టెక్నాలజీతో తల్లి అయిన మాజీ మిస్ వరల్డ్
ముంబై: మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్(42) శనివారం ఓ పాపకు జన్మనిచ్చింది. వైద్యశాస్త్రంలో నూతన పద్దతి అయిన ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో డయానా ఆ పాపకు జన్మనివ్వడం విశేషం. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో దాచిన తన అండాలతో డయానా తల్లి కావడం ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్పై ఆసక్తి రేకెత్తిస్తోంది. పలువురు సెలబ్రెటీ మహిళలను డయానా ముందుచూపు ఆలోచింపజేస్తుంది.
సాధారణంగా కెరీరా, కుటుంబమా అనే ప్రశ్న సెలబ్రిటీలకే కాకుండా చాలా మంది మహిళలకు ఎదురౌతుంది. రెండూ ప్రాముఖ్యత గల అంశాలే. ఎటూ తేల్చుకోలేని సందిగ్థం. ఈ పరిస్థితే డయానాకు ఎదురైంది. అసలే అందాల పోటీ ప్రపంచం. మధ్యలో పిల్లలు, పెళ్లి అంటూ విరామం ఇస్తే తరువాత భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకొన్న డయానా ముందు జాగ్రత్తగా కొన్ని అండాలను ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు సహాయంతో ఎనిమిదేళ్ల క్రితం నిలువ ఉంచింది.
రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన కోలిన్ డిక్ను ప్రేమించి పెళ్లాడిన డయానా ఇప్పుడు ఎండో మెట్రియోసిస్ అనే వ్యాధితో బాధ పడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆరోగ్యవంతమైన అండాలను విడుదల చేయలేని స్థితిలో ఉన్న డయానా తాను ముందు జాగ్రత్తగా దాచిన అండాల సహాయంతో టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు తల్లయింది.
దీనిపై డయానా మాట్లాడుతూ.. ' నేను మొదటి సారిగా 2005లో ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకొన్నాను. అప్పుడు నా కెరీర్ మంచి స్థితిలో ఉంది. అదీకాక నేను ప్రేమలో పడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడు మహిళలు తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు' అని తెలిపింది.
ఇండియాలో సరాసరి నవజాత శిశువు బరువు 2.6 కేజీలు, పొడవు 48 సెంటీమీటర్లు కాగా ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన ఆర్యా హెడెన్ 3.7 కిలోల బరువు, 55 సెంటీమీటర్ల పొడవు ఉండటం విశేషం.