పచ్చజెండా ఊపితే ఏం పోతుంది?
కత్రినా కైఫ్ అందచందాలు చూసి రేఖ అసూయకు గురయ్యారా?
కరీనా మనసెందుకు ఆ సినిమాపై మొగ్గలేదు?
ఆ సినిమాను ఆలియా భట్ ఎందుకు వద్దనుకున్నారు?
దర్శక, నిర్మాతలను కంగనా డైలమాలో పడేశారా?
ప్రస్తుతం హిందీ రంగంలో ఈ కథానాయికల గురించి జరుగుతున్న చర్చ ఇది. ఒక సినిమా ఒప్పుకుని, తీరా చిత్రీకరణ మొదలుపెట్టేసరికి తప్పుకున్నా... కారణాలు చెప్పకుండా సినిమా తిరస్కరించినా.... చర్చ మొదలవుతుంది. అలా ఈ నలుగురు తారలూ ఇప్పుడు చర్చనీయాంశాలు అయ్యారు. ఇంతకీ వీళ్లు వదులుకున్న చిత్రాలేంటి?... దాని వెనుక కథేంటి?
అభద్రతాభావంతో...
అందాల అభినేత్రి రేఖ ‘ఫితూర్’ చిత్రంలో ‘మిస్ హవీశమ్’ అనే పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. అది వృద్ధురాలి పాత్ర. కానీ, పెళ్లి కూతురిలా అనుకుని, ఎప్పుడూ అలానే అలకరించుకుంటుంది హవీశమ్. ఈ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందనీ, కథకు కీలకమనీ చిత్రదర్శకుడు అభిషేక్ కపూర్ పేర్కొన్నారు. రేఖ కొన్నాళ్లు చిత్రీకరణలో కూడా పాల్గొన్నారు. కానీ, చిత్రకథానాయిక కత్రినా కైఫ్ అందం ముందు తాను వెలతెలపోతున్నానని రేఖ భావించారట. అభద్రతాభావానికి గురై, ఏకంగా ఈ చిత్రం నుంచే ఆమె తప్పుకున్నారనే ఊహాగానాలున్నాయి. ఆ తర్వాత రేఖ స్థానంలో టబూను తీసుకున్నారు.
‘సెక్షన్ 84’కి నో!
కథానాయిక ప్రాధాన్యంతో సాగే ‘సెక్షన్ 84’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నారు రాజ్‌కుమార్ గుప్తా. మానసిక వైకల్యం ఉన్న మహిళ చుట్టూ తిరిగే కథ ఇది. ఏం చేస్తున్నామో గ్రహించలేని ఆ మహిళ ఓ నేరానికి పాల్పడుతుంది. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తి నేరం చేస్తే శిక్ష వేయాలా? అనే కథాంశంతో సాగే ఈ చిత్రంలో కరీనా కపూర్‌ను కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. ఈ పాత్రలోకి కరీనా పరకాయ ప్రవేశం చేయగలరన్నది ఆయన నమ్మకం. కానీ, కరీనాకు అపనమ్మకమో ఏమో ఈ చిత్రాన్ని తిరస్కరించారు. వాస్తవానికి ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ, కరీనా తిరస్కరించడంతో జాప్యమైంది. సినిమా డైలమాలో పడింది.
ఏమో దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో?
బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేతి నిండా అవకాశాలే. దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఈ అవకాశాల్లో జపనీస్ చిత్రం ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ చిత్రం ఒకటి. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్, కంగనా రనౌత్ జంటగా ఈ చిత్రం రూపొందనుందనే వార్త వచ్చింది. కంగనను ఈ చిత్రం కోసం సంప్రతించారట. కానీ, ఆమె వైపు నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదట. ‘ఈ సినిమా నుంచి తప్పుకున్నారట’ అని ఎవరైనా కంగనను అడిగితే, ‘నేను ఒప్పుకున్నదెప్పుడు?’ అని ఆమె రివర్స్‌లో అడుగుతున్నారట. ‘ఇంతకీ ఈ సినిమా చేయాలనుకుంటున్నారా?’ అంటే మౌనం వహిస్తున్నారట. చేతిలో ఉన్న ఇతర సినిమాలతో పోల్చి చూసుకొని, అప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారట. అప్పటివరకూ దర్శకుడికి వెయిటింగే.
మరో ప్రేమకథ చేయడం ఇష్టం లేక...!
కుర్రకారు కలల రాణి ఆలియా భట్ ఒక సినిమాను తిరస్కరించడంవల్ల అది ఇప్పటివరకూ ఆరంభం కాలేదు. ఆ చిత్రం పేరు ‘రాబ్తా’. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఆలియా భట్‌ను కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. కానీ, ఆలియా ఈ చిత్రాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించేశారు. ఇప్పటికే ‘షాన్‌దార్’, ‘ఉడ్తా పంజాబ్’, ‘కపూర్ అండ్ సన్స్’ వంటి ప్రేమకథా నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటిస్తున్నందున మరో లవ్‌స్టోరీలో నటించడం ఇష్టం లేక ‘రాబ్తా’ను తిరస్కరించారనే వార్త ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఈ కథలో వేరే కథానాయికను దర్శకుడు ఊహించుకోలేకపోతున్నారట. ఆలియాకు బదులుగా వేరే ఎవరైతే బాగుంటుందో ఆలోచిస్తున్నారట. ఈ కారణంగా ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ చిత్రం అక్కడే ఆగింది.
మొత్తం మీద కరీనా, కంగనా, ఆలియా భట్‌లు దర్శక, నిర్మాతలను డైలమాలో పడేశారు. పాపం ఈ దర్శక, నిర్మాతల పరిస్థితి చూసి, ‘ఈ ముద్దుగుమ్మలు పచ్చజెండా ఊపితే ఏం పోతుంది? మహా అయితే సినిమా తీస్తారు? అంతేగా’.. అని పరిశ్రమ జనం చెప్పుకుంటున్నారు.