లోకాయుక్త పంజా
నలుగురు అవినీతి తిమింగలాల బాగోతం బట్టబయలు
భారీ ఆస్తులు కూడబెట్టుకున్న ఏఎస్ఐ
బెంగళూరు: అక్రమ మార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లు, కార్యాలయూల్లో శనివారం ఏకకాలంలో లోకాయుక్త రాష్ట్రంలోని వివిధ చోట్ల సోదాలు నిర్వహించింది. అధికారుల సోదాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులు బయటపడ్డాయి.
లోకాయుక్త ఏడీజీపీ ప్రేమ్కుమార్మీన తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్‌లోని పీఎల్డీ బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వై వెంకట్రాజు సుమారుగా రూ.1.86 కోట్ల స్థిర, చరాస్తులు కూడబెట్టినట్లు లోకాయుక్త సోదాల్లో బయటపడింది. ఇతని ఆదాయంతో పోలిస్తే సంపద విలువ 194 రెట్లు ఎక్కువని లోకాయుక్త అధికారులు లెక్కగట్టారు. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలోని నాయకనాథహట్టి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.రహ్మతుల్లా ఆదాయంతో పోల్చినప్పుడు సంపద విలువ 90 రెట్లు ఎక్కువగా ఉన్నటు బయటపడింది. చిత్రదుర్గలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అకౌంట్స్ విభాగంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.తిమ్మబోవి దాదాపు కోటిరూపాయలు అక్రమమార్గంలో సంపాదించినట్లు లోకాయుక్త గుర్తించింది. ఆదాయంతో పోల్చినప్పుడు ఇతని సంపాదన 155 రెట్లు ఎక్కువ. రాష్ట్రపారిశ్రామికాభివృద్ధి శాఖ బెల్గాం విభాగంలో జాయింట్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కే.పీ పరమేశ్వరప్ప దాదాపు రూ.1.50 కోట్ల స్థిర,చరాస్తులు కలిగి ఉన్నట్లు తేలింది. దాదాపు 143 రెట్లు ఎక్కువ ఆస్తులను కూడబెట్టినట్లు లోకాయుక్త మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.