సరదా స్టేట్‌మెంట్‌తో ఇబ్బందులు
సరదా స్టేట్‌మెంట్‌తో ఇబ్బందులు
Published Sun, Dec 22 2013 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఔత్సాహికరాయుళ్ల నోటికి రోజూ ఏదో ఒక మేత దొరకాలి. లేకపోతే వాళ్లకి జీవితం చాలా డల్‌గా అనిపిస్తుంటుంది. అందుకే, సినిమా తారలు తుమ్మినా, దగ్గినా ఓ కథ అల్లేసి ప్రచారం చేసేస్తుంటారు. ఇక, స్వయంగా ఎవరైనా తారలు ఏదైనా స్టేట్‌మెంట్ ఇస్తే.. ఇంకేమైనా ఉందా? దాన్ని చిలవలు పలవలు చేసేస్తారు. ఇటీవల కరీనా కపూర్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ని అలానే చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కరీనా కపూర్ ‘తను నాకు మరదలులాంటిది. మా ఇంటి ఆడపడుచులాంటిది’ అని కత్రినా కైఫ్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం కత్రినా ప్రేమిస్తున్న రణబీర్‌కపూర్ స్వయానా కరీనాకి కజిన్.
ఎలాగూ తన తమ్ముడు ప్రేమిస్తున్నాడు కాబట్టి.. కత్రినాతో కరీనా వరస కలిపేసి ఉంటారనే ఊహాగానాలు చెలరేగాయి. కత్రినాతో కరీనా ఎలాగూ వరస కలిపేశారు కాబట్టి, ‘రణబీర్‌తో పెళ్లెప్పుడు?’ అని కత్రినాని ఇటు మీడియావారు, అటు ఔత్సాహికులు ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. దాంతో కత్రినా ఇరుకుల్లో పడిపోయారు. హాయిగా నిద్రపోతున్న పిల్లని గిచ్చి, తమాషా చూస్తున్న చందంగా కరీనా మాత్రం ఈ తతంగం మొత్తాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓ రెండు రోజుల అనంతరం ‘నేను సీరియస్‌గా అనలేదు.. ఉత్తుత్తినే అలా అన్నా’ అని కూల్‌గా చెప్పారు కరీనా.
ఇక, పెళ్లి గురించి కత్రినా మాట్లాడుతూ -‘‘నేనెప్పుడు పెళ్లి చేసుకుంటానో నాకే తెలియదు. ఇంకో ఐదేళ్లు పట్టొచ్చు. లేకపోతే పదేళ్ల తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ప్రస్తుతం నా చేతినిండా సినిమాలున్నాయి’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కత్రినాని తన ఆడపడుచుగా కరీనా ప్రకటించడం వెనక పెద్ద ప్లానే ఉందట. ఈ ప్రకటన చేసిన షోలో పాల్గొనకముందు కరీనా, కత్రినా కలిసి డిన్నర్ చేశారట. అప్పుడు కత్రినాతో ‘నువ్వు నా ఆడపడుచువి అని సరదాగా ఓ స్టేట్‌మెంట్ ఇస్తా’ అంటే, ‘ఓకే..’ అన్నారట కత్రినా. కానీ, ఆ సరదా స్టేట్‌మెంట్ ఇలా తనను ఇబ్బందుల పాలు చేస్తుందని కత్రినా ఊహించి ఉండరు.
Advertisement
Advertisement