బోయ్‌ఫ్రెండ్స్‌ను మార్చుకున్న హీరోయిన్లు?
నిన్న కాక మొన్న నేవీ ఆఫీసర్లు కొంతమంది 'వైఫ్ స్వాపింగ్' చేసుకుంటున్నారని ఆరోపణలు గగ్గోలు పుట్టాయి. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో 'బోయ్‌ఫ్రెండ్ స్వాపింగ్' జరుగుతోందన్న రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్‌తో కత్రినా కైఫ్ తెగతెంపులు చేసుకుందన్న విషయం ఎప్పుడో తెలిసిందే. మరోవైపు సిద్దార్థ మల్హోత్రా - ఆలియా భట్ కూడా విడిపోయారని చెప్పారు. ఇప్పుడు ఈ రెండు జంటలు అటు, ఇటు మారాయని చెబుతున్నారు. నిజానికి రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ విడిపోడానికి ప్రధాన కారణం కూడా ఆలియా భట్ అన్న మాటలు అప్పట్లో వినిపించాయి. ఈ రూమర్లను ఇటు కత్రినా, అటు ఆలియా ఇద్దరూ ఖండించారు. వాళ్లిద్దరూ ఓ ఫంక్షన్‌లో కలిసినప్పుడు చాలా కాలం తర్వాత కలుసుకున్న స్నేహితుల్లా ఆప్యాయంగా కౌగలించుకున్నారు. దాంతో రణబీర్ - కత్రినా విడిపోడానికి తాను కారణం కాదని ఆలియా ప్రకటించినట్లు అయింది. తామిద్దరి మధ్య గొడవలేమీ లేవని కూడా చెప్పడానికి ఆ కార్యక్రమాన్ని ఆలియా బాగా ఉపయోగించుకుంది.
కానీ.. ఇప్పుడు మాత్రం ఆలియా బోయ్‌ఫ్రెండుగా అందరికీ తెలిసిన సిద్దార్థ మల్హోత్రాతో కత్రినా కైఫ్ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోందట. వాళ్లిద్దరూ బాగా సన్నిహితంగా ఉంటున్నారని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కత్రినా కైఫ్, సిద్దార్థ మల్హోత్రా కలిసి నటిస్తున్న 'బార్ బార్ దేఖో' సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. అందులో వాళ్లిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండిందని చెబుతున్నారు. ఇటీవల కత్రినా కైఫ్ బాంద్రాలో ఓ అపార్టుమెంటు అద్దెకు తీసుకుంది. ఇది సిద్దార్థ మల్హోత్రా ఉంటున్న అపార్టుమెంటుకు చాలా దగ్గరగా ఉంటుందట. ఇదంతా చూస్తుంటే ఇద్దరు భామలు బోయ్‌ఫ్రెండ్సును మార్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.