ముద్ద బొమ్మ... ముద్దుగుమ్మ | Special story to bollywood stars statues  | Sakshi
Sakshi News home page

ముద్ద బొమ్మ... ముద్దుగుమ్మ

Published Tue, Jul 31 2018 12:04 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

 Special story to bollywood stars statues  - Sakshi

మనకు తెలిసిన తారలను చెక్కిన జక్కన్నలు ఎందరో. శక్తి చాలా విశాలమైనది. విస్తరించి ఉంటుంది. ఇందుగలదు అందులేదనే సందేహము  వలదు.  శిల్పంలో దైవత్వాన్ని, మాతృత్వాన్ని, దివ్యత్వాన్ని మనిషి చూసుకుంటూనే ఉంటాడు.  మరి దేవుడు చేసిన బొమ్మలకు  మనుషులు చేసిన బొమ్మలకు తేడా చెప్పగలరా ?మన తారలకే నచ్చిన తారలు ఈ మైనపు బొమ్మలు.  కదలలేవు.. మెదలలేవు.. పెదవి విప్పి పలుకలేవు.  కానీ కదిలించగలవు.. మది నింపగలవు.. కనులు కలిపి మైమరిపించగలవు.

సినిమా తారలు అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంటారు. తమ రూపాన్ని వారి మనసుల్లో ముద్ర వేసుకుంటారు. అయితే ఆ రూపం కంటికి కనిపించదు. కంటికి కనిపించే విధంగా దేశవాళీ అభిమానులు కొందరు తమ అభిమాన తారల ఫొటోలను, పోస్టర్లను గోడలకు అంటించుకుంటారు. నోటు పుస్తకాలకు అట్టలుగా వేసుకుంటారు. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఈ అభిమానాన్ని శాశ్వతం చేయగలిగితే? జనం అభిమానించే నాయకులని, ఆటగాళ్లని, సినిమా తారలని.. ఇలాంటి సెలబ్రిటీలని ఒకచోట చేర్చి ఆ ఘనతను శాశ్వతం చేయగలిగితే? ఈ ఆలోచనకు రూపం ఇచ్చి దానినొక టూరిజం విశేషంగా మార్చినది లండన్‌లో ఉన్న ‘మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియం’. ప్రపంచ ప్రముఖులు తమ నిజరూపంతో  నిలబడి ఉన్నారా అన్నట్టుగా మైనపు విగ్రహాలను చేసి ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. ఆ గొప్పవాళ్లను నిజజీవితంలో కలవలేని వారు ఈ విగ్రహాలతో ఫొటో దిగి, నిజంగానే వారిని కలిసినట్టుగా థ్రిల్‌ అవుతారు. అమెరికన్లు, యూరోపియన్లు, బ్రిటిషర్లు ఎక్కువగా చోటు సంపాదించుకున్న ఈ మ్యూజియంలో మొదటగా చోటు చేసుకున్న భారతీయుడు మహాత్మాగాంధీ. ఆ తర్వాత ఆ ఘనత అమితాబ్‌ బచ్చన్‌కు దక్కింది. మేడమ్‌ తుస్సాడ్స్‌కు వస్తున్న విశేష స్పందన చూసి ప్రపంచంలోని అనేక చోట్ల తుస్సాడ్స్‌ మ్యూజియంలు స్థాపించారు. హాంకాంగ్‌లో, ఢిల్లీలో ఉన్న బ్రాంచీలు కొత్త విగ్రహాలకు చోటు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనపు బొమ్మగా మారనున్న సెలబ్రిటీల సంఖ్య కూడా పెరిగింది.

వాళ్ల  వివరాల్లోకి వెళ్తే.. 
ఇండియన్‌ ఫిల్మ్‌ స్టార్స్‌లో లండన్‌ మ్యూజియంలో చోటు దక్కించుకున్న మొదటి సెలబ్రిటీ అమితాబ్‌ బచ్చన్‌. ఆసియాలోనే మొదటి ఫిల్మ్‌ స్టార్‌ కూడా అమితాబే కావడం విశేషం. 2000లో అమితాబ్‌ విగ్రహాన్ని మేడమ్‌ తుస్సాడ్స్‌లో ప్రతిష్టించారు.  కేవలం లండన్‌లోనే కాదు న్యూ యార్క్‌  (2009), హాంగ్‌కాంగ్‌ (2011) వాషింగ్‌టన్‌ డీసీ (2012), ఢిల్లీ (2017 )లలోని తుస్సాడ్స్‌ మ్యూజియంలలో చోటు సంపాదించుకున్నారు ఆయన. ఆ తర్వాత ఆ ఘనతను పొందినది ఆయన కోడలు, అందాల తార ఐశ్వర్యా రాయ్‌ కావడం మరో విశేషం. 2003లో ఐష్‌ మైనపు బొమ్మను తుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. మోడ్రన్‌ డ్రెస్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి ఐష్‌ పెళ్ళి తర్వాత చీరను చుట్టారట. ఆ తర్వాత క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ చేత క్రికెట్‌ బ్యాట్‌తో ఆ మ్యూజియంలో కొలువు తీరారు. ఆ వరుసలో తర్వాతి పేరు కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ది కావడంలో వింత లేదు కదా. షారుక్‌ సొట్టబుగ్గలకు బాలీవుడ్‌ మాత్రమే కాదు అనేక దేశాలలోని ఫ్యాన్స్‌    ఫ్లాట్‌ అయ్యారు. ఇంత అభిమానం పొందిన స్టార్‌ను వెంటనే తుస్సాడ్స్‌లో నిలబెట్టాలి అని నిశ్చయించుకున్నారు నిర్వాహకులు. అలా  తన సిగ్నేచర్‌ డింఫుల్స్‌తో బ్లాక్‌ సూట్‌ వేసుకున్న షారుక్‌ మైనపు బొమ్మ 2007లో అక్కడ సందడి చేసింది. ఆ తర్వాత లాస్‌ ఏంజెల్స్, హాంగ్‌కాంగ్, న్యూయార్క్, వాషింగ్‌టన్‌ లోను ఖాన్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ మైనపు బొమ్మ 2013లో లండన్‌ తుస్సాడ్స్‌లో ప్రతిష్టితమైంది. బ్లాక్‌ బనియన్‌ మీద కోటు వేసుకుంటున్న పోజుతో  సల్మాన్‌ బొమ్మ అక్కడ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ సినిమాలో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా నటించిన అనిల్‌ కపూర్‌ ఆ గెటప్‌లోనే మైనపు విగ్రహాన్ని సంపాదించారు. సింగపూర్‌లోని తుస్సాడ్స్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

మేడమ్‌ తుస్సాడ్స్‌ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఎవరు ఫేమ్‌లోకి వస్తున్నారో గమనిస్తూ ఉంటారు. ‘కహోనా ప్యార్‌ హై’తో సంచలనం సృష్టించిన హృతిక్‌ రోషన్‌కు ఉన్న అభిమానుల సంఖ్య అతడి విగ్రహాన్ని తుస్సాడ్స్‌లో నిలబెట్టేలా చేసింది. ‘ధూమ్‌ 2’ గెటప్‌తో హృతిక్‌ బొమ్మను లండన్‌ తుస్సాడ్స్‌లో పొందుపరిచారు. మ్యూజియంలో ఎక్కువసార్లు ముద్దులకు నోచుకున్న బొమ్మ గా హృతిక్‌ బొమ్మ రికార్డ్‌ సాధించింది. ఇంకా మాధురీ దీక్షిత్, కాజోల్, కరీనా కపూర్‌ వంటి పలువురు తారలు తుస్సాడ్స్‌లో ప్లేస్‌ సంపాదించా రు.  ఇటీవల తుస్సాడ్స్‌లో వరుణ్‌ ధావన్, దిల్జిత్‌ జోషీ వంటి స్టార్స్‌ బొమ్మలను పొందుపరిచారు.

ముందు ప్రభాస్‌.. తర్వాత మహేశ్‌ 
‘బాహుబలి’ వంటి భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఇండియన్, ఇంటర్నేషనల్‌ అభిమానుల్లో కూడా క్రేజ్‌ సంపాదించారు ప్రభాస్‌. ఆ పాపులారిటీతోనే మేడమ్‌ తుస్సాడ్స్‌లో మైనంగా మారే అవకాశం పొందారు. విశేషం ఏంటంటే ఇలా మైనపు విగ్రహం సంపాదించిన తొలి సౌత్‌ హీరో ప్రభాసే. తనకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ గెటప్‌తోనే బ్యాంకాక్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌లో దర్శనమిస్తున్నారు ప్రభాస్‌. ఆ తర్వాత మహేశ్‌ బాబు ఈ లిస్ట్‌లోకి చేరారు. మహేశ్‌ మైనపు బొమ్మ ఎలా ఉంటుందో  చిన్న టీజర్‌ చూపించారు తుస్సాడ్స్‌ టీమ్‌. ఆయన ముఖానికి శిల్పి ఇవాన్‌ రీస్‌ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బొమ్మను మరికొన్ని రోజుల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు.

