దటీజ్ సత్య నాదెళ్ల.. సక్సెస్‌కి కారణాలివే!
ఈ ఇన్స్టంట్ రోజుల్లో.. ‘అన్నీ తెలుసు’ అనే ధోరణిని తిరస్కరించే ఏకైక బాస్‌గా సత్య నాదెళ్లకి ఓ పేరుంది. అవసరమైన విషయాలకు దూరంగా.. మిస్టర్ కూల్ ఆటిట్యూడ్‌తో, ఆవిష్కరణలకు-టాలెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే నాదెళ్ల అంటే అందరికీ ఇష్టం. అదీ ప్రత్యర్థి కంపెనీలతో సహా. అదే ఆయన్ని ప్రపంచంలోనే ‘మోస్ట్ అడ్మయిర్డ్’ సీఈవోగా నిలిపింది. మరి ఆయన సక్సెస్‌కి కారణాలు ఏంటో ఓ లుక్కేద్దాం..
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. ఫార్చ్యూన్(బిజినెస్ మ్యాగజైన్) నిర్వహించే సర్వేలో మరోసారి మోస్ట్ అడ్మయిర్డ్ సీఈవోగా ఎన్నికయ్యారు. విశేషం ఏంటంటే.. ఇప్పుడున్న దానికంటే ఆయనకు మరింత ఉన్నత స్కోరింగ్ ఇవ్వాలన్నది చాలామంది కోరిక కూడా. అంతేకాదు ఈ ఏడాది ఓటింగ్‌లో మోస్ట్ అండర్రేటెడ్ సీఈవోగానూ(వరుసగా ఆరో ఏడాది కావడం విశేషం) నిలిచారు. ఫార్చ్యూన్ వరల్డ్స్ మోస్ట్ అడ్మయిర్డ్ కంపెనీస్ లిస్ట్‌లో సత్య నాదెళ్లకు ఈ ఘనతలు దక్కాయి. ప్రోత్సాహకరమైన నాయకత్వ శైలి, వినయం, విజన్‌తో నాదెళ్ల ఈ గౌరవాన్ని సాధించగలిగారు.
ఆ బుక్‌తోనే మొదలైన మార్పు..
►నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాక.. కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్ అందరినీ మార్షల్ రోసెన్‌బర్గ్ రాసిన Nonviolent Communication పుస్తకం చదవమని కోరాడట. ఆ పుస్తకం.. విమర్శ, తీర్పు వంటి వాటిని నిరుత్సాహపరుస్తుంది. అదే సమయంలో మరింత ప్రోత్సాహకరంగా ఎలా ఉండాలనే సూచనలను అందిస్తుంది. అలా ఆ పుస్తకం కంపెనీ సక్సెస్‌లో తొలి భాగం అయ్యింది.
►నాదెళ్ల సమకాలీకులంతా కఠినాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటే.. నాదెళ్ల మాత్రం మరో దారిలో ముందుకు వెళ్లారు. మంచి అలవాట్లతో కామ్‌గా ఉంటూ.. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌పై ఫోకస్ పెడుతూ టీంను ప్రేరేపిస్తూ ముందుకు తీసుకెళ్లారు. సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించే క్రమంలో.. దూకుడు ప్రవర్తనను సహించేది లేదని స్పష్టమైన సంకేతాలిచ్చారాయన.
‘‘అన్నీ తెలుసు అనే ధోరణిని కాస్త.. అన్నీ నేర్చుకో’’ అని మార్చేసి మైక్రోసాఫ్ట్‌కు సక్సెస్ బాటలో నడిపించారు.
►ఆవిష్కరణలకు ఆస్కారం ఇస్తూ.. అవసరమైతే దగ్గరగా మాట్లాడేందుకు పరిశోధకులకు సైతం అవకాశం కల్పించారు. బహుశా కార్పొరేట్ సెక్టార్లో ఇంత ఫ్రెండ్లీ బాస్ మరొకరు ఉండరేమో. వాస్తవానికి ఆయన సీఈవోగా బాధ్యతలు స్వీకరించే నాటికి కంపెనీ లాభాల్లోనే ఉంది. కాకపోతే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పెట్టుబడుల ఆధిపత్యంలో మాత్రం కాస్త వెనుకబడి పోయింది.
►ఈ తరుణంలో.. బండిని మళ్లీ పట్టాలు ఎక్కించడానికి మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్లలోనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు స్వయంగా ప్రకటించారాయన. అంతేకాదు.. ఇగోలను పక్కనపెట్టి.. ఇతర టెక్ కంపెనీలతో కలిసి పని చేయాలంటూ ఎగ్జిక్యూటివ్స్‌ను ప్రోత్సహించాడు.
మైక్రోసాఫ్ట్‌ను మళ్లీ..
►మైక్రోసాఫ్ట్ నాయకత్వం చేపట్టాక ఆయన చేసిన మొదటి పని.. గతంలో బ్లాక్ చేసిన ప్రసిద్ధ ప్రత్యర్థి ఆపిల్‌తో కలిసి ఐఫోన్ కోసం ఆఫీస్ ప్రొడక్టివిటీని విడుదల చేయడం. అంతేకాదు మైక్రోసాఫ్ట్‌ను దాని సాఫ్ట్వేర్, సేవలను Linux మరియు Google మరియు Apple వంటి ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తీసుకురావడం ద్వారా విస్తరించాడు. నేడు, కంపెనీ సేల్స్‌ఫోర్స్ మరియు Red Hat వంటి పోటీదారులతో భాగస్వామిగా కొనసాగుతోంది.
►పోటీ ప్రపంచంతో లీనమైన సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రయత్నాలు నష్టపోయాయని కూడా అతను గుర్తించాడు. వెంటనే నోకియా కొనుగోలును రద్దు చేశాడు. కంపెనీని కొత్త దిశలో నడిపిస్తూ, అతను 2016లో $26 బిలియన్లకు లింక్డ్ఇన్ కొనుగోలును పర్యవేక్షించాడు. 2018లో, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను పంచుకోవడంలో తన నిబద్ధతను చూపించడానికి కంపెనీ $7.5 బిలియన్లకు GitHubతో మరో పెద్ద కొనుగోలు చేసింది. గత సంవత్సరం, Xbox Series S, Series X మరియు PCలలో ఆడటానికి మరియు Sony యొక్క ప్లేస్టేషన్ 5తో నేరుగా పోటీ పడేందుకు బెథెస్డా యొక్క మాతృ సంస్థ ZeniMax కొనుగోలును కంపెనీ మరో $7.5 బిలియన్లకు పూర్తి చేసింది. ఇదంతా సత్య నాదెళ్ల హయాంలో సాధించిన ప్రగతే.
►మైక్రోసాఫ్ట్ CEOగా, నాదెళ్ల కంపెనీ మార్కెట్ క్యాప్‌ను సుమారు 300 బిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు పెంచాడు. ప్రస్తుతం Microsoft షేర్లు Google(ఆల్ఫాబెట్), Apple, Meta కంటే ఎక్కువగా ఉన్నాయి.
►తోటి ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులు.. సత్య నాదెళ్లను ఆరాదిస్తారు. ఎందుకంటే.. ఆయన సంప్రదించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. కలుపుగోలుతనం.. చివరకు పోటీదారులను సైతం ఆయనకు ఫిదా అయ్యి అభిమానులుగా మార్చేస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్
►మైక్రోసాఫ్ట్ చైర్మన్ కమ్ సీఈవోగా సత్య నాదెళ్ల సుపరిచితుడే. హైదరాబాద్(తెలంగాణ)లో పుట్టి, పెరిగిన నాదెళ్ల.. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ, విస్కోన్సిన్: మిల్వాకీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్, చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.
►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్‌లో విధేయమైన ఉద్యోగి. పాతికేళ్ల వయసులో(1992)లో నాదెళ్ల మైక్రోసాప్ట్లో చేరారు. ఏడేళ్ల తర్వాత బీసెంట్రల్కి(చిన్న వ్యాపారాలకు వెబ్‌సర్వీసులు అందించడం) ప్రెసిడెంట్ అయ్యారు. 2014లో ఏకంగా సీఈవో అయ్యారు.
►భార్య అనుపమతో పాటు సత్య నాదెళ్లకు ముగ్గురు పిల్లలు. సాహిత్యం మీద ఆసక్తి ఉన్న నాదెళ్ల తరచూ ఈవెంట్లలో పాల్గొనడమే కాదు.. కవితలు సైతం రాస్తారు. క్రికెట్‌కు వీరాభిమాని అయిన నాదెళ్ల.. 2019లో సీటెల్ సౌండర్స్ సాకర్ క్లబ్‌ను ప్రమోట్ కూడా చేశారు. తీసుకోవడమే కాదు.. తిరిగి ఇచ్చేయడంలోనూ సత్య నాదెళ్లది మంచి మనసే. సీటెల్ పిల్లల ఆస్ప్రతి కోసం 15 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చాయారాయన. విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే సత్య నాదెళ్లకు.. తాజాగా స్వదేశం తరపున ఆయనకు పద్మభూషణ్ గౌరవం దక్కిన విషయం తెలిసిందే.
:::సాక్షి, వెబ్‌స్పెషల్