four twenty
-
420 గురుస్వామి..!
తల్లాడ: ఆయనొక గురుస్వామి. ఓ మహిళ ఫిర్యాదుతో ఆయనపై ‘420’ సెక్షన్ కింద తల్లాడ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలు... ఖమ్మం నగరానికి చెందిన గూడూరు రమాదేవి, మద్యానికి బానిసగా మారిన తన భర్త రవిని దానికి (మద్యానికి) దూరం చేయాలని కోరుతూ తల్లాడకు చెందిన గురుస్వామి పస్తం రంగారావును ఆశ్రయించింది. దీనికి గురుస్వామి అంగీకరించాడు. ఇందుకుగాను పదివేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఆ మొత్తాన్ని అతడికి ఆమె ఇచ్చింది. ఆమె పలుమార్లు గురుస్వామి వద్దకు వచ్చి పూజలు చేసింది. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తానిచ్చిన డబ్బును తిరిగివ్వాలని కోరింది. పూజలు చేసినందుకు డబ్బంతా ఖర్చయిందని, తానేమీ తిరిగివ్వలేనని ఆ గురుస్వామి బదులిచ్చాడు. ఆమె గట్టిగా అడగడంతో ‘‘చేతబడి చేసి నిన్ను చంపుతా’’ అని బెదిరించాడు. ఆమె భయపడింది. తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మేడా ప్రసాద్, ఆ గురుస్వామిపై శుక్రవారం 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. -
నేనేం ఫోర్ట్వంటీని కాదు: నారా లోకేష్
రామచంద్రాపురం(చిత్తూరు): 'నేనేం ఫోర్ ట్వంటీ ని కాదు. తండ్రికి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ప్రవర్తించను. మీరు పార్టీకి అండగా ఉండండి...మీకు నేను అండగా ఉంటాను' అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిరుపతిలో మహానాడు విజయవంతం చేశారంటూ టీడీపీ వాలంటీర్లకు శుక్రవారం రామచంద్రాపురంలో సన్మాన సభను నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఉమాపతి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలను ధమ్ముంటే నిరూపించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు. తన ప్రసంగంలో కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు జగన్పై ఆరోపణలు చేస్తున్నా కార్యకర్తల నుంచి స్పందన లభించకపోవడం గమనార్హం.