బికినీ వేయమనేవరకూ ఇలానే ఉంటా!
మెరుపు తీగకు చిరునామా ఎవరంటే బాలీవుడ్‌లో కరీనా కపూర్, కత్రినా కైఫ్, అలియా భట్ వంటి తారల పేర్లు చెబుతారు. ఇలా బక్కపలచగా ఉండే భామల మధ్య బొద్దుగుమ్మలు విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రాలు తమదైన శైలిలో రాణిస్తున్నారు. ముఖ్యంగా పరిణీతి చోప్రా విషయంలో ఆమె సన్నిహితులు చాలాకాలంగా కొంచెం తగ్గమని సలహాలిస్తున్నారు. అయినా, ఆమె అలాంటి ప్రయత్నాలేవీ చేయడంలేదు. ‘‘ఇలా ఉంటే ఇక, బికినీ ఎలా ధరిస్తావ్?’’ అని సన్నిహితులు అడిగితే - ‘‘ఇప్పటివరకూ అవకాశం రాలేదు.
భవిష్యత్తులో అవకాశం వస్తే, బొద్దుగా ఉన్నాను కదా అని తిరస్కరించను. బికినీకి అనుగుణంగా శరీరాకృతిని మల్చుకుంటా. అప్పటివరకు ఇలానే కొనసాగుతా’’ అన్నారట. ఇలా బొద్దుగా ఉండటమే నాకిష్టం అని పరిణీతి చెబుతూ - ‘‘పిజ్జాలు తినకుండా ఉండలేను. వాటి వల్ల బరువు పెరుగుతామని తెలుసు కానీ, నోరు కట్టేసుకోవడం ఎలా? అసలు ఎవరైనా ఎందుకు కష్టపడి పని చేస్తారు? కడుపు నిండా ఇంత తినడానికి, నచ్చిన బట్టలు కట్టుకోవడానికి, ఉన్నంతలో వైభవంగా జీవించడానికే. అలాంటప్పుడు, నచ్చిన ఆహారం తినకుండా ఎలా ఉంటాం? అందుకే.. ఎవరేమన్నా.. నేనిలానే ఉంటా’’ అని చెప్పారు.