మనం చెప్పాలి వాళ్లు తీయాలి
మన సినిమాలు ఎందులోనూ తక్కువ కాదు. ఇతర భాషా చిత్రాలకు పోటీ ఇవ్వగల సత్తా మన సినిమాలకు ఉందనే అభిప్రాయం మన చిత్రాల పట్ల మనకున్న నమ్మకాన్నీ, ప్రేమనూ తెలియజేస్తాయి. ఇటీవల రామ్‌చరణ్ తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడిన మాటలు అలాంటివే. ఒకవైపు మన పరిశ్రమ గొప్పతనం చెబుతూనే ఇతర పరిశ్రమ నుంచి మనం నేర్చుకోవాల్సి విషయాల గురించి కూడా చరుణ్ ప్రస్తావించారు.
హిందీవాళ్లు మనల్ని చూసి చాలా నేర్చుకోవాలి అని రామ్‌చరణ్ చెబుతూ - ‘‘దక్షిణాది సినిమాల్లో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. ఫైట్స్, యాక్షన్ గురించి నేను చెప్పడంలేదు. మన సినిమాల్లో ఉండే డ్రామా గురించి మాట్లాడుతున్నా. అది చాలా బలంగా ఉంటుంది. అది చెప్పే విధానం కూడా బాగుంటుంది. బాలీవుడ్‌లో నిర్మాణ విలువలు బాగుంటాయి. మనం అది నేర్చుకోవాలి. మన సినిమాల్లో ఉండే డ్రామాని చూసి వాళ్లు నేర్చుకోవాలి’’ అన్నారు. సో.. మనం చెప్పే విధానాన్ని బాలీవుడ్ వాళ్లు ఫాలో కావాలనీ, వాళ్లు తీసే విధానాన్ని మనం పాటించాలి అని చరణ్ చెబుతున్నారన్న మాట.
ఇంకా చరణ్ మాట్లాడుతూ - ‘‘హిందీలో ఏడాదికి బోల్డన్ని మల్టీప్లెక్స్ చిత్రాలు విడుదలవుతూ ఉంటాయి. వాటికంటూ ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటారు. దక్షిణాదికి వచ్చేసరికి పరిస్థితులు అలా ఉండవు. ఇక్కడ మల్టీప్లెక్స్ చిత్రాలు చూసేవాళ్ల సంఖ్య తక్కువే. కానీ, చిన్నా పెద్దా ఏ సినిమా అయినా ఇక్కడివాళ్లు చూసేస్తారు’’ అని చరణ్ అన్నారు.