ఐటీ కంపెనీల మౌనానికి అర్థమేమిటి..?
బెంగళూరు : ఐటీ ఉద్యోగులు యూనియన్లగా ఏర్పాటు కాబోతున్నారా..? తమ సమస్యలపై పోరడటానికి సిద్ధమవుతున్నారా...? అంటే దాదాపు డజను ఐటీ కంపెనీలు దీనిపై మౌనం వహిస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ఫ్లిప్ కార్ట్ వంటి అతిపెద్ద ఐటీ సంస్థలు వారి ఉద్యోగులు యూనియన్లగా ఏర్పడటంపై నిర్థారించడానికి తిరస్కరిస్తున్నాయి.
ఐటీ ఉద్యోగులు లేబర్ యూనియన్లగా ఏర్పడి, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 కింద తమ సమస్యలను పరిష్కరించుకునే హక్కులపై ఐటీ కంపెనీలు మౌనం వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏ కంపెనీకి కూడా పారిశ్రామిక వివాదాల చట్టం 1947 నుంచి తప్పించుకునే వీలులేదని, ఇతర పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలకు ఇదే వర్తిస్తుందని తమిళనాడు లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కుమార్ జయంత్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా యూనియన్లగా ఏర్పడే అవకాశముందన్నారు.
అయితే ఐటీ కంపెనీల వ్యవహరిస్తున్న ఈ తీరు వివిధ ఊహాగానాలకు దారితీస్తోంది. ఆశ్చర్యకరంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ కు దూరంగా ఉండాలని రాతపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. ఇటీవలే చాలా ఐటీ కంపెనీలు, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఐఐఎమ్, ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, జాయినింగ్ తేదీలు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి సమస్యలపై పోరడటానికి ఐటీ ఉద్యోగులకు ఆసక్తి ఉన్నా.. కంపెనీలు వారిని ఎక్కడ బ్లాక్ లిస్ట్ లో పెడతారో అని జంకుతున్నట్టు తెలుస్తోంది. 60 నుంచి 80 శాతం మందికి యూనియన్లగా ఏర్పడటానికి ఆసక్తి ఉందని, అయితే తర్వాత జరగబోయే పరిణామాలకు బయపడి ఎవరూ ముందుకు రావటం లేదని హైదరాబాద్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ చెప్పారు.