జాతీయ జెండాకు పాక్ సైనికుడి నిప్పు
లాహోర్: తమ జాతీయ జెండాను తగులబెట్టి పాకిస్థాన్ మాజీ సైనికుడు అరెస్టయ్యాడు. దేశం కోసం ఒకప్పుడు సేవలు అందించిన అతడే పట్టపగలు బహిరంగంగా పాక్ జాతీయ పతాకాన్ని తగులబెడుతూ జాతి వ్యతిరేక నినాదాలు చేశాడు. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మాజీ సైనికుడిని అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తి గతంలో పాకిస్థాన్ సైన్యంలో పనిచేసేవాడు.
అయితే, అతడు కొన్ని కారణాల వల్ల ఇంటికి వెళ్లి తిరిగి సైన్యంలోకి రాకుండా చాలా కాలంపాటు సెలవులు పెట్టాడు. దీంతో అతడిని ఆర్మీ నుంచి తొలగించగా ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి దేశం తనపట్ల చర్యను అతడు అవకాశం ఉన్న ప్రతిచోట విమరశిస్తున్నాడు. ఈ నెల 13న కూడా అతడు ఓసారి జాతీయజెండాను తగులబెట్టాడట. అయితే, అప్పుడు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం పట్టించుకోలేదు. కానీ, తాజాగా కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు.