four medals
-
Asian Airgun Championship 2022: భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు
డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి. -
4 స్వర్ణాలు 1 రజతం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు ఒకే రోజు ఐదు పతకాలతో మెరిశారు. ఇందులో 4 స్వర్ణాలు కాగా మరొకటి రజతం. లవ్లీనా బొర్గొహైన్, పర్వీన్ హుడా, సవీటీ బూరా, అల్ఫియా పఠాన్ వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకోగా, తొలిసారి ఈ పోటీల బరిలోకి దిగిన మీనాక్షి రజతాన్ని అందుకుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా 75 కేజీల విభాగం ఫైనల్లో రుజ్‌మెటొవా సొఖిబా (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. ఒలింపిక్ పతకం తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, కామన్వెల్త్ క్రీడల్లో లవ్లీనా విఫలమైంది. టోక్యోలో 69 కేజీల విభాగంలో పాల్గొన్న లవ్లీనా, పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్ లేకపోవడంతో 75 కేజీలకు మారింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొన్న పర్వీన్ 63 కేజీల కేటగిరీ ఫైనల్లో పర్వీన్ 5–0 తేడాతో జపాన్ను చెందిన కిటోమై పై ఘన విజయం సాధించింది. 81 కేజీల ఫైనల్లో సవీటీ కూడా అదే జోరుతో 5–0తో గుల్‌సయా యెర్జాన్ (కజకిస్తాన్)ను ఓడించి విజేతగా నిలిచింది. 81 ప్లస్ కేటగిరీ ఫైనల్లో అల్ఫియా కూడా సత్తా చాటింది. ఆమె ప్రత్యర్థి, స్థానిక జోర్డాన్‌కే చెందిన ఇస్లామ్ హుసైలి తొలి రౌండ్లోనే డిస్క్వాలిఫై కావడంతో అల్ఫియాకు స్వర్ణం దక్కింది. అయితే మీనాక్షి మాత్రం రజతంతో సంతృప్తి చెందింది. ఫైనల్లో 1–4 తేడాతో కినో షియా రింకా (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. -
ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ల పతకాల పంట
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్–17 బాలుర 81 కేజీల విభాగంలో షేక్ లాల్ బషీర్ (విశాఖపట్నం) స్వర్ణం నెగ్గగా... జి. రవిశంకర్ (డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా) రజతం సాధించాడు. లాల్ బషీర్ (స్నాచ్‌లో 112+క్లీన్ అండ్ జెర్క్‌లో 142) మొత్తం 254 కేజీలు బరువెత్తి చాంపియన్‌గా నిలిచాడు. రవిశంకర్ (స్నాచ్‌లో 106+క్లీన్ అండ్ జెర్క్‌లో 143) మొత్తం 249 కేజీలు బరువెత్తి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–21 బాలుర 89 కేజీల విభాగంలో ఆదిబోయిన శివరామకృష్ణ యాదవ్ (డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా) రజతం గెలిచాడు. శివరామకృష్ణ యాదవ్ (స్నాచ్‌లో 125+క్లీన్ అండ్ జెర్క్‌లో 150) మొత్తం 275 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ హల్వత్ కార్తీక్ మొత్తం 269 కేజీలు బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. అండర్–17 బాలికల 76 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన చుక్కా శ్రీలక్ష్మి కాంస్య పత కాన్ని సొంతం చేసుకుంది. శ్రీలక్ష్మి మొత్తం 156 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. అండర్–21 బాలికల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో శ్రియ సాయి యనమండ్ర–గురజాడ శ్రీవిద్య (తెలంగాణ) జంట కాంస్యం సాధించింది. -
దివ్యా రెడ్డికి నాలుగు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్ దివ్యా రెడ్డి నాలుగు పతకాలతో మెరిసింది. గోవాలో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో దివ్యా రెడ్డి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించారు. ప్లస్ 35 వయో విభాగంలో పోటీపడిన దివ్యా రెడ్డి 400 మీటర్లు (1ని:15.29 సెకన్లు), 800 మీటర్ల (3ని:03 సెకన్లు) విభాగంలో పసిడి పతకాలు గెలిచారు. 1500 మీటర్ల (6ని:41 సెకన్లు) విభాగంలో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. దివ్యా రెడ్డి సభ్యురాలిగా ఉన్న తెలంగాణ బృందం 4100 మీటర్ల రిలే (1ని:07 సెకన్లు) రేసులో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నారు. విజేత హోదాలో దివ్యా రెడ్డి ఈ ఏడాది డిసెంబర్లో కౌలాలంపూర్‌లో జరిగే ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని సంపాదించారు. -
భారత్‌కు నాలుగు పతకాలు
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్ మూడో రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలుచుకుంది. మహిళల పెంటాథ్లాన్ ఈవెంట్లో పూర్ణిమా హెంబ్రామ్ బంగారు పతకం నెగ్గింది. ఐదు ఈవెంట్ల ఈ పోటీలో ఆమె 4,062 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల షాట్‌పుట్‌లో తేజిందర్ పాల్ సింగ్, మహిళల 3000 మీ. పరుగులో సంజీవని జాదవ్ చెరో రజతం గెలిచారు. మహిళల లాంగ్ జంప్‌లో నీనా వారకిల్ కాంస్యం నెగ్గింది. -
హారికకు రెండు స్వర్ణాలు
మరో రెండు రజతాలు కూడా ఆసియా నేషన్స్ కప్ చెస్ సాక్షి, హైదరాబాద్: ఆసియా నేషన్స్ కప్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మెరిసింది. ఇరాన్‌లోని తబ్రీజ్ నగరంలో ముగిసిన ఈ పోటీల్లో హారిక మొత్తం నాలుగు పతకాలు సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. క్లాసికల్ టీమ్ విభాగంలో హారిక, తానియా సచ్దేవ్, పద్మిని రౌత్, మేరీఆన్ గోమ్స్, ఇషా కరవాడేలతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. బోర్డు-1పై పోటీపడిన హారిక మూడున్నర పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. బ్లిట్జ్ ఈవెంట్లో హారిక నేతృత్వంలోని టీమిండియా స్వర్ణం కైవసం చేసుకుంది. ర్యాపిడ్ టీమ్ విభాగంలో భారత్ రజతం సాధించింది.