former Miss World
-
టెక్నాలజీతో తల్లి అయిన మాజీ మిస్ వరల్డ్
ముంబై: మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్(42) శనివారం ఓ పాపకు జన్మనిచ్చింది. వైద్యశాస్త్రంలో నూతన పద్దతి అయిన ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో డయానా ఆ పాపకు జన్మనివ్వడం విశేషం. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో దాచిన తన అండాలతో డయానా తల్లి కావడం ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్‌పై ఆసక్తి రేకెత్తిస్తోంది. పలువురు సెలబ్రెటీ మహిళలను డయానా ముందుచూపు ఆలోచింపజేస్తుంది. సాధారణంగా కెరీరా, కుటుంబమా అనే ప్రశ్న సెలబ్రిటీలకే కాకుండా చాలా మంది మహిళలకు ఎదురౌతుంది. రెండూ ప్రాముఖ్యత గల అంశాలే. ఎటూ తేల్చుకోలేని సందిగ్థం. ఈ పరిస్థితే డయానాకు ఎదురైంది. అసలే అందాల పోటీ ప్రపంచం. మధ్యలో పిల్లలు, పెళ్లి అంటూ విరామం ఇస్తే తరువాత భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకొన్న డయానా ముందు జాగ్రత్తగా కొన్ని అండాలను ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు సహాయంతో ఎనిమిదేళ్ల క్రితం నిలువ ఉంచింది. రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన కోలిన్ డిక్‌ను ప్రేమించి పెళ్లాడిన డయానా ఇప్పుడు ఎండో మెట్రియోసిస్ అనే వ్యాధితో బాధ పడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆరోగ్యవంతమైన అండాలను విడుదల చేయలేని స్థితిలో ఉన్న డయానా తాను ముందు జాగ్రత్తగా దాచిన అండాల సహాయంతో టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు తల్లయింది. దీనిపై డయానా మాట్లాడుతూ.. ' నేను మొదటి సారిగా 2005లో ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకొన్నాను. అప్పుడు నా కెరీర్ మంచి స్థితిలో ఉంది. అదీకాక నేను ప్రేమలో పడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడు మహిళలు తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు' అని తెలిపింది. ఇండియాలో సరాసరి నవజాత శిశువు బరువు 2.6 కేజీలు, పొడవు 48 సెంటీమీటర్లు కాగా ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన ఆర్యా హెడెన్ 3.7 కిలోల బరువు, 55 సెంటీమీటర్ల పొడవు ఉండటం విశేషం. -
పుట్టినింటి తెరపై... సుస్మితా సేన్
మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ఎట్టకేలకు ఇప్పుడు సొంత భాష, సొంత రాష్ట్రం వైపు దృష్టి పెట్టారు. అదేమిటంటారా? అవునండీ! ఇప్పటి దాకా ఇతర భాషా చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన ఆమె ఇన్నాళ్ళకు తొలిసారిగా తన మాతృభాష అయిన బెంగాలీలో వెండితెర మీద మెరవనున్నారు. ఈ వారంలో సెట్స్ మీదకు వెళుతున్న బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’తో పుట్టింటికి వచ్చినట్లుగా ఉందని సుస్మితా సేన్ వ్యాఖ్యానించారు. ‘‘నా తొలి చిత్రం షూటింగ్ నిమిత్తం కోల్‌కతాకు వెళుతున్నాను. నాకెంతో ఉద్వేగంగా ఉంది. నా మూలాలు వెతుక్కుంటూ వెళుతున్నట్లుగా అనిపిస్తోంది’’ అని 38 ఏళ్ళ ఈ మాజీ మిస్ యూనివర్స్ మెరుస్తున్న కళ్ళతో చెప్పారు. గతంలో బెంగాలీ సినీ అవకాశాలు వచ్చినప్పటికీ, భయపడి ఆగిపోయిన ఆమె ఇప్పుడు దాన్ని అధిగమించి, ఈ సినిమా ఒప్పుకున్నారు. ‘‘తెలుగు, తమిళం, ఇంకా ఇతర భాషల్లో నటించిన నేను బెంగాలీ అనగానే భయపడేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ భయం వదిలించుకున్నాను. ఈ చిత్రంలో కొందరు అద్భుతమైన నటీనటులతో కలసి నటించనున్నాను’’ అని ఆమె చెప్పారు. జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, ఐశ్వర్యారాయ్‌తో కలసి నటించనున్నట్లు చాలా కాలంగా వినిపిస్తున్న వార్తల గురించి కూడా సుస్మితా సేన్ వివరణ ఇచ్చారు. ‘‘ఓ స్క్రిప్టు గురించి మేమిద్దరం ఆలోచిస్తున్న మాట నిజం. అది ఎప్పుడు కార్యరూపం ధరిస్తుందన్నది మాత్రం నిర్మాత గౌరాంగ్ దోషీయే చెప్పాలి’’ అని ఈ అందాల నటి తెలిపారు. -
ఈసారైనా కలిసొచ్చేనా
మాజీ ప్రపంచసుందరి పార్వతి ఓమన కుట్టాన్ మరోసారి కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోంది. ఈ బ్యూటీ అజిత్ సరసన బిల్లా-2 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్రంపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. బిల్లా-2 చిత్రం పార్వతి ఓమన కుట్టాన్ ఆశల్ని అడియాశలు చేసింది. ఆ చిత్ర పరాజయంతో ఆమెకు మరో అవకాశం దరిచేరలేదు. తాజాగా నంబియార్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తోంది. శ్రీకాంత్ హీరోగా నటిస్తూ సొంతంగా తన గోల్డెన్ ప్రైడే పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి సునైనా హీరోయిన్గా నటిస్తోంది. సంతానం హాస్యభూమికను పోషిస్తున్నారు. గణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పార్వతి ఓమన కుట్టాన్ పాత్ర గురించి దర్శకుడు తెలుపుతూ కాలేజ్గర్ల్గా మంచి యూత్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. పార్వతి ఓమన కుట్టాన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఈ మలయాళ బ్యూటీ బాలీవుడ్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తమిళంలో అనూహ్య విజయాన్ని సాధించిన పిజ్జా చిత్రం హిందీ రీమేక్‌లో పార్వ తి ఓమన కుట్టాన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నటించడం టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అంది. చిత్రం విడుదల కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు పార్వతి ఓమన కుట్టాన్ పేర్కొంది. -
ఇక నటనపైనే దృష్టి..!
లారాదత్తా ముంబై: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి లారాదత్తా మళ్లీ నటనపై దృష్టిసారించనుంది. 2010లో టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతితో వివాహమైన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2012లో ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత దాదాపుగా నటనకు ఫుల్స్టాప్ పెట్టింది. అయితే బాలీవుడ్‌తో అనుబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా నిర్మాతగా కొనసాగింది. అయితే ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకొని, కెమెరా ముందుకు రావాలని తాపత్రయపడుతోంది. అందుకోసం జోరుగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై లారా మాట్లాడుతూ... ‘పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు కాస్త దూరమయ్యాను. పాప జన్మించిన తర్వాత నటనకు దాదాపుగా దూరమయ్యాను. నిర్మాతగా కొనసాగినా నటనకు దూరమవడంతో ఏదో కోల్పోయినట్లు అనిపించింది. అందుకే మళ్లీ నటించాలనుకుంటున్నా. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కుటుంబసభ్యుల నుంచి కూడా నటించే విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకే ఈ ఏడాదే కెమెరా ముందుకు వెళ్లబోతున్నా. అయితే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. ఏ సినిమా చేస్తున్నాను? కథాంశమేమిటీ? నటీనటులు ఎవరు? అనే వివరాలను కూడా ప్రస్తుతానికి చెప్పలేను. ‘చలో ఢిల్లీ’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారని చాలామంది మట్లాడుకుంటున్నారు. అయితే ఆ సినిమా ఇంకా నిర్మాణ దశకు చే రుకోలేదు. ఆ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందా? అనే విషయమై నేను కూడా ఆసక్తిగానే ఉన్నాను. శశాంత్ షా దర్శకత్వంలో తెరకెక్కిన ‘చలో దిల్లీ’ సినిమాలో వినయ్పాఠక్తో కలిసి తెరను పంచుకున్నాను. అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించారు. సీక్వెల్లో కూడా వీరే ఉంటారనే విషయాన్ని చెప్పలేం. అయితే సినిమాకు ‘చలో చైనా’ అనే పేరును పెట్టాలని భావిస్తున్నాం. అయితే ఈ సినిమా ఈ ఏడాది తెరకెక్కే అవకాశాలు లేవు. మా సొంత బ్యానర్ భీగీ బసంతీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించే అవకాశముంద’ని చెప్పింది.