమాండ్ పెరిగింది. వ్యవసాయానికి మొత్తం 9 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాబోతుంది. ప్రస్తుతం 6గంటల విద్యుత్ సరఫరా జరుగుతుండగా అసలే కరువులో ఉన్న రైతులకు సరఫరా సరిపోక అల్లాడిపోతున్నారు. తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం కలిగే అవకాశముంది. ఈ విషయమై ట్రాన్‌సకో ఎస్‌ఈ సదాశివరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ 9గంటల సరఫరాను ఎలాంటి అంతరాయాలు లేకుండా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం వేళల్లో ఆరుగంటలు, రాత్రి వేళల్లో 3గంటలపాటు సరఫరా చేస్తామన్నారు. దీన్ని ఏ, బీ గ్రూపులుగా విభజించినట్టు తెలిపారు. రైతులు బోరుబావుల వద్ద ఆటోమెటిక్ స్టార్టర్లను వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆటోమెటిక్ స్టార్టర్ల వల్ల విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.
జిల్లాలో విద్యుత్ సరఫరా వేళలు..
♦ రెండు గ్రూపులుగా విభజించి విద్యుత్సరఫరా చేస్తున్నారు.
♦ ఏ-గ్రూపులో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, రాత్రి 7నుంచి రాత్రి 10 వరకు.
♦ బి-గ్రూపులో ఉ.11 నుంచి సా.5వరకు, తెల్లవారుజాము 2 నుంచి ఉ.5 వరకు సరఫరా.
ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను అందిస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఆ మేరకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇలాంటి హామీలను గతంలో ఎవరు కూడా నిలబెట్టుకోలేదు. రైతులమీద ఉన్న ప్రేమతోనే విద్యుత్ సరఫరా విషయంలో సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రెప్పపాటు కరెంటు పోకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తొమ్మిదిగంటల విద్యుత్ సరఫరాతో కొంతవరకు ఊరట లభిస్తుంది. అధికారులు కూడా విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చూపరాదు. - డాక్టర్ పి.బాబూమోహన్, అందోలు ఎమ్మెల్యే