సంఘటితంగా ఉంటేనే రాజ్యాధికారం
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్
అనంతపురం న్యూటౌన్ : రాష్ట్రంలో దాదాపు కోటి మందున్న మాలలు సంఘటితంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. మాల మహాసభ జిల్లా అధ్యక్షులు పోతురాజుల చిన వవెంకటేశ్వర్లు నేతృత్వంలో సోమవారం అనంతపురం రూరల్ మండలం పరిధిలోని రుద్రంపేట కాలనీలోని అంబేద్కర్ భవన్లో ‘దళిత చైతన్య సదస్సు’ జరిగింది. చింతా మోహన్‌తో పాటు మాల మహా సభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గిత్తోళ్ల నాగరాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ దళితుల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ ప్రభుత్వ విధానాలను వక్తలు తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా మాలలకు వ్యతిరేకంగా ఉన్న జీవోఎంఎస్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు దళితుల మధ్యే చిచ్చు రేపుతూ ఘర్షణలకు తావిస్తున్నారని విమర్శించారు. ఇటీవల బీసీ నాయకులు ఆర్.క్రిష్ణయ్య ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అంతకు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి విచ్చేసిన మాల మహాసభ నాయకులు, కార్యకర్తలు చింతామోహన్, మల్లెల వెంకట్రావుకు ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఓబిలేసు, మాజీ డీఎస్పీ తలమర్ల శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.