ఇది గుడ్డు అనుకుంటున్నారా? అవును గుడ్డే!
సాంకేతికం
‘గుడ్డును చూపెట్టి... ఇది గుడ్డు అనుకుంటున్నారా? అంటారేమిటి! విడ్డూరం కాకుంటేనూ!’ అనుకుంటున్నారా... అయితే అసలు విషయంలోకి వద్దాం... పన్నెండు రకాల మొక్కల ద్వారా గుడ్డును తయారుచేసే విధానాన్ని క్యాలిఫోర్నియాలోని ‘మయో ఎగ్ కంపెనీ’ కనుగొంది. ఆసియాలోనే అతి సంపన్నుడిగా పేరుగాంచిన లి క-షింగ్ ‘ఎగ్సర్డినరీ’ అనడమే కాదు కంపెనీకి అవసరమైన పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు.
ఈ కంపెనీకి బిల్‌గేట్స్ గౌరవ సలహాదారు కూడా. ఈ కృత్రిమగుడ్ల అమ్మకాలు ఇప్పటికే కాలిఫోర్నియాలోని కొన్ని దుకాణాల్లో మొదలయ్యాయి. ‘‘ఇది పోషక విలువలతో కూడిన నాణ్యమైన గుడ్డు మాత్రమే కాదు... పర్యావరణ అనుకూలమైనది కూడా’’ అని మయో గుడ్డును ఆకాశానికెత్తుతున్నారు కంపెనీ నిర్వాహకులు. ‘‘ఒక వస్తువు నచ్చకపోతే, ప్రత్యామ్నాయంగా మరో మంచి వస్తువును ఎంచుకునే పరిస్థితి లేని కాలంలో మనం ఉన్నాం.
ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయం ఉన్నా అది సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. ధరలు ఎక్కువగా ఉంటున్నాయి’’ అంటున్నాడు కంపెనీ సియివో జోష్ టెట్రిక్. ఆయన చెప్పకనే చెప్పిన విషయం ఏమిటంటే చెట్టు గుడ్డు అందరికీ అందుబాటులో ఉంటుందని. వెరీగుడ్డు న్యూసే!