‘ఉపాధి’ వెతలు | employment problems | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ వెతలు

Published Sun, Mar 19 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

‘ఉపాధి’ వెతలు

‘ఉపాధి’ వెతలు

 - గిట్టుబాటు కాని ‘ఉపాధి’ కూలి
- పెండింగ్‌లో రూ.10 కోట్ల వేతనాలు
- ఇతర ప్రాంతాలకు కూలీల వలస
- పూర్తికాని ఫారంపాండ్స్‌ లక్ష్యం
 
జాబ్‌ కార్డులు ఉన్నవారు: సుమారు 8 లక్షల మంది
ఉపాధి పనులకు వెళ్తున్న వారు: 1,05,000 మంది
 
 
కర్నూలు(అర్బన్‌): ఉపాధి హామీ పథకం..లక్ష్యం నెరవేరడం లేదు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం..కూలి తక్కువగా ఉండడంతో ఉపాధి పనులపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కూలి ఎక్కువగా ఇస్తుండడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. జిల్లాలోని 36 కరువు మండలాలు ఉండగా.. ఇక్కడ కూలీలకు 150 రోజులు ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. అయితే ఈ మండలాల్లో చేసిన పనులకు వేతనాలు చెల్లించడం లేదు. 
 
ఎండలు అప్పుడే మండి పోతున్నాయి .. గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. మండుతున్న ఎండల్లో కూలీలు పనులు చేయలేక పోతున్నారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాల్లో షెడ్లు, మంచినీటి సరఫరా కూడా అంతంత మాత్రంగా ఉంటోంది. పైగా అధికారులు ఫారంపాండ్స్‌పైనే ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది అక్టోబర్‌ నెల నుంచి వర్షాలు పడకపోవడంతో భూమి గట్టిపడి తవ్వడం చాలా కష్టంగా మారింది.
 
దీంతో కూలీలు కొంత సులభంగా ఉండే వంకలు, వాగులు, చెరువుల్లో పూడికతీత పనులకు వెళ్లేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫారంపాండ్స్‌ తవ్వేందుకు వీరు ముందుకు రావడం లేదు. జిల్లా సరిహద్దుల్లోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఇంకా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల ప్రజలు అక్కడికి వెళ్లి పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య లక్షకు మించడం లేదు. 
 
పెండింగ్‌లో రూ.10 కోట్ల ఉపాధి బకాయిలు ...
ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదు. ఈ బకాయిలు దాదాపు రూ.10 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ అవుతున్న కారణంగా కూడా పలు సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనేక మంది కూలీలకు బ్యాంకు ఖాతాలు లేక పోవడం, ఒకవేళ ఖాతాలు ఉన్నా, వారి ఆధార్‌కార్డును అనుసంధానం చేయకపోవడం, ఎన్‌సీపీఐ డాటాలో సింక్‌ కాకపోవడం వల్ల దాదాపు రూ.3 కోట్లు వివిధ బ్యాంకుల్లోని సస్పెన్షన్‌ ఖాతాల్లోనే మూలుగుతున్నట్లు తెలుస్తోంది. వారమంతా పనిచేసినా, వేతనాలు అందకపోవడం వల్ల రోజువారీ కూలి ఇచ్చే పనులకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు గ్రామాలకు చెందిన వారు ఉదయమే ట్రాక్టర్ల ద్వారా మన కూలీలను తీసుకువెళ్తున్నారు. 
 
11 రోజుల్లో 9,992 ఫారంపాండ్స్‌ పూర్తి సాధ్యమేనా ...
జిల్లాకు మొత్తం 80,329 ఫారంపాండ్స్‌ మంజూరు కాగా, 36,169 పనులు ప్రారంభించారు. ఇందులో 26,177 ఫారంపాండ్స్‌ పూర్తి అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 9,992 పనులను పూర్తి చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరుకు వీటిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇంకా 11 రోజుల గడువులో వీటిని ఎలా పూర్తి చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కూలి గిట్టుబాటు కాకపోవడం వల్ల కూడా ఈ పనుల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని 150 నుంచి 200 గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేరు. ఆయా ప్రాంతాల్లోని సీనియర్‌ మేటీలే మూడు, నాలుగు గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ కారణంగా పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. పైపెచ్చు సీనియర్‌ మేటీలను కూడా ఆయా గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉంది. ఇందులో కూడా రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గుతోంది. 
 
రోజుకు రూ.200 ఇస్తున్నారు: మద్దయ్య, జి. శింగవరం
ఏటవతల కొరివిపాడు, క్యాంపు తదితర గ్రామాల్లో మిరప తెంపేందుకు పోతే రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఉదయం 7 గంటలకు ట్రాక్టర్‌ మీద తీసుకుపోయి సాయంత్రం 3 గంటలకు తిరిగి ఊర్లో వదలి వెళ్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున నీడ పాటున చేసే పనులకు పోతున్నాం. కుటుంబంలో ఐదుగురు పనికి పోతే రోజుకు రూ.1000 వస్తోంది. నదీ తీర గ్రామాల్లోని కూలీలందరూ మిరప తెంపేందుకే పోతున్నారు. 
 
వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి:  డాక్టర్‌ సీహెచ్‌ పుల్లారెడ్డి, డ్వామా పీడీ
కూలీలకు వేతనాలు దాదాపు ఎనిమిది వారాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తే సాయంత్రానికే కూలీలు ఇస్తున్న కారణంగా ఆయా ప్రాంతాలకు పనికి వెళ్తున్నారు. అందులో మిరప తెంపేందుకు కుటుంబంలో ఎంత మంది ఉంటే చిన్న, పెద్ద తేడాలేకుండా అంతమంది పనికి వెళ్లే అవకాశం ఉంది. ఉపాధిలో జాబ్‌కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే అవకాశం. ఆయా ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు మాత్రమే పనులు ఉంటాయి. ఏప్రిల్‌ నుంచి ఉపాధి కూలీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement