four dies
-
టైరు పగిలి చెట్టును ఢీకొన్న కారు
కణేకల్లు: టైరు పగిలి కారు చెట్టును ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లా తగ్గుపర్తి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. కణేకల్లు ఎస్ఐ యువరాజు తెలిపిన వివరాలివీ.. బెలుగుప్ప మండలంలోని తగ్గుపర్తికి చెందిన శ్రీధర్‌నాయుడు బళ్లారి నగరంలోని విద్యానగర్‌లో స్థిరపడ్డారు. కుమారుడు సత్యనారాయణకు నాలుగు నెలల క్రితం కుడితినికి చెందిన మమతతో వివాహమైంది. శ్రీధర్‌నాయుడు భార్య రంగమ్మ(55) మామ నాగన్న ఐదు నెలల క్రితం స్వగ్రామమైన తగ్గుపర్తిలో చనిపోవడంతో గురువారం సంవత్సరికం నిర్వహించారు. ఇందుకోసం బుధవారం బళ్లారి నుంచి శ్రీధర్‌నాయుడు మినహా కుటుంబమంతా స్వగ్రామానికి బయలుదేరారు. కార్యక్రమం ముగించుకొని గురువారం మధ్యాహ్నం శాంత్రో కారులో రంగమ్మ(55), కుమారుడు సత్యనారాయణ(26), కోడలు మమత(22), మరిది ఆదినారాయణ(54) బళ్లారికి బయలుదేరారు. కణేకల్లు క్రాస్–బళ్లారి రోడ్డు మార్గమధ్యంలో యర్రగుంట గ్రామశివారులో కారు ముందు భాగంలోని కుడివైపు టైరు పగిలిపోయింది. వేగంగా వస్తున్న కారు కుడివైపున్న చింత చెట్టును బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది. రంగమ్మ, మమత, ఆదినారాయణలకు బలమైన గాయాలు కావడంతో కార్లోనే చనిపోయారు. కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోగా స్థానికులు కష్టం మీద బయటకు తీశారు. సత్యనారాయణ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. ఆర్సీ, మృతుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. రాయదుర్గం సీఐ చలపతి, కణేకల్లు ఎస్ఐ యువరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరు ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమైంది. శ్రీధర్‌నాయుడు, రంగమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. భార్యతో పాటు కుమారుడు మృతి చెందడంతో ఆయన రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
మాయదారులపై మారణహోమం
- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం - నిన్నటి ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరు యువకులూ మృతి రక్తాన్ని రుచి మరిగిన మాయదారులు మారణహోమాన్నే సృష్టిస్తున్నాయి. ప్రతి రోజూ కనీసం నలుగురైదుగురు ప్రాణాలు కోల్పోతుండగా, పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. తాజాగా ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకే రోజు నలుగురు మరణించగా, వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరు యల్లనూరు మండలానికి చెందిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం వల్ల కొన్ని, మానవ తప్పిదాలతో మరికొన్ని సంఘటనలు జరిగాయి. బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయుసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి సమీపంలోని నరసమ్మ ఆలయం వద్ద రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్న సంఘటనలో గార్లదిన్నె మండలం పెనకచర్లకు చెందిన తిరుపాలు(38), నార్పలకు చెందిన బయ్యన్న(35) మరణించారని పోలీసులు తెలిపారు. గార్లదిన్నె మండలం పెనకచర్లకు చెందిన తిరుపాలు తన భార్య శకుంతలతో కలసి అత్తగారి ఊరైన చెన్నంపల్లికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బైక్‌లో దంపతులిద్దరూ స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో దయ్యాలకుంటపల్లి సమీపానికి రాగానే నార్పలకు చెందిన బయన్న(ఐచర్ డ్రైవర్), రామదాసు, పవన్ మరో బైక్‌లో ఎదురొచ్చారు. అప్పటికే వీరు ముగ్గురు(అనంతపురంలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో మందు తాగి ఉన్నారు) విపరీతమైన వేగంతో వచ్చి తిరుపాలు బైక్‌ను ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించగా, శకుంతల సహా నార్పలకు చెందిన ముగ్గురూ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బయన్న తుదిశ్వాస వదిలాడు. తిరుపాలుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా, బయన్నకు ఒక కుమార్తె ఉంది. భార్య ప్రస్తుతం గర్భిణి. బైక్ చెట్టును ఢీకొని మరో యువకుడు.. చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి వద ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మవరానికి చెందిన మహేశ్(24) మరణించగా, రియాజ్, మల్లికార్జున గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు మంచి మిత్రులు. ధర్మవరానికి చెందిన మరో స్నేహితుడి వివాహం కొత్తచెరువు మండలం కొడపగానపల్లిలో జరుగుతుండగా అక్కడ హాజరయ్యేందుకు శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత బైక్‌లో బయలుదేరారు. మార్గమధ్యంలోని బసంపల్లి వద్దకు రాగానే వారి బైక్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును బలంగా ఢీకొనడంతో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. వారిని ధర్మవరం, ఆ తరువాత అనంతపురం పెద్దాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మితిమీరిన వేగమే ప్రాణాల మీదికి వచ్చిందన్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రక్తమోడిన రహదారులు
తనకల్లు (కదిరి) : అనంతపురం-చిత్తూరు జిల్లాల సరిహద్దులోని తనకల్లు మండలం చీకటిమానిపల్లె వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె నీరుగట్టుపల్లికి చెందిన సుబ్రమణ్యం, కృష్ణమూర్తి సోదరులు. వీరు పట్టుచీరల వ్యాపారం చేస్తారు. అనంతపురంలోని తమ సమీప బంధువు ఇట్లో జరిగే శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలసి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలోని చీకటిమానిపల్లె సమీపంలోని పేపర్‌మిల్లు మలుపులోకి రాగానే కారు ముందు చక్రం పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనున్న పెద్ద చెట్టుకు బలంగా ఢీకొంది. ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. అందులో ముందు సీటులో కూర్చొని ప్రయాణిస్తున్న కృష్ణమూర్తి(40), వెనక సీటులో కూర్చున్న ఆయన భార్య శకుంతల(38) అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమార్తె జస్విక, డ్రైవర్ సుబ్రమణ్యం, ఆయన భార్య సరస్వతి, వారి కుమారుడు విష్ణువర్దన్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే 108లో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రంగానాయక్ తెలిపారు. ధర్మవరంలో స్కూటరిస్టు... ధర్మవరం అర్బన్ : ధర్మవరంలోని కాలేజీ సర్కిల్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన పద్మావతి, గాండ్ల శివయ్య దంపతుల కుమారుడు గాండ్ల నాగరాజు(28) దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు... బైక్‌లో వస్తున్న నాగరాజు కాలేజీ సర్కిల్‌లోకి రాగానే లారీని ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నించారు. అంతలోనే ఎదురొచ్చిన మరో వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి లారీ కింద పడిపోయింది. ఘటనలో నాగరాజు లారీ వెనుక చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలొదిలాడు. అయితే ఆ దృశ్యం భయంకరంగా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్ఐ జయానాయక్ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. బీటెక్ చదివిన నాగరాజు బెంగళూరులో కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే సుజిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే జీతం చాలకపోవడంతో తిరిగి మేడాపురం చేరుకున్నారు. ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకునేవారు. ఆయన భార్య ధర్మవరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా వెళ్లేవారు. ఆటో బోల్తాపడి మరొకరు.. ముదిగుబ్బ : ముదిగుబ్బ - కదిరి మార్గంలోని పెట్రోల్ బంకు వద్ద బుధవారం ఆటో బోల్తా పడిన ఘటనలో గుంజేపల్లికి చెందిన గంగన్న(68) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కదిరి వైపు నుంచి ముదిగుబ్బ వైపునకు ఊరగాయల సీసాల లోడుతో వస్తున్న ఆటో మార్గమధ్యంలోని ఎన్.ఎస్.పి. కొట్టాల వద్ద గంగన్న అనే ప్రయాణికుడ్ని ఎక్కించుకొని వేగంగా వస్తోంది. ముదిగుబ్బ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. పెట్రోలు కోసం ఆటోను తిప్పక అడ్డొచ్చిన బైక్‌ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ సడన్ బ్రెక్ వేశాడు. దీంతో ఆటో ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. డ్రైవర్ పక్కనే కూర్చున్న గంగన్న ఆటో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతునికి భార్య నారాయణమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. -
ఉపాధి వేటలో మృత్యు హేల
• వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు • నలుగురి దుర్మరణం • శోకసంద్రంలో బాధిత కుటుంబాలు వారంతా శ్రమజీవులు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు శక్తినంతా ధారపోస్తే గానీ కడుపుకింత గంజి దొరకదు. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క, ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లి రావడం పరిపాటి. ఈ నేపథ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే రోజు నలుగురు అకాల మృత్యువాతపడ్డారు. అయిన వారు దిక్కులేని వారయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గోరంట్ల–హిందూపురం ప్రధాన రహదారిలోని సోమందేపల్లి మండలం తుంగోడు వద్ద Ô¶ నివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో లేపాక్షి మండలం మానెంపల్లికి చెందిన అజయ్(23) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చెన్నై నుంచి హిందూపురానికి కొరియర్ సామగ్రిని తరలిస్తుండగా మార్గమధ్యంలోని తుంగోడు వద్ద గల మలుపులోకి రాగానే మినీ ఆటో బోల్తాపడి అతను అక్కడికక్కడే చనిపోయినట్లు చెప్పారు. క్లీనర్ షాషాకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి రెండు నెలల కిందటే పెళ్లి అయినట్లు బంధువులు తెలిపారు. అంతలోనే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఘటన ప్రాంతం హోరెత్తిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణదుర్గం మండలంలో ఇద్దరు.. కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్టకు చెందిన పలువురు కూలీలు డీజిల్ ఆటోలో ఉపాధి పనులకోసం శీబావి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో బోరంపల్లి వద్ద డీజల్ ఆటోను కాసేపు ఆపారు. ఈ సమయంలో అనంతపురం వైపు నుంచి వెళుతున్న ఐచర్ వాహనాన్ని మరో ఐచర్ ఓవర్ టేక్ చేయడానికి దూసుకొచ్చి ఈ ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న కూలీ ప్రకాష్(20) తల ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయాడు. కూడేరు మండలం ఇప్పేరు గ్రామానికి చెందిన వెంకటరాముడు, నాగలక్ష్మి, ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి బైక్‌లో పనుల కోసం కళ్యాణదుర్గానికి వస్తున్నారు. ఒంటిమిద్ది గ్రామం వద్ద వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో నాగలక్ష్మి(25) కిందపడిపోగా తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆమెను ఆర్డీటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పట్టణ, రూరల్ ఎస్ఐలు శంకర్‌రెడ్డి, నబీరసూల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కక్కలపల్లి క్రాస్‌లో స్కూటరిస్టు.. అనంతపురం సెంట్రల్ : జాతీయ రహదారిలోని అనంతపురం–రాప్తాడు మార్గంలో గల కక్కలపల్లి క్రాస్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగానపల్లి మండలం గుంతపల్లి చెందిన నీలం హనుమంతరెడ్డి(45) అనే స్కూటరిస్టు మరణించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపారు. అనంతపురంలో పని ముగించుకుని స్వగ్రామానికి బైక్‌లో బయలుదేరిన హనుమంతరెడ్డి రుద్రంపేట దాటగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు. వెంటనే అతన్ని అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. ప్రమాదానికి కారణమైన లారీని పట్టుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
'శెట్టూరు ఘటనపై విచారణ జరిపించాలి'
అనంతపురం: శెట్టూరు ప్రమాద ఘటన పై విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్రకార్యదర్శి ఎల్.ఎం మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. నలుగురి మృతికి కారణమైన బోర్ వెల్ లారీ సిబ్బంది, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ క్షేత్రంలో వేస్తున్న బోరును చూడటానికి వెళ్లిన నలుగురు గ్రామస్థులు, బోర్వెల్ లారీ రివర్స్ తీస్తుండగా దాని కిందపడి మృతిచెందిన విషయం తెలిసిందే. శెట్టూరు మండలం పర్లచేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన సంజీవ(33), మంతేష్(27), తిమ్మప్ప(33), నర్సింహమూర్తి(30) అనే నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు అనూహ్యంగా మృతిచెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
ఒంటిమిట్ట(వైఎస్సార్ జిల్లా): ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మరో నలుగురు గాయపడినట్లు సమాచారం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.