తుస్సాడ్స్‌ క్లబ్‌లో ఇంకా...
‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్‌’ వంటి చిత్రాలను అందించిన కరణ్‌ జోహర్‌ కూడా తుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా మారనున్నారు. దర్శకుల్లో ఈ ఘనత సాధించినది కరణ్‌ జోహరే. రీసెంట్‌గా దీపికా పదుకోన్‌ కూడా ఈ మ్యూజియంలో జాయిన్‌ అయ్యారు. అయితే బాలీవుడ్‌ సెలబ్రిటీల మధ్య కాకుండా డైరెక్ట్‌గా ‘ఏ లిస్ట్‌ సెలబ్రిటీస్‌’ మధ్య ఈమె మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారట. అంటే ఏంజిలినా జోలీ, బ్రాడ్‌ పిట్‌ వంటి ఇంటర్నేషనల్‌ స్టార్స్‌తో పాటుగా నిలబడనున్నారు. ఏమైనా పిండికొద్దీ రొట్టె ఖ్యాతి కొద్దీ బొమ్మ.
ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది

ఎలా చేస్తారు? 
మైనపు విగ్రహం కచ్చితంగా ఉండటం కోసం సుమారు 300 ఫొటోలు తీసుకుంటారట. 200 కొలతలు తీసుకుంటారని సమాచారం. కొలతలు తీసుకోలేని పాతతరం సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు గంటల కొద్దీ వీక్షించి మైనపు బొమ్మను తయారు చేస్తారట. బొమ్మ తయారు చేయడానికి తీసుకున్న కొలతలను మ్యూజియం బృందం ఎప్పడూ బయటకు రానివ్వరు. తయారు చేసే ముందే విగ్రహాన్ని ఓ రెండు మూడు అంగుళాలు పెద్దదిగా తయారు చేస్తారు. ఎందుకంటే మైనంకు కుంచించుకుపోగల గుణం ఉంది కాబట్టి. అలాగే సెలబ్రిటీలు వాడే సేమ్‌ కాస్ట్యూమ్స్, వస్తువులను బొమ్మతో జత చేసి రియలిస్టిక్‌ లుక్‌ను తీసుకువస్తారు.

మేడమ్‌ తుస్సాడ్‌ ఎవరంటే?
మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియం వ్యవస్థాపకురాలు మేరీ తుస్సాడ్‌. మేరీ వాళ్ల అమ్మ డా. ఫిలిప్పీ కూర్సియస్‌ దగ్గర పని చేసేవారు. మేరీకి కూర్సియస్‌ మైనపు బొమ్మలు తయారు చేసే కళను నేర్పించారు. అలా చిన్నప్పటి నుంచే మైనపు బొమ్మలను తయారు చేయడం పట్ల ఆసక్తి ఏర్పరుచుకున్నారు ఆమె. 17 ఏళ్లకే తన తొలి మైనపు బొమ్మను తయారు చేసుకున్నారు. కింగ్‌ లూయిస్‌కు ఆర్ట్‌ ట్యూటర్‌గా పని చేశారు మేరీ. ఫ్రెంచ్‌ విప్లవం కారణంగా ఆమెను జైల్లో బంధించారు. జైలు నుంచి రిలీజయ్యాక ఫ్రాంకోయిస్‌ తుస్సాడ్‌ను పెళ్లాడి మేరీ తుస్సాడ్‌ అయ్యారామె. 1761లో ఫ్రాన్స్‌లో పుట్టిన ఆమె 1835లో లండన్‌లో స్థిరపడి ఓ మ్యూజియం స్థాపించారు. అదే క్రమేణా ‘మేడమ్‌ తుస్సాడ్స్‌’ మ్యూజియం అయింది. అందులో ఆమె తయారు చేసిన బొమ్మలను చూడొచ్చు. 1925లో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని బొమ్మలు ధ్వంసం అయ్యాయి. 1842లో తన సొంత ప్రతిమను తయారు చేసుకున్నారు మేరీ తుస్సాడ్‌. ఇప్పుడు అదే బొమ్మ మ్యూజియంలోకి వెళ్తుంటే మనల్ని పలకరిస్తుంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలువురి ప్రముఖుల మైనపు బొమ్మలు దర్శనమిస్తుంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement