రాజధాని ఇవ్వకపోతే మళ్లీ విభజన
రాయలసీమ రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి
గుంతకల్లు టౌన్ : రాయలసీమ జిల్లాల్లో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయకపోతే రాయలసీమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని రాయలసీమ రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం జిల్లా గుంతకల్లులోని పరిటాల కళ్యాణ మండపంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజ ధాని రాయలసీమ ప్రజల హక్కు’ సాధన కోసం న్యూడమోక్రసీ జిల్లా కమిటీ సభ్యు డు సురేష్ అధ్యక్షతన భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీమ ప్రాంతానికి చెందిన మంత్రులు రాయలసీమలో రాజ ధాని ఏర్పాటు కోసం నోరు విప్పే పరిస్థితి లేదని, పొరపాటున ఎవరైనా మాట్లాడితే తమ పదవులను బాబు బర్తరఫ్ చేస్తారన్న భయంతో వారంతా వణికిపోతున్నారని ఆరోపించారు. శివరామకష్ణన్ కమిటీ నివేదిక రాయలసీమకు అనుకూలంగా రానున్న నేపథ్యంలో రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందిన మంత్రులతోనే ప్రతిపాదనలను పెట్టించి నాటకాలాడుతున్నారని విమర్శించారు.
అన్ని రంగాల్లో అభివ ద్ధి చెందిన విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనే తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలోని కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు, మేధావులు, ప్రజా సంఘాల అభిప్రాయం మేరకు రాయలసీమ ప్రాంత అభివ ద్ధిలో భాగంగా నీళ్లు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.
సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి 350 టిఎంసిల నికర జలాలను మళ్లించాలని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ‘సీమ’ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శులు గాదె దివాకర్, శ్యామలారెడ్డి, జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, న్యాయవాది నాగరాజులు మాట్లాడుతూ రాయలసీమ రాజధాని సాధన కోసం ప్రజలంతా ఉద్యమించని పక్షంలో రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందన్నారు.