ప్రతీకాత్మక చిత్రం
తల్లాడ: ఆయనొక గురుస్వామి. ఓ మహిళ ఫిర్యాదుతో ఆయనపై ‘420’ సెక్షన్ కింద తల్లాడ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలు... ఖమ్మం నగరానికి చెందిన గూడూరు రమాదేవి, మద్యానికి బానిసగా మారిన తన భర్త రవిని దానికి (మద్యానికి) దూరం చేయాలని కోరుతూ తల్లాడకు చెందిన గురుస్వామి పస్తం రంగారావును ఆశ్రయించింది.
దీనికి గురుస్వామి అంగీకరించాడు. ఇందుకుగాను పదివేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఆ మొత్తాన్ని అతడికి ఆమె ఇచ్చింది. ఆమె పలుమార్లు గురుస్వామి వద్దకు వచ్చి పూజలు చేసింది. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తానిచ్చిన డబ్బును తిరిగివ్వాలని కోరింది. పూజలు చేసినందుకు డబ్బంతా ఖర్చయిందని, తానేమీ తిరిగివ్వలేనని ఆ గురుస్వామి బదులిచ్చాడు.
ఆమె గట్టిగా అడగడంతో ‘‘చేతబడి చేసి నిన్ను చంపుతా’’ అని బెదిరించాడు. ఆమె భయపడింది. తల్లాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ మేడా ప్రసాద్, ఆ గురుస్వామిపై శుక్రవారం 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment