మంగళవారం ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయం వద్ద రియా
న్యూఢిల్లీ/ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతికేసులో మాదకద్రవ్యాల సంబంధిత నేరారోపణలు ఎదుర్కొంటోన్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని మూడు రోజుల విచారణ అనంతరం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబైలో మంగళవారం అరెస్టు చేసింది. రియా వాట్సాప్ ఛాట్స్ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన ఎన్‌సీబీ తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటికొచ్చాయి. మాదక ద్రవ్యాల మత్తులో జోగుతోన్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమ చిట్టా బట్టబయలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న దాదాపు 30 మంది పేర్లను రియా ఎన్‌సీబీ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. తనకు మాదక ద్రవ్యాల డీలర్లతో ఎటువంటి సంబంధాల్లేవని ఆ విచారణలో తెలిపారు.
కరోనా లాక్‌డౌన్ కాలంలో డ్రగ్స్ దొరకడం కష్టం కావడంతో, రియాచక్రవర్తి తన సోదరుడి ద్వారా డ్రగ్స్ తెప్పించినట్లు ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. నిజానికి రెండో రోజు విచారణ అనంతరమే రియాను అరెస్టు చేయాల్సి ఉండగా, మాదకద్రవ్యాలకు సంబంధించిన మరింత లోతైన సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో ఎన్‌సీబీ, మూడో రోజు కూడా ఆమెను విచారించాలని భావించింది. అందులో భాగంగానే మంగళవారం ఉదయం తిరిగి ముంబైలోని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి రియాను రప్పించి విచారించింది. విచారణ అనంతరం ఎన్‌సీబీ రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసినట్టు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎన్‌సీబీ కె.పిఎస్.మల్హోత్రా చెప్పారు. అరెస్టు అనంతరం వైద్య పరీక్షల కోసం ముంబైలోని సియాన్ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్ళారు.
ఆమెకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు కోవిడ్–19 పరీక్ష కూడా నిర్వహించగా, నెగిటివ్ వచ్చింది. మాదకద్రవ్యాల చట్టంలోని సెక్షన్8(సి)మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం, అమ్మడం, 20(బి)(2) తక్కువ మోతాదులో నిషేధిత డ్రగ్స్ వినియోగం, వాటిని కలిగి ఉండడం తదితర సెక్షన్‌ల కింద రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది. ఈనెల 22 దాకా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు రియాను హాజరుపరిచిన ఎన్‌సీబీ... సుశాంత్‌కు డ్రగ్స్ కొనుగోలు చేసిన సిండికేట్‌లో రియా క్రియాశీలకంగా పనిచేశారని ఆరోపించింది. కస్టడీ కోరడం లేదని తెలిపింది. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. రియా బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయిస్తామని ఆమె లాయర్ తెలిపారు.
‘‘నేనేం చేసినా సుశాంత్ కోసమే చేశాను’’
రెండో రోజు విచారణలోనే ఎన్‌సీబీ ఎదుటయ రియా చక్రవర్తి భావోద్వేగంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘నేనేం చేసినా, సుశాంత్ కోసమే చేశాను’’అని ఆమె చెప్పారు. ఎన్‌సీబీ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేశారు. ఆగస్టులో ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో సుశాంత్‌ని డ్రగ్స్ తీసుకోకుండా వారించేదాన్నని కూడా రియా చెప్పారు.
సోదరుడిని చూసి బోరుమన్న రియా
మంగళవారం రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌కు కలిపి ఎన్‌సీబీ విచారించింది. ఈ సందర్భంగా షోవిక్‌ని చూసిన రియా ఒక్కసారిగా బోరున విలపించినట్లు ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. క్రితం రోజు తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్న రియా మంగళవారం ఎన్‌సీబీ విచారణలో, తాను అప్పుడప్పుడూ సిగరెట్ ద్వారా డ్రగ్స్ తీసుకునేదాన్నని వెల్లడించారు. రియాను సీబీఐ, ఎన్‌సీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు విచారిస్తున్నాయి.
సుశాంత్ మత్తుకు బానిస: న్యాయవాది
సుశాంత్ మాదకద్రవ్యాల బానిసై, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన్ను రియా చక్రవర్తి ప్రేమించడంతో మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక మహిళను వేటాడుతున్నాయని ఆమె లాయర్ సతీష్ షిండే వ్యాఖ్యానించారు. రియా అరెస్టు న్యాయవ్యవస్థని అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు. అక్రమంగా సుశాంత్‌కి మందులు ఇచ్చారని, డ్రగ్స్ కూడా తీసుకుంటాడని... అందువల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ కేసులో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రియా చక్రవర్తి సిద్ధంగా ఉన్నట్టు న్యాయవాది చెప్పారు. ఇదిలా ఉండగా రియా అరెస్టు బీహార్‌కి పెద్ద విజయమని, బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment