ఇన్ఫోసిస్ చైర్మన్ తప్పుకోవాల్సిందే!
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో నెలకొన్న పరిణామాలు మరింత ముదురుతున్నాయి. కార్పొరేట్ గవర్నెన్స్ దారుణంగా పడిపోవడానికి బాధ్యత వహిస్తూ ఇన్ఫోసిస్ చైర్మన్ తప్పనిసరిగా రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. తాత్కాలిక చైర్మన్ తాజా పరిమాణాలపై షేర్హోల్డర్స్తో భేటీ అవ్వాలని, ప్రస్తుత చైర్మన్ ఆర్. శేషాసాయి తన పదవి నుంచి తప్పుకోవాలని కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) బాలక్రిష్ణన్ డిమాండ్ చేశారు. '' గతంలో కంపెనీలో జరిగిన అన్ని లోపాలకు బాధ్యత వహిస్తూ శేషాసాయి చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలి. బోర్డు తాత్కాలిక చైర్మన్‌ను ఎన్నుకోవాలి. ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇదే సరియైన పని'' అని వీ. బాలక్రిష్ణన్ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
బోర్డు సభ్యులు, చైర్మన్ తప్పనిసరిగా వీటికి బాధ్యత వహించాల్సిందేనన్నారు. ఇది ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, వ్యవస్థాపకులకు సంబంధించిన అంశం కాదని, ఇవి బోర్డుకు సంబంధించిందని స్పష్టీకరించారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పడికప్పుడూ వ్యవస్థాపకులు బోర్డును హెచ్చరిస్తూనే ఉన్నారని, అయితే వారే ఎలాంటి చర్యలు చేపట్టలేదని వెల్లడించారు. అయితే ఈ విషయంలో విశాల్ సిక్కాను కూడా తప్పుబట్టారు. ఆయన కూడా ఓ బోర్డు సభ్యుడేనని పేర్కొన్నారు. అందరూ కలిసే దీనికి బాధ్యత వహించాలన్నారు.
గత ఏడాదికాలంగా విలువలు, పారదర్శకత, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)పై ఇన్ఫోసిస్‌లో ఆందోళనలు చెలరేగినప్పటికి ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఇవి మరింతై వెలుగులో వచ్చాయి. సిక్కా వేతనం పెంపు, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ వీడ్కోలు ప్యాకేజీలను ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంపెనీ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు గుప్పుమనడంతో ఇన్ఫోసిస్‌లో తలెత్తిన వివాదాలు తెరపైకి వచ్చాయి. కానీ ఇవి సిక్కా వేతనానికి సంబంధించినవి కావని, కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించిందని కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి స్పష్టంచేశారు.