జీవితమంతా నటనేనా?
అతిగా మాట్లాడితే వాగుడుకాయ అంటారు. అసలేం మాట్లాడకుండా ఉంటే గర్విష్ఠి అంటారు. ఈ రెండూ కాకుండా మధ్యస్థంగా వ్యవహరించడం తెలియాలి. కత్రినా కైఫ్‌కి అది తెలియదట. గలగలా మాట్లాడటం తనకు చేతకాదని కత్రినా చెబుతూ - ‘‘మొదట్నుంచీ నేనేం మాటల మూటని కాదు. చదువుకునే రోజుల్లో స్నేహితులు మాట్లాడితే వినేదాన్ని. ‘నువ్వేం మాట్లాడటంలేదేంటి’ అనడిగితే.. ‘మీరు మాట్లాడుతున్నారు కదా’ అనేదాన్ని. పెద్దయ్యాక కూడా నా తీరులో మార్పు రాలేదు.
షూటింగ్ లొకేషన్లో నా పనేంటో నేనేంటో అన్నట్లుగా ఉంటాను. విరామంలో ఏదైనా మంచి పుస్తకం చదువుతూనో, నచ్చిన పాట వింటూనే గడుపుతుంటాను. దాంతో నాకు తలబిరుసుతనం ఉందని కొంతమంది చెప్పుకుంటుంటారు. అలా అపార్థం చేసుకున్నందుకు బాధగానే ఉంటుంది. అందుకే నా పద్ధతి మార్చుకుని ఎప్పుడైనా గలగలా మాట్లాడాలని ప్రయత్నిస్తుంటాను. కానీ, అది నాటకీయంగా ఉంటుంది. సినిమాల్లోనూ నటించి, విడిగానూ నటించి.. ఇక జీవితం మొత్తం నటనే అవుతుందనిపించింది. అందుకే, నా పద్ధతిలో నేను కొనసాగుతున్నాను. నాకు బాగా క్లోజ్ అయినవాళ్లకు నేనేంటో తెలుసు కాబట్టి, మిగతావాళ్లు ఏమనుకున్నా డోంట్ కేర్’’ అన్నారు.