నలుగురు దొంగల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను టూటౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం టూటౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీలు మల్లికార్జునవర్మ, నాగసుబ్బన్న వెల్లడించారు. నగరంలో అశోక్‌నగర్‌కు చెందిన షేక్ రషీద్, షేక్ సాధిక్ హుస్సేన్ కనగానపల్లి మండలం మద్దలచెర్వుకు చెందిన ప్రభంజన్‌రెడ్డి, రామగిరి మండలం పేరూరుకు చెందిన బెస్త ప్రసాద్ ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారు.
వీరంతా పాత నేరస్తులు. 2008లో సంవత్సరంలో పేరూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో దొంగతనానికి విఫలయత్నం చేశారు. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు దొంగలపై నిఘా ఉంచిన సీసీఎస్ పోలీసులు, టూటౌన్ పోలీసులు సంయుక్తంగా కలిసి నిందితులను సాయినగర్‌లో అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.5 లక్షలు విలువజేసే 15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీలు వివరించారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ యల్లమరాజు, సిబ్బంది పాల్గొన్నారు.