తెలంగాణకు రండి
గాంధీనగర్‌లో తెలంగాణ స్టేట్ ఇన్వెస్టర్స్ మీట్లో మంత్రి జూపల్లి
గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల పారిశ్రామికవేత్తలతో భేటీ
హైదరాబాద్: తెలంగాణ లో భారీ పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా గుజరాత్ వెళ్లిన పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మౌలి క వసతులపై భరోసా ఇచ్చారు. నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించారు. తన పర్యటనను సద్విని యోగం చేసుకునేందుకు ప్రయత్నిం చారు. గాంధీనగర్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘7వ వైబ్రెంట్ గుజరాత్ సమ్మేళనం’లో పాల్గొన్నారు. మంగళవా రం సాయంత్రం పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, వివిధ పారిశ్రామికవాడల సందర్శనతో బిజీగా గడిపారు. గాంధీనగర్‌లో ‘తెలంగాణ స్టేట్ ఇన్వెస్టర్స్ మీట్’ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 85 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. నూతన పారిశ్రామిక విధానం టీఎస్- ఐపాస్ పెట్టుబడిదారులకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు కు అనువుగా 2.5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, పరిశ్రమల కోసం సాగునీటి ప్రాజెక్టులో 10 శాతం నీటిని కేటాయించామని, రాబోయే మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని పేర్కొన్నారు.
ఈ మీట్‌కు గెజియా గ్రూప్ ప్రెసిడెంట్ హెచ్.ఎం.పటేల్, కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఎండీ సింగ్, గుజరాత్ ప్లాస్టిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాజుభాయి, జీఎస్పీఎల్ లిమిటెడ్ తరఫున బోసు బాబు, అదానిగ్రూప్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర, గుజరాత్ ఎమ్మె ల్యే, పారిశ్రామిక వేత్త బాల్వార్కర్ తదితరులు హాజరైనట్టు అధికారవర్గాలు తెలిపాయి.
బడా కంపెనీల ప్రతినిధులతో భేటీ
మంత్రి జూపల్లితో మంగళవారం ఆ రాష్ట్రానికి చెందిన విశాఖ పాలీఫ్యాబ్ ఎండీ జైదీష్ దోషి, మయూర్ పాలీమర్స్ ఎండీ శామ్టిబ్రివాలా, విశాఖ ఇరిగేషన్ ప్రతి నిధి అంకిత్ జోషి, అదాని గ్రూప్ ఉపాధ్యక్షుడు, సీఈవోలు భేటీ అయ్యారు.