ఇక నటనపైనే దృష్టి..! | Lara Dutta: I am Focusing on Doing Films now | Sakshi
Sakshi News home page

ఇక నటనపైనే దృష్టి..!

Published Thu, May 29 2014 10:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఇక నటనపైనే దృష్టి..! - Sakshi

ఇక నటనపైనే దృష్టి..!

లారాదత్తా
ముంబై: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి లారాదత్తా మళ్లీ నటనపై దృష్టిసారించనుంది. 2010లో టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతితో వివాహమైన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2012లో ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత దాదాపుగా నటనకు ఫుల్‌స్టాప్ పెట్టింది. అయితే బాలీవుడ్‌తో అనుబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా నిర్మాతగా కొనసాగింది. అయితే ఇప్పుడు మళ్లీ  మేకప్ వేసుకొని, కెమెరా ముందుకు రావాలని తాపత్రయపడుతోంది. అందుకోసం జోరుగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై లారా మాట్లాడుతూ... ‘పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు కాస్త దూరమయ్యాను.

 పాప జన్మించిన తర్వాత నటనకు దాదాపుగా దూరమయ్యాను. నిర్మాతగా కొనసాగినా నటనకు దూరమవడంతో ఏదో కోల్పోయినట్లు అనిపించింది. అందుకే మళ్లీ నటించాలనుకుంటున్నా. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కుటుంబసభ్యుల నుంచి కూడా నటించే విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకే ఈ ఏడాదే కెమెరా ముందుకు వెళ్లబోతున్నా. అయితే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. ఏ సినిమా చేస్తున్నాను? కథాంశమేమిటీ? నటీనటులు ఎవరు? అనే వివరాలను కూడా ప్రస్తుతానికి చెప్పలేను.

 ‘చలో ఢిల్లీ’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారని చాలామంది మట్లాడుకుంటున్నారు. అయితే ఆ సినిమా ఇంకా నిర్మాణ దశకు చే రుకోలేదు. ఆ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందా? అనే విషయమై నేను కూడా ఆసక్తిగానే ఉన్నాను. శశాంత్ షా దర్శకత్వంలో తెరకెక్కిన ‘చలో దిల్లీ’ సినిమాలో  వినయ్‌పాఠక్‌తో కలిసి తెరను పంచుకున్నాను. అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించారు. సీక్వెల్‌లో కూడా వీరే ఉంటారనే విషయాన్ని చెప్పలేం. అయితే సినిమాకు ‘చలో చైనా’ అనే పేరును పెట్టాలని భావిస్తున్నాం. అయితే ఈ సినిమా ఈ ఏడాది తెరకెక్కే అవకాశాలు లేవు. మా సొంత బ్యానర్ భీగీ బసంతీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించే అవకాశముంద’ని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